Sugar : తీపి పదార్దాలను ఇష్టపడని వారెవరుంటారు చెప్పండి. గులాబ్ జామూన్, జిలేబి, రసగుల్లా.. ఇలా పేర్లు చెప్తుంటేనే నోరూరిపోతుంటుంది కదా. ఇంట్లో అమ్మ చేసే పాయసం ఇతరత్రా స్వీట్స్ కూడా లాగించేస్తుంటాం. వీటితో పాటు కూల్ డ్రింక్స్, రకరకాల పానియాలు షరా మామూలే. మీరు అమితంగా స్వీట్స్ ఇష్టపడేవారైతే, తీపి పదార్థాలను తినేవారైతే మీరు కచ్చితంగా ఈ విషయాలను తప్పక తెలుసుకోవాలి. ఎందుకంటే అతిగా తీపి పదార్థాలను తింటే అనారోగ్యానికి దగ్గరగా ఉన్నామని అర్థం. తీపి పదార్థాలు తినడం మాత్రమే కాదు షుగర్ ని ఎక్కువగా కలిగి ఉండే కూల్ డ్రింక్స్, రకరకాల పండ్లు కూడా మనకు హానికరమే. షుగర్‌ని ఎక్కువగా కలిగి ఉన్న పదార్థాలను తీసుకోవడం వలన ఏయే ప్రమాదాలు పొంచి ఉన్నాయో తెలుసుకోండి.
చక్కెర ఎక్కువగా కలిగి ఉన్న పదార్థాలను తినడం వల్ల గుండె సమస్యలు వస్తాయని.. ముఖ్యంగా హార్ట్ ఎటాక్‌లు వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయని సైంటిస్టుల పరిశోధనల్లో వెల్లడైంది. అలాగే చక్కెర ఎక్కువగా తినడం వల్ల మెదడు మొద్దుబారిపోతుందట. ఆలోచనా శక్తి తగ్గుతుందట. దీంతో వయస్సు మీద పడేకొద్దీ మతిమరుపు వంటి సమస్యలు వస్తాయట. కనుక చక్కెరను పూర్తిగా తగ్గించేయడం మంచిది.
చక్కెరను అధికంగా తింటే బరువు పెరుగుతారు. ఇది డయాబెటిస్, గుండె సమస్యలకు కారణమవుతుంది. అలాగే కొలెస్ట్రాల్ స్థాయిలు పెరిగిపోతాయి. డిప్రెషన్ వస్తుంది. ఇది మానసికంగా కుంగి పోయేలా చేస్తుంది. చక్కెరను అధికంగా తినడం వల్ల పేగుల్లో కదలికలు సరిగ్గా ఉండవు. దీంతో మలబద్దకం వస్తుంది. అలాగే తిన్న ఆహారం సరిగ్గా జీర్ణం కాక అజీర్ణం వస్తుంది. చర్మంపై ముడతలు పెరిగిపోతాయి. చిన్న వయస్సులోనే వృద్ధుల్లా కనిపిస్తారు. క్యాన్సర్ కణాల పెరుగుదలకు చక్కెర సహాయం చేస్తుంది. కనుక చక్కెరను అతిగా వాడరాదు. చక్కెరను అధికంగా తినడం వల్ల రోగ నిరోధక శక్తి సైతం తగ్గుతుంది. ఇలా చక్కెరతో అనేక అనర్థాలు ఉన్నాయి కనుక దాన్ని పూర్తిగా తగ్గించేయడం మంచిది. లేదంటే మానేయాలి. దీంతో ఆరోగ్యంగా ఉండవచ్చు.