Vitamin D : మన శరీరానికి అవసరమయ్యే విటమిన్స్ లో విటమిన్ డి కూడా ఒకటి. మన శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచడంలో విటమిన్ డి ముఖ్య పాత్ర పోషిస్తుంది. శరీరంలో రోగ నిరోధక వ్యవస్థను బలంగా ఉంచడంలో, ఎముకలను ధృడంగా, ఆరోగ్యంగా ఉంచడంలో, అస్థి పంజర వ్యవస్థను సక్రమంగా ఉంచడంలో, కండరాలను బలోపేతం చేయడంలో ఇలా అనేక రకాలుగా విటమిన్ డి మనకు దోహదపడుతుంది. ఎండలో కూర్చోవడం వల్ల శరీరానికి ఎండ తగలడం వల్ల మన శరీరానికి తగినంత విటమిన్ డి లభిస్తుందన్న సంగతి మనకు తెలిసిందే. అయినప్పటికి మారిన జీవన విధానం కారణంగా మనలో చాలా మందికి ఎండలో కూర్చునేంత సమయం ఉండడం లేదు. అలాగే మారిన ఆహారపు అలవాట్ల కారణంగా శరీరానికి తగినంత విటమిన్ డి లభించడం లేదు.
దీంతో చాలా మంది విటమిన్ డి లోపంతో బాధపడుతున్నారు. ఈ సమస్య నుండి బయటపడడానికి చాలా మంది విటమిన్ డి సప్లిమెంట్స్ పై ఆధారపడుతున్నారు. విటమిన్ డి సప్లిమెంట్లు మంచివే అయినప్పటికి చాలా మందికి వాటిని ఎంత మోతాదులో తీసుకోవాలో తెలియదు. దీంతో ఈ సప్లిమెంట్స్ ను వారికి నచ్చినట్టుగా తీసుకుంటున్నారు. దీంతో శరీరంలో విటమిన్ డి స్థాయిలు అధికమై అనారోగ్య సమస్యల బారిన పడుతున్నారు. అంతేకాకుండా వివిధ రకాల అనారోగ్య సమస్యలతో బాధపడే వారు విటమిన్ డి సప్లిమెంట్స్ ను తీసుకోవడం వల్ల అవి విషపూరితమై అనారోగ్య సమస్యలు కలిగే అవకాశం ఉంది. అసలు ఈ విటమిన్ డి సప్లిమెంట్స్ ను ఎవరూ తీసుకోకూడదు… శరీరంలో విటమిన్ డి స్థాయిలు ఎక్కువవడం వల్ల మనకు కలిగే హాని ఏమిటి అన్న వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.
గ్రాన్యులోమాటస్ డిజార్డర్స్, జీర్ణక్రియ సమస్యలతో బాధపడే వారు, పుట్టుకతో వచ్చే వివిధ రకాల అనారోగ్య సమస్యలతో బాధపడే వారు విటమిన్ డి సప్లిమెంట్స్ ను తీసుకోవడం వల్ల అవి విష పూరితంగా మారే అవకాశం ఉంది. మన శరీరంలో 30 నుండి 60 ఎన్ జి/ ఎమ్ ఎల్ మోతాదులో విటమిన్ డి స్థాయిలు ఉండాలి. విటమిన్ డి స్థాయిలు ఇంత కంటే ఎక్కువగా ఉండడం వల్ల శరీరంలో క్యాల్షియం స్థాయిలు ఎక్కువవుతాయి. క్యాల్షియాన్ని గ్రహించడంలో విటమిన్ డి మనకు దోహదపడుతుంది. శరీరంలో విటమిన్ డి ఎక్కువగా ఉండడం వల్ల తిన్న ఆహారం నుండి క్యాల్షియం ఎక్కువగా గ్రహించబడుతుంది. దీంతో శరీరంలో క్యాల్షియం స్థాయిలు పెరిగి తలతిరగడం, వాంతులు, ఆకలి లేకపోవడం, హైబీపీ, మూత్రిపండాల్లో రాళ్లు వంటి సమస్యలు తలెత్తుతాయి.
అలాగే ఒత్తిడి, ఆందోళన, నిరాశ వంటి మానసికపరమైన సమస్యలు కూడా తలెత్తుతాయి. విటమిన్ డి ఎక్కువగా ఉండడం వల్ల మూత్రపిండాలకు సంబంధించిన వివిధ రకాల సమస్యలు తలెత్తుతాయి. మూత్రపిండాల ఆరోగ్యం దెబ్బతింటుంది. అంతేకాకుండా మలబద్దకం, అతిసారం, వాంతులు వంటి జీర్ణసమస్యలు కూడా తలెత్తుతాయి. కనుక విటమిన్ డి సప్లిమెంట్స్ ను ఇష్టానుసారంగా కాకుండా వైద్యున్ని సంప్రదించి తగిన మోతాదులో తీసుకోవడం మంచిది. విటమిన్ డి మన శరీరానికి అవసరమే అయినప్పటికి ఇది తగిన మోతాదులో ఉన్నప్పుడే మన ఆరోగ్యానికి మేలు కలుగుతుందని నిపుణులు చెబుతున్నారు.