Fatty Liver : మనలో చాలా మందిని వేధిస్తున్న అనారోగ్య సమస్యలల్లో ఫ్యాటీ లివర్ ఒకటి. సాధారణం కంటే 10 నుండి 15 కిలోల బరువు పెరిగిన వాళ్లందరిలో ఫ్యాటీ లివర్ ను (లివర్ కు కొవ్వు పట్టడాన్ని) మనం చూడవచ్చు. ఫ్యాటీ లివర్ వల్ల లివర్ కణాలు చురుకుగా పని చేయవు. శరీరాన్ని శుభ్ర పరచడం, శరీరం నుండి వ్యర్థాలను తొలగించడం వంటి ప్రక్రియలను లివర్ చురుకుగా నిర్వర్తించదు. దీని వల్ల శరీరంలో వ్యర్థాలు పేరుకుపోయి ఆనారోగ్య సమస్యలు తలెత్తే అవకాశం ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. కనుక ఫ్యాటీ లివర్ సమస్యను తగ్గించి లివర్ చరుకుగా పని చేసేలా చేయాలి. అందుకు గాను సాయంత్రం భోజనాన్ని 6 నుండి 7 గంటల సమయం లోపే తినాలి.
ఈ భోజనంలో కేవలం పండ్లను మాత్రమే ఆహారంగా తీసుకోవాలి. పండ్లు త్వరగా జీర్ణమవుతాయి. కనుక మన శరీరం అవయావాలను, రక్తాన్ని శుభ్రపరిచి మలినాలను తొలగించే ప్రక్రియను త్వరగా ఫ్రారంభిస్తుంది. అంతే కాకుండా పండ్ల ద్వారా వచ్చే శక్తి తక్కువగా ఉంటుంది. కనుక రాత్రి నుండి ఉదయం అల్పాహారం తినే వరకు కావల్సిన శక్తి కోసం శరీరం నిల్వ ఉన్న కొవ్వును కరిగిస్తుంది. దీంతో లివర్ లో పేరుకు పోయిన కొవ్వు కూడా కరుగుతుంది. దీనితోపాటు వారానికి ఒక రోజు తేనె, నిమ్మ రసం కలిపిన నీటిని మాత్రమే తాగుతూ ఎటువంటి ఆహార పదార్థాలను తీసుకోకుండా ఉపవాసం చేయడం వల్ల కూడా ఫ్యాటీ లివర్ సమస్య తగ్గుతుంది.
ఇలా ఉపవాసం చేయడం వల్ల లివర్ చుట్టూ పేరుకు పోయిన కొవ్వు కరగడమే కాకుండా లివర్ శరీరం నుండి మలినాలను తొలగించే ప్రక్రియను కూడా చురుకుగా నిర్వర్తిస్తుంది. అలాగే ఉపవాసం చేసిన మరుసటి రోజు ఉడికించిన ఆహార పదార్థాలను ఆహారంగా తీసుకోకుండా కేవలం పండ్లను లేదా పండ్లతో చేసిన జ్యూస్ లను మాత్రమే ఆహారంగా తీసుకోవాలి. దీనితోపాటు మధ్యాహ్న భోజనంలో కేవలం రెండు పుల్కాలను ఎక్కువ కూరతో తీసుకోవడం వల్ల శరీరంలో పేరుకుపోయిన కొవ్వు స్థాయిలు తగ్గడంతోపాటు ఫ్యాటీ లివర్ సమస్య కూడా తగ్గుతుందని నిపుణులు చెబుతున్నారు.