Cauliflower : మనం ఆహారంగా తీసుకునే కూరగాయల్లో క్యాలీప్లవర్ కూడా ఒకటి. క్యాలీప్లవర్ తో మనం రకరకాల వంటకాలను తయారు చేస్తూ ఉంటాము. క్యాలీప్లవర్ తో చేసే వంటకాలు రుచిగా ఉండడంతో పాటు వీటిని తయారు చేయడం కూడా చాలా సులభం. అలాగే క్యాలీప్లవర్ కూడా మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. ఊబకాయం నుండి బయటపడేయడంలో, గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో, ఎముకలను ధృడంగా చేయడంలో, శరీరంలో మలినాలను తొలగించడంలో ఇలా అనేక రకాలుగా క్యాలీప్లవర్ మనకు సహాయపడుతుంది. ఇది మనందరికి తెలిసిందే. అయితే మనలో చాలా మందికి తెలియని విషయం ఏమిటంటే క్యాలీప్లవర్ ను తీసుకోవడం వల్ల మనం వివిధ రకాల దుష్ప్రభావాలను కూడా ఎదుర్కోవాల్సి ఉంటుంది.
అవును.. ఈ విషయం మనలో చాలా మందికి తెలియదు. క్యాలీప్లవర్ ను తీసుకోవడం వల్ల మనం వివిధ రకాల అనారోగ్య సమస్యల బారిన పడాల్సి వస్తుంది. క్యాలీప్లవర్ లో రాఫినోస్ అనే పదార్థం ఉంటుంది. ఇది ఒక రకమైన కార్బోహైడ్రేట్. అయితే ఈ రాఫినోస్ అనేది మన శరీరంలోకి ప్రవేశించిన తరువాత విచ్చినం కాదు. జీర్ణం కాకపోవడం వల్ల మన పొట్టలో ఉండే బ్యాక్టీరియా దీనిని పులియబెట్టడం ప్రారంభిస్తుంది. దీంతో పొట్టలో గ్యాస్, నొప్పి వంటి సమస్యలు తలెత్తుతాయి. అలాగే మనం క్యాలీప్లవర్ ను తిన్న తరువాత పొట్టలో నుండి త్రేన్పుల రూపంలో ఒక వింత వాసన రావడాన్ని గమనిస్తూ ఉంటాము. దీనికి కారణం క్యాలీప్లవర్ లో గ్లూకోసినోలేట్స్ అనే రసాయనాలు ఉంటాయి. ఇవి పొట్టలో విచ్చినం అయినప్పుడు హైడ్రోజన్ సల్ఫైడ్ వంటి సమ్మేళనాలను ఏర్పరుస్తాయి.
దీంతో పొట్టలో నుండి వింత వాసన వస్తుంది. అలాగే క్యాలీప్లవర్ ను తినడం వల్ల హైపో థైరాయిడిజం సమస్య మరింత ఎక్కువవుతుంది. అలాగే క్యాలీప్లవర్ ను తినడం వల్ల మన శరీరంలో యూరిక్ యాసిడ్ ఎక్కువగా తయారవుతుంది. ఇది క్రమంగా మూత్రపిండాల్లో రాళ్లకు దారి తీయవచ్చు. కనుక క్యాలీప్లవర్ ను తగిన మొత్తంలో మాత్రమే తీసుకోవాలి. అలాగే ముఖ్యంగా జీర్ణ సమస్యలతో బాధపడే వారు మాత్రం, తిన్న ఆహారం సరిగ్గా జీర్ణం కానీ వారు క్యాలీప్లవర్ ను పచ్చిగా అస్సలు తీసుకోకూడదు. ఇలా తీసుకుంటే జీర్ణ సమస్యలు మరింత ఎక్కువయ్యే అవకాశం ఉంది. క్యాలీప్లవర్ లో యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. నీటిలో వేసి ఉడికించడం వల్ల ఇవి నశిస్తాయి. కనుక క్యాలీప్లవర్ ను ఆవిరి మీద ఉడికించి తీసుకోవడం మంచిది.