శరీరంలో అధికంగా పేరుకుపోయిన కొవ్వును కరిగించడం కోసం డైటింగులు చేయడం, తక్కువ క్యాలరీలనిచ్చే ఆహార పదార్థాలను తీసుకోవడం వంటి పనులను నేడు అధిక శాతం మంది ఊబకాయులు చేస్తున్నారు. ఈ క్రమంలో వారు రుచికరమైన, మసాలా ఆహార పదార్థాలకు దూరంగా కూడా ఉంటున్నారు. అయితే ఆహారానికి రుచిని అందించే అవే పదార్థాలను మానేయాల్సిన పని లేదని ఆయుర్వేదం చెబుతోంది. ఎందుకంటే అలాంటి పదార్థాల ద్వారా కొవ్వు సులభంగా కరుగుతుందట. మరింకెందుకు ఆలస్యం! ఆ పదార్థాలేమిటో ఇప్పుడు తెలుసుకుందామా!
అధిక బరువును తగ్గించడంలో దాల్చినచెక్క బాగా పనిచేస్తుంది. నిత్యం 1 టీ స్పూన్ మోతాదులో దాల్చిన చెక్క పొడిని ఆహారంతోపాటు తీసుకుంటే చాలు. కొన్ని రోజుల్లోనే కొవ్వు కరగడం మొదలవుతుంది. పొట్ట అధికంగా ఉందనుకున్న వారు దీన్ని ట్రై చేస్తే మంచి ఫలితం కనిపిస్తుంది. నిత్యం కొన్ని కరివేపాకు ఆకులను నమిలితే కొవ్వు దానంతట అదే కరుగుతుంది. ఎందుకంటే కొవ్వును కరిగించే ఔషధ గుణాలు కరివేపాకులో పుష్కలంగా ఉన్నాయి. లవంగాలు, జీలకర్ర తదితరాలు కలిపి తయారు చేసిన గరం మసాలా పొడిని నిత్యం 1 టీస్పూన్ మోతాదులో ఆహారంతోపాటు తీసుకున్నా సులభంగా బరువు తగ్గవచ్చు. అయితే అంతకు మించితే మాత్రం ఇతర అనారోగ్య సమస్యలు వస్తాయి.
ఘాటు మాట ఎలా ఉన్నా కారం తినడం వల్ల కూడా బరువు తగ్గవచ్చు. ఎందుకంటే క్యాప్సేసిన్ అనే ఓ రసాయనం ఈ కారం పొడిలో ఉంటుంది. అది శరీర మెటబాలిక్ ప్రక్రియను వేగవంతం చేస్తుంది. దీని వల్ల బరువు తగ్గేందుకు అవకాశం ఎక్కువగా ఉంటుంది. పసుపులో కర్క్యుమిన్ అనే ఓ రసాయన సమ్మేళనం ఎక్కువగా ఉంటుంది. ఇది శరీరంలో కొవ్వు ఎక్కువగా పేరుకుపోకుండా చూస్తుంది. కాబట్టి నిత్యం మన ఆహారంలో పసుపును భాగం చేసుకుంటే బరువు తగ్గవచ్చు. జీర్ణ వ్యవస్థను సమర్థవంతంగా పనిచేయించడంలో జీలకర్ర బాగా ఉపయోగపడుతుంది. దీన్ని నిత్యం ఆహారంతోపాటు తీసుకుంటే జీర్ణక్రియ సక్రమంగా జరిగి కొవ్వు కూడా కరుగుతుంది.