Immunity Increasing Foods : మన శరీరానికి అవసరం అయిన అనేక పోషకాల్లో జింక్ కూడా ఒకటి. జింక్ మన శరీరంలో ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది. మన శరీర రోగ నిరోధక వ్యవస్థను పటిష్ట పరచడంలో జింక్ కీలకంగా పనిచేస్తుంది. అందువల్ల మనలో జింక్ లోపం ఏర్పడకుండా చూసుకోవాలి. జింక్ మనకు పలు రకాల ఆహారాల్లో లభిస్తుంది. ఇది మన శరీరంలో ఇమ్యూనిటీ కణాలను పెంచుతుంది. దీంతో ఇన్ఫెక్షన్లు, రోగాలను మన శరీరం సమర్థవంతంగా అడ్డుకుంటుంది. జింక్ సాధారణంగా రోజుకు పురుషులకు అయితే 11 మిల్లీగ్రాములు, స్త్రీలకు 8 మిల్లీగ్రాముల మేర అవసరం అవుతుంది. ఇక జింక్ ఉండే ఆహారాలు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం.
గుమ్మడికాయ విత్తనాల్లో జింక్ సమృద్ధిగా ఉంటుంది. వీటిని మనం 30 గ్రాముల మేర తింటే మనకు దాదాపుగా 2.2 మిల్లీగ్రాముల మేర జింక్ లభిస్తుంది. గుమ్మడికాయ విత్తనాలు క్రంచీగా రుచిగా ఉంటాయి. అందువల్ల వీటిని మనం ఆహారంలో సులభంగా చేర్చుకోవచ్చు. వీటిని మనం తినే సలాడ్స్ లేదా ఉదయం తినే ఓట్స్‌పై చల్లుకుని తినవచ్చు. లేదంటే సాయంత్రం సమయంలో స్నాక్స్ రూపంలోనూ తినవచ్చు. గుమ్మడి కాయ విత్తనాలు ప్రోస్టేట్ ఆరోగ్యాన్ని మెరుగు పరుస్తాయి. అలాగే షుగర్ లెవల్స్‌ను అదుపులో ఉంచుతాయి. ఈ విత్తనాల్లో ఉండే జింక్ ఇమ్యూనిటీని పెంచుతుంది. అందువల్ల ఈ విత్తనాలను రోజూ తినాలి.
ఓట్స్‌లోనూ జింక్ అధికంగానే ఉంటుంది. ఒక కప్పు ఓట్స్‌ను తినడం ద్వారా మనకు 2.3 మిల్లీగ్రాముల మేర జింక్ లభిస్తుంది. ఓట్స్‌ను మనం అనేక రకాలుగా తినవచ్చు. వీటిని స్మూతీలు లేదా ఓట్ మీల్ రూపంలో తినవచ్చు. వీటిని తినడం వల్ల మనకు జింక్ పుష్కలంగా లభిస్తుంది. ఇది రోగ నిరోధక శక్తిని పెంచుతుంది. అలాగే ఓట్స్‌ను తింటే జీర్ణక్రియ మెరుగుపడడంతోపాటు కొలెస్ట్రాల్ లెవల్స్ కూడా తగ్గుతాయి.
మేక మాంసంలోనూ జింక్ ఎక్కువగానే ఉంటుంది. ఒక కప్పు మేక మాంసం తింటే మనకు రోజుకు కావల్సిన జింక్‌లో దాదాపుగా 100 శాతం లభిస్తుంది. అలాగే ఈ మాంసంలో మన శరీరానికి కావల్సిన ముఖ్యమైన ప్రోటీన్లు, అమైనో ఆమ్లాలు ఉంటాయి. ఇవి కండరాల నిర్మాణానికి, మరమ్మత్తులకు ఎంతగానో ఉపయోగపడతాయి. అందువల్ల మేక మాంసాన్ని తినవచ్చు. కానీ దీన్ని మరీ అతిగా తినకూడదు.
ఇక శనగలు, ఇతర పప్పు దినుసులను తినడం వల్ల కూడా మనకు జింక్ అధికంగానే లభిస్తుంది. 100 గ్రాముల పప్పు దినుసుల ద్వారా మనకు రోజుకు కావల్సిన జింక్‌లో 12 శాతం వరకు లభిస్తుంది. ఇక పప్పు దినుసులను తింటే మనకు ఫైబర్ సమృద్ధిగా లభిస్తుంది. అలాగే వీటిల్లో అనేక విటమిన్లు, మినరల్స్ కూడా ఉంటాయి. ఇవన్నీ మన జీర్ణవ్యవస్థను ఆరోగ్యంగా ఉంచడంతోపాటు మనకు తీవ్రమైన రోగాలు రాకుండా చూస్తాయి.
జింక్ అధికంగా ఉండే ఆహారాల్లో చీజ్ కూడా ఒకటి. అలాగే పాలలోనూ జింక్ అధికంగానే ఉంటుంది. దీంతోపాటు ఇతర పాల ఉత్పత్తులను తీసుకుంటున్నా కూడా మనకు జింక్ లభిస్తుంది. కోడిగుడ్లు, డార్క్ చాకొలెట్లను తినడం వల్ల కూడా మనకు పుష్కలంగా జింక్ లభిస్తుంది. ఇలా ఈ ఆహారాలను తరచూ తింటుంటే జింక్ తగినంతగా లభించి మన రోగ నిరోధక వ్యవస్థ పటిష్టంగా మారుతుంది. దీంతో సీజనల్ వ్యాధుల నుంచి రక్షణ పొందవచ్చు.