సీజన్లు మారే సమయంలో అందరినీ దగ్గు, జలుబు, ఇతర శ్వాసకోశ సమస్యలు ఇబ్బందులకు గురి చేస్తుంటాయి. దీంతో ఏ పని చేయాలనిపించదు. చికాకుగా కూడా ఉంటుంది. అయితే ఇమ్యూనిటీ పవర్ ను పెంచుకుంటే ఈ సమస్యల నుంచి బయట పడవచ్చు. మన శరీర రోగ నిరోధక శక్తిని పెంచేందుకు పలు ఆహారాలు మనకు అందుబాటులో ఉన్నాయి. వీటిని తరచూ ఆహారంలో భాగం చేసుకోవడం ద్వారా ఇమ్యూనిటీ పవర్ రెండింతలు పెరుగుతుంది. దీంతో దగ్గు, జలుబు, ఫ్లూ వంటి సమస్యలు రాకుండా అడ్డుకోవచ్చు. ఇక ఈ సమస్యలు ఇప్పటికే ఉన్నవారు కూడా ఈ వీటిని తింటే ఆయా వ్యాధుల నుంచి బయట పడవచ్చు. ఇక రోగ నిరోధక శక్తిని పెంచే ఆ ఆహారాలు ఏమిటంటే..
విటమిన్ సి ఎక్కువగా ఉండే ఆహారాన్ని తీసుకోవడం వల్ల వైరస్‌పై పోరాడి ఇన్‌ఫెక్షన్లు రాకుండా కాపాడుతుంది. టమాట, బంగాళదుంప వంటి కూరగాయల్లో, నారింజ, నిమ్మ, కమలా, కివి పండ్లలో విటమిన్ సి ఉంటుంది. శరీరం కోల్పోయిన యాంటీ బాడీ కణాలు తిరిగి పునఃనిర్మితం కావడంలో జింక్ తోడ్పడుతుంది. గుడ్లు, మాసం, పెరుగు, పాలు, బీన్స్, సీఫుడ్‌లలో జింక్ లభిస్తుంది. ప్రతిరోజూ ఒక కప్పు తాజా పెరుగును తీసుకోవాలి. ఇది జీర్ణాశయంలో ఉండే బాక్టీరియాను నిర్మూలిస్తుంది.
ప్రతిరోజు అరకప్పు తాజా క్యారెట్‌ను తినాలి. దీనిలో ఉండే బీటా కెరోటిన్, విటమిన్ బి6లు యాంటీ బాడీ కణాల ఉత్పత్తిని ఉత్తేజపరుస్తాయి. వెల్లుల్లిలో ఉండే మినరల్స్ బాక్టీరియా, ఫంగస్ ఇన్‌ఫెక్షన్‌లపై పోరాడేలా చేస్తాయి. ప్రతిరోజూ ఆహారంలో ఒక స్పూన్ వెల్లుల్లి తీసుకోవడం వల్ల ఆరోగ్యంగా ఉంటారు. రోజూ నాలుగు లేదా ఐదు ఖర్జూరాలను తీసుకోవడం వల్ల శరీరంలో సరిపడా ఐరన్ పెరుగుతుంది. ఇది ఇమ్యూనిటీని పెంచుతుంది. పొటాషియం అధికంగా ఉండే అరటి పండ్లు తదితర ఆహారాలను తింటున్నా కూడా రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. దీంతోపాటు శరీరానికి ఉత్తేజం, ఉత్సాహం లభిస్తాయి. యాక్టివ్‌గా ఉంటారు.