నేటి తరుణంలో అధిక బరువును తగ్గించుకునేందుకు చాలా మంది నానా తంటాలు పడుతున్నారు. అందులో భాగంగానే అనేక రకాల డైట్‌లను పాటిస్తున్నారు. ఈ క్రమంలో ఇటీవలి కాలంలో కీటోడైట్ బాగా పాపులర్ అయింది. అందులో కేవలం కొవ్వులు, ప్రోటీన్లు ఉన్న ఆహారా పదార్థాలనే ఎక్కువగా తినాల్సి ఉంటుంది. కార్బొహైడ్రేట్లను అస్సలు తీసుకోరాదు, లేదా చాలా చాలా తక్కువగా తినాలి. దీంతో శరీరం కీటో శక్తి మీద పనిచేస్తుంది. అప్పుడు అధిక బరువు తగ్గడంతోపాటు ఇతర ఆరోగ్యకర ప్రయోజనాలు కూడా కలుగుతాయి. అయితే ఈ డైట్ మాత్రమే కాదు.. అధిక బరువు తగ్గేందుకు ఇంకో విధానం కూడా మనకు అందుబాటులో ఉంది.. అదే ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్.. ఇంతకీ ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్ అంటే ఏమిటి..? దాన్ని ఎలా చేయాలి..? దాంతో మనకు ఎలాంటి లాభాలు కలుగుతాయి..? ఇప్పుడు తెలుసుకుందాం..!
ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్ అంటే.. తినే తిండికి బ్రేక్ ఇచ్చి ఫాస్టింగ్ (ఉపవాసం) ఉండడం.. ఏంటీ.. అర్థం కాలేదా..? ఏమీ లేదండీ.. రోజుకు 24 గంటలు కదా.. అందులో 14 నుంచి 16 లేదా 18, 20 గంటల పాటు ఉపవాసం ఉండాలి. మిగిలిన సమయంలో మాత్రమే ఆహారం తినాలి. దీన్నే ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్ అంటారు. అంటే.. 24 గంటల్లో 14 గంటలు ఏమీ తినకుండా మిగిలిన 10 గంటల్లో ఆహారం తినాలన్నమాట. అలాగే 16 గంటలు ఫాస్టింగ్ ఉంటే మిగిలిన 8 గంటల్లోనే ఆహారం తీసుకోవాలి. ఇక 18 లేదా 20 గంటల పాటు ఫాస్టింగ్ ఉంటే.. మిగిలిన 6 లేదా 4 గంటల పాటు మాత్రమే ఆహారం తినాలి. ఇదీ ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్ రూల్..!
అయితే రోజు విడిచి రోజు లేదా రెండు రోజులకు, మూడు రోజులకు ఒకసారి రోజు మొత్తం ఆహారం తినకుండా కేవలం నీరు లేదా ఇతర డ్రింక్స్ మాత్రమే తాగి ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్ చేసేవారు కూడా ఉన్నారు. అయితే ఎలా చేసినా ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్‌తో మనకు అనేక రకాల లాభాలు కలుగుతాయి. అవేమిటంటే…
1. ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్ వల్ల మనకు కలిగే ముఖ్యమైన లాభాల్లో ఒకటి.. అధిక బరువు తగ్గడం. ఈ ఫాస్టింగ్ చేయడం వల్ల బరువు త్వరగా తగ్గవచ్చు. అలాగే బరువు కూడా నియంత్రణలో ఉంటుంది.
2. ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్ రోజూ చేస్తే డయాబెటిస్ అదుపులో ఉంటుంది. ముఖ్యంగా ఇన్సులిన్ రెసిస్టెన్స్ తగ్గుతుంది. టైప్ 2 డయాబెటిస్ ఉన్నవారిలో ఇన్సులిన్ రెసిస్టెన్స్ కారణంగానే షుగర్ ఎక్కువవుతుంది. కనుక అలాంటి వారు ఈ ఫాస్టింగ్ చేస్తే ఇన్సులిన్ రెసిస్టెన్స్ తగ్గుతుంది. దీంతో డయాబెటిస్ సమర్థవంతంగా అదుపులో ఉంటుంది.
3. ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్ చేయడం వల్ల శరీరంలో జీవక్రియలు సరిగ్గా జరుగుతాయి. హార్మోన్ల సమస్యలు పోతాయి. ముఖ్యంగా థైరాయిడ్ ఉన్నవారు ఈ ఫాస్టింగ్ చేస్తే ఉపయోగం ఉంటుంది.
4. ఈ ఫాస్టింగ్ లో జీర్ణవ్యవస్థకే కాదు, శరీరంలోని ఇతర భాగాలకు కూడా చాలా సమయం పాటు రెస్ట్ దొరుకుతుంది. దీంతో ఆ భాగాలు ఆ సమయంలో ఏమైనా మరమ్మత్తులు ఉంటే చేసుకుంటాయి. ఫలితంగా ఇన్‌ఫెక్షన్లు తగ్గుతాయి. శరీర రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. అలాగే క్యాన్సర్ వంటి వ్యాధులు రాకుండా ఉంటాయి.
5. ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్ వల్ల శరీరానికి ఒక క్రమబద్దమైన జీవన విధానం అలవాటు అవుతుంది. అందుకు తగ్గట్టుగా జీవగడియారం పనిచేస్తుంది. అంటే.. రోజులో ఒకే టైంలో ఆహారం తింటారు.. మిగిలిన టైంలో రెస్ట్ ఇస్తారు కనుక.. ఆ సమయంలోనే అవయవాలు పనిచేయాలనే నిర్ణయానికి వస్తాయి. దీంతో అన్ని అవయవాలు అందుకు తగ్గట్టుగా పనిచేస్తాయి. ఎప్పుడు ఏ అవయవం పనిచేయాలో అదే పనిచేస్తుంది. ఇతర అవయవాలు చాలా వరకు రెస్ట్ తీసుకుంటాయి. ఈ క్రమంలో ఆరోగ్యంగా ఉంటారు. అలాగే గుండెపై ఎక్కువ భారం పడకుండా ఉంటుంది. దీంతో గుండె జబ్బులు రాకుండా ఉంటాయి.