Afternoon Sleep : మన శరీరానికి నిద్ర ఎంతో అవసరం. నిద్ర అనేది ప్రతి ఒక్కరికీ ఎంతో అవసరమైన జీవన క్రియ. అది ఎక్కువైనా, తక్కువైనా మానసిక, శారీరక సమస్యలను ఎదుర్కొవాల్సి వస్తుంది. జీవనోసాధికి పగలంతా పని చేయడం అలవాటవడంతో రాత్రి వేళ నిద్ర పోవడం అనేది అనాదిగా అలవాటైపోయింది. కానీ కొన్ని కారణాల వల్ల రాత్రి నిద్ర సరిగ్గా పట్టక పగలంతా చురుకుగా ఉండలేకపోతున్న వారు ఎందరో. మనకు ఆహారం ఎంత ముఖ్యమో నిద్ర కూడా అంతే అవసరం. కానీ ప్రస్తుత కాలంలో నిద్రలేమి ఒక జబ్బుగా తయారయ్యింది.
సుదీర్ఘ పని గంటలు, ఆర్థిక ఇబ్బందులు, దాంపత్య సమస్యలు ఇవి అన్నీ మానసికి ఒత్తిళ్లను పెంచే అంశాలైతే గాడి తప్పిన ఆహారపు అలవాట్లు, పోషకాహార లోపం, అనారోగ్య సమస్యలు, మానసిక ఆందోళనలు ఇవి అన్నీ నిద్రలేమికి దారి తీస్తున్న అంశాలు. రోజులో కూడా పని ఒత్తిడి వల్ల కూడా చురుకుదనం తగ్గిపోయి అలిసిపోయినట్టుగా అనిపిస్తుంది. రాత్రి ఎంత నిద్రించినా కూడా మధ్యాహ్న వేళ చిన్న పాటి కునుకు చాలా ఉపయోగకరంగా ఉంటుంది. హాయిగా మధ్యాహ్నం ఒక గంట పాటు నిద్రపోతే చక్కటి ఆరోగ్యాన్ని సొంతం చేసుకోవచ్చు.
మనలో చాలా మంది మధ్యాహ్నం భోజనం చేసిన తరువాత కానీ తీరిక దొరికినప్పుడు కానీ ఒక కునుకు తీయడం చూస్తూ ఉంటాం. ఇలా నిద్రించడం వల్ల శరీరం పునరుత్తేజం అవుతుంది. ఇలా మధ్యాహ్నం నిద్రించడం వల్ల మానసిక, శారీరకపరమైన ఒత్తిళ్లు దరి చేరకుండా ఉంటాయి. తాజాగా జరిపిన పరిశోధనల ప్రకారం మధ్యాహ్నం చిన్న కునుకు తీయడం వల్ల జ్ఞాపకశక్తి పెరుగుతుందని తేలింది. మధ్యాహ్నం పూట కొద్ది సేపు నిద్రించడం వల్ల బీపీ తగ్గుతుంది. గుండె ఆరోగ్యం మెరుగుపడుతుంది. హార్మోన్ల సమస్యలు తగ్గు ముఖం పడతాయి. రక్తనాళాలు శుభ్రపడతాయి.
రాత్రి ఆలస్యంగా నిద్రపోవడం వల్ల కలిగే ఒత్తిడిని మధ్యాహ్నం నిద్రించడం వల్ల తగ్గించుకోవచ్చు. మధ్యాహ్న సమయంలో 30 నిమిషాల పాటు నిద్రపోవడం వల్ల ఆ తరువాత పనిని ఉత్సాహంగా చేస్తారు. ఆశ్చర్యకరమైన విషయం ఏంటేంటే మగ వారితో పోలిస్తే ఆడవారిలో మధ్యాహ్నం నిద్రించడం వల్ల కలిగే లాభాలు కొద్దిగా తక్కువగా ఉంటాయి. మధ్యాహ్నం నిద్రించడం వల్ల చురుకుదనాన్ని, ఏకాగ్రతను పెంచుకోవచ్చు. అయితే మధ్యాహ్నం నిద్ర 30 నిమిషాలు దాటితే మాత్రం అది ప్రమాదంగా మారుతుంది. మధ్యాహ్నం భోజనం తరువాత 30 నిమిషాల కంటే ఎక్కువగా నిద్రపోయిన వారి శరీరంలో జీవక్రియ రేటు దెబ్బతింటుంది.
జీవక్రియ దెబ్బతినడం వల్ల పొట్ట, నడుము దగ్గర కొవ్వు పేరుకుపోవడం, రక్తపోటు అధికంగా పెరగడం, రక్తంలో చక్కెర స్థాయిలు పెరుగుతాయని తేలింది. అంతేకాకుండా దీని ద్వారా గుండెపోటు వచ్చి ప్రాణాలు పోయే ప్రమాదం ఉంటుందట. అయితే మధ్యాహ్నం 30 నిమిషాల కంటే తక్కువగా నిద్రపోవడం వల్ల వచ్చే ప్రమాదం ఏమీ లేదు. మనలో చాలా మంది ఉత్తేజంగా ఉండడానికి కాఫీని ఎక్కువగా తాగుతూ ఉంటారు. కాఫీని తాగడానికి బదులుగా చిన్న కునుకు తీయడం ఆరోగ్యానికి మంచిది. మధ్యాహ్నం సమయంలో 30 నిమిషాలు నిద్రించడం వల్ల మనం ఎన్నో ఆరోగ్యకరమైన ప్రయోజనాలను పొందవచ్చని నిపుణులు చెబుతున్నారు.