Coffee : మనం రోజూ ఉదయం తాగే ద్రవాల్లో టీ లేదా కాఫీ కూడా ఒకటి. రెండూ దాదాపుగా ఒకేలాంటి రుచిని కలిగి ఉంటాయి. కానీ కాఫీలో కెఫీన్ ఎక్కువగా ఉంటుంది, అలాగే కాస్త చేదుగా కూడా ఉంటుంది. అయితే కాఫీని సేవించడం ఆరోగ్యానికి మంచిదేనా.. అని చాలా మంది సందేహిస్తుంటారు. కాఫీ తాగడం వల్ల ఆరోగ్యానికి ఏదైనా హాని కలుగుతుందా.. దీన్ని ఆరోగ్యకరమైన రీతిలో తాగలేమా.. అని ఆలోచిస్తుంటారు. అయితే కాఫీ గురించి వైద్యులు ఏమని చెబుతున్నారో ఇప్పుడు తెలుసుకుందాం.
కాఫీని తాగడం ఆరోగ్యానికి మంచిదే. హానికరం కాదు. కానీ దీన్ని తాగే సమయమే ముఖ్యం. సాయంత్రం తరువాత ఎట్టి పరిస్థితిలోనూ కాఫీ తాగకూడదు. తాగితే రాత్రి పూట మీ నిద్రకు తీవ్రమైన భంగం కలుగుతుంది. అలాగే భోజనానికి ముందు కానీ, భోజనం చేసిన వెంటనే కానీ కాఫీ తాగకూడదు. లేదంటే జీర్ణవ్యవస్థపై ప్రభావం పడుతుంది. గ్యాస్, కడుపులో మంట ఏర్పడుతాయి. ఇక అన్నింటి కన్నా బ్లాక్ కాఫీని తాగడం ఉత్తమం అని వైద్యులు చెబుతున్నారు.
బ్లాక్ కాఫీ తాగితే మేలు..
బ్లాక్ కాఫీలో క్యాలరీలు చాలా తక్కువగా ఉంటాయి. కేవలం కాఫీ పొడిని డికాషన్‌లా తయారు చేసి తాగుతారు. కనుక ఇందులో చక్కెర, పాలు ఉండవు. కాబట్టి బ్లాక్ కాఫీ ఆరోగ్యకరమైందని వైద్యులు చెబుతున్నారు. అందువల్ల కాఫీ తాగేవారు రోజూ ఒక కప్పు బ్లాక్ కాఫీ తాగితే మేలు జరుగుతుంది.
ఇక కాఫీని కొందరు చల్లగా, కొందరు వేడిగా ఇష్టపడతారు. కానీ వాస్తవానికి మనం వాతావరణానికి అనుగుణంగా ఈ కాఫీలను తాగాలి. అంటే.. చల్లని వాతావరణం ఉంటే బ్లాక్ కాఫీని వేడిగా తాగాలి. అదే వేడి వాతావరణం ఉంటే కాఫీని చల్లగా తాగాలి. అలాగే బ్లాక్ కాఫీలో కాస్త దాల్చిన చెక్క పొడిని కలిపి తాగితే ఇంకా మంచిది. దీంతో యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా లభించి రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. అదేవిధంగా కొలెస్ట్రాల్, షుగర్ లెవల్స్ కూడా తగ్గుతాయి. గుండె ఆరోగ్యంగా ఉంటుంది.
పాలు, చక్కెర లేకుండా తాగాలి..
మీరు కాఫీని ఎప్పుడు తాగాలన్నా తాగవచ్చు. కానీ పరగడుపున లేదా సాయంత్రం తరువాత అసలు తాగకూడదు. ఇక కాఫీలో పాలు, చక్కెర కలపకుండా తాగితేనే మేలు. ఈవిధంగా కాఫీని తాగడం వల్ల ఆరోగ్యకరమైన ప్రయోజనాలను పొందవచ్చని వైద్యులు చెబుతున్నారు.