Junnu Benefits : జున్ను.. ఇది తెలియని వారు..దీనిని రుచి చూడని వారు ఉండరనే చెప్పవచ్చు. ఆవులు, గేదెలు ఈనిన తరువాత వారం రోజుల పాటు మనకు జున్ను పాలు లభిస్తాయి. ఈ పాలు గోధుమ రంగులో ఉంటాయి. ఈ పాలకు బెల్లం లేదా చక్కెర అలాగే యాలకుల పొడి, మిరియాల పొడి కలిపి జున్నును తయారు చేస్తారు. జున్ను చాలా రుచిగా ఉంటుంది. అలాగే జున్నును తినడం వల్ల మన ఆరోగ్యానికి కూడా మేలు కలుగుతుంది. జున్ను పాలల్లో ప్రోటీన్స్, క్యాలరీలతో పాటు ఇతర పోషకాలు కూడా ఎక్కువగా ఉంటాయి. డ్రై ఫ్రూట్స్ లో ఉండే ప్రోటీన్ ల కంటే జున్ను పాలల్లో ఎక్కువ ప్రోటీన్స్ ఉంటాయి. జున్నును తీసుకోవడం వల్ల ప్రోటీన్ లోపం తలెత్తకుండా ఉంటుంది. జున్ను పాలల్లో అధికంగా క్యాలరీలు ఉంటాయి.
వీటికి పంచదార, బెల్లం కలిపి జున్నును చేయడం వల్ల క్యాలరీల శాతం మరింత పెరుగుతుంది. కనుక బరువు తగ్గాలనుకునే వారు తగిన మోతాదులో మాత్రమే దీనిని తీసుకోవాలి. జున్ను పాలను తీసుకోవడం వల్ల పొట్టలో ఉండే మంచి బ్యాక్టీరియా శాతం పెరుగుతుంది. శరీరం బలంగా, ధృడంగా తయారవుతుంది. శరీరంలో రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. జున్నును తీసుకోవడం వల్ల శరీరానికి చలువ చేస్తుంది. నిద్రలేమి సమస్య దూరం అవుతుంది. రక్తం శుద్ది అవుతుంది. అయితే జున్ను పాలల్లో పోషకాలు సాధారణ పాలల్లో కంటే అధికంగా ఉంటాయి. కనుక జీర్ణశక్తి తక్కువగా ఉన్న వారు జున్నును తక్కువ మోతాదులో తీసుకోవాలి. లేదంటే శరీరంలో వాతం, కఫం, కడుపు నొప్పి వంటి సమస్యలు తలెత్తే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి.
అలాగే వాతం వల్ల కలిగే నొప్పులతో బాధపడే వారు కూడా దీనిని తక్కువగా తీసుకోవాలి. అలాగే జున్ను కొందరిలో అలర్జీలను కలిగించే అవకాశం కూడా ఉంది. ఏది ఏమైనప్పటికి జున్ను మనకు సహజ సిద్దంగా లభించే పదార్థం. కనుక ఇది లభించినప్పుడు తప్పకుండా ఆహారంగా తీసుకోవాలి. జున్ను తీసుకోవడం వల్ల మన ఆరోగ్యానికి ఎంతో మేలు కలుగుతుంది. అయితే దీనిని తగిన మోతాదులో తీసుకున్నప్పుడు మాత్రమే మన ఆరోగ్యానికి మేలు కలుగుతుందని నిపుణులు చెబుతున్నారు.