మనం ఆరోగ్యంగా ఉండాలంటే రోజూ పౌష్టికాహారాన్ని తీసుకోవడం ఎంత అవసరమో.. తగినన్ని నీళ్లను తాగడం కూడా అంతే అవసరం. నీళ్లను తాగడం వల్ల జీవక్రియలు సరిగ్గా నిర్వహించబడతాయి. శరీర ఉష్ణోగ్రత, ద్రవాలు నియంత్రణలో ఉంటాయి. తిన్న ఆహారం సరిగ్గా జీర్ణమవుతుంది. మలబద్దకం ఉండదు.
అయితే రోజుకు ఎన్ని నీళ్లను తాగాలి ? అనే విషయంలోనే చాలా మంది కన్‌ఫ్యూజ్ అవుతుంటారు. కొందరు 8 గ్లాసుల నీళ్లు తాగాలని అంటే, కొందరు 2 లీటర్ల నీటిని తాగాలని చెబుతుంటారు. అయితే మీ శరీర బరువు ప్రకారం మీరు రోజూ నీళ్లను తాగాల్సి ఉంటుంది. అలాగే మీరు వ్యాయామం లేదా శారీరక శ్రమ చేస్తే ఇంకొన్ని ఎక్కువ నీళ్లను తాగాలి. మరి శరీర బరువు ప్రకారం ఏ వ్యక్తి అయినా రోజుకు ఎన్ని నీళ్లను తాగాలో ఇప్పుడు తెలుసుకుందామా..!
మీ శరీర బరువు ప్రకారం నీళ్లను తాగేందుకు న్యూట్రిషనిస్టులు ఓ సులభమైన ఫార్ములాను చెబుతున్నారు. అదేమిటంటే.. మీ శరీర బరువును 30తో భాగించండి. అప్పుడు వచ్చే అంకె ప్రకారం నీళ్లను తాగండి. అంటే.. మీ శరీర బరువు ఉదాహరణకు 90 కిలోలు ఉందనుకుందాం. 90ని 30తో భాగించండి. 90/30 = 3 సమాధానం వస్తుంది. అంటే 90 కిలోల బరువు ఉన్న వ్యక్తి రోజుకు కనీసం 3 లీటర్ల మేర నీటిని తాగాలని అర్థం.
ఇక 80 కిలోలు ఉన్నవారు 2.66 లీటర్ల నీటిని రోజుకు కనీసం తాగాలి. అంటే 2 లీటర్ల 660 ఎంఎల్ అన్నమాట. ఇలా శరీర బరువును 30తో భాగించి అనంతరం వచ్చే అంకె ప్రకారం రోజూ నీళ్లను తాగాల్సి ఉంటుంది.
అయితే శారీరక శ్రమ చేసేవారు, వ్యాయామం చేసే వారి నుంచి చెమట ఎక్కువగా వస్తుంది. అలాగే వేడిగా ఉండే ప్రదేశాల్లో నివసించే వారికి కూడా చెమట బాగా వస్తుంది. కనుక వారు మరో 700 ఎంఎల్ వరకు నీళ్లను పైన తెలిపిన దానికి అదనంగా తాగాల్సి ఉంటుంది. అంటే 90 కిలోల బరువు ఉన్న వ్యక్తి పైన తెలిపిన లెక్క ప్రకారం రోజుకు 3 లీటర్ల మేర నీటిని తాగితే.. అతను రోజూ శారీరక శ్రమ లేదా వ్యాయామం చేస్తుంటే.. అతను అదనంగా 700 ఎంఎల్ మేర నీటిని తాగాలన్నమాట.
ఈ విధంగా లెక్కించి ఎవరికి వారు తమ శరీర బరువుకు అనుగుణంగా రోజూ నీళ్లను తాగాల్సి ఉంటుంది. దీంతో శరీరం ఆరోగ్యంగా ఉంటుంది.