మన శరీరంలో ఉన్న అనేక అవయవాల్లో లివర్ (కాలేయం) కూడా ఒకటి. ఇది అనేక పనులు చేస్తుంది. మనం తిన్న ఆహారంలో ఉండే పోషకాలను శరీరం ఉపయోగించుకునేలా చేస్తుంది. అలాగే శరీరంలో ఉండే వ్యర్థాలను బయటకు పంపుతుంది. కానీ నిత్యం మనం తినే పలు ఆహార పదార్థాల వల్ల లివర్ ఆరోగ్యం దెబ్బ తింటుంది. మరి ఆ ఆహారాలు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందామా..!
1. మద్యం
మద్యం అతిగా సేవించడం వల్ల లివర్ దెబ్బ తింటుంది. అదేపనిగా రోజూ మద్యం సేవిస్తుంటే కొంత కాలానికి లివర్ చెడిపోయి పనిచేయకుండా అవుతుంది. దీంతో తీవ్రమైన అనారోగ్య సమస్యలు వస్తాయి. కనుక లివర్ ఆరోగ్యంగా ఉండాలంటే మద్యం సేవించడం మానేయాలి. లేదా చాలా తక్కువ మోతాదులో ఎప్పుడో ఒకసారి తాగాలి. అంతేకానీ నిత్యం మద్యం సేవిస్తే అంతే సంగతులు.
2. స్వీట్లు
చక్కెర ఎక్కువగా ఉండే స్వీట్లను అతిగా సేవించినా లివర్ నాశనం అవుతుంది. దీని వల్ల లివర్‌లో కొవ్వు పేరుకుపోతుంది. ఫలితంగా ఫ్యాటీ లివర్ సమస్య వస్తుంది. కాబట్టి ఈ ఆహారాలను కూడా తక్కువగా తినాలి లేదా పూర్తిగా మానేయాలి.
3. టేస్టింగ్ సాల్ట్
ప్రస్తుతం అనేక మంది రుచి కోసం ఆహారాల్లో టేస్టింగ్ సాల్ట్‌ను కలుపుతున్నారు. ముఖ్యంగా బయట ఫాస్ట్‌ఫుడ్ సెంటర్లు, బేకరీల్లో అనేక పదార్థాల్లో దీన్ని వేస్తున్నారు. ఇది కాలేయంపై ప్రభావం చూపిస్తుంది. లివర్ వాపునకు గురవుతుంది. కనుక ఆయా పదార్థాలను కూడా తినకూడదు.
4. విటమిన్ ఎ
శరీర రోగ నిరోధక శక్తి పెరిగేందుకు, కంటి చూపుకు విటమిన్ ఎ ఎంతగానో దోహదపడుతుంది. అయితే విటమిన్ ఎ ను నిత్యం అవసరం ఉన్నదానికన్నా ఎక్కువ మోతాదులో తీసుకుంటే దాంతో లివర్ సమస్యలు వస్తాయి. లివర్ అనారోగ్యం బారిన పడుతుంది.
5. కూల్ డ్రింక్స్
కొందరు కూల్ డ్రింక్స్‌ను అదే పనిగా తాగుతుంటారు. అయితే అలాంటి వారికి లివర్ వ్యాధులు వచ్చేందుకు అవకాశం ఉంటుంది. కనుక ఆ డ్రింక్స్ ను తక్కువగా తీసుకోవాలి.
6. డిప్రెషన్ మెడిసిన్
డిప్రెషన్‌కు మెడిసిన్ తీసుకునే వారిలోనూ లివర్ జబ్బులు వచ్చేందుకు అవకాశం ఉంటుంది. కనుక ఈ మందులు వేసుకునే వారు ఎప్పటికప్పుడు లివర్ ఆరోగ్యంగా ఉందో, లేదో చెక్ చేయించుకోవాలి. లేదంటే తీవ్ర సమస్యలు వస్తాయి.
7. ఉప్పు
నిత్యం ఆహారంలో ఉప్పు ఎక్కువగా తీసుకోవడం వల్ల బీపీ పెరుగుతుంది. దీంతోపాటు లివర్ ఆరోగ్యం కూడా దెబ్బ తింటుంది.
8. జంక్‌ఫుడ్
బేకరీ పదార్థాలు, నూనె పదార్థాలు, ఇతర జంక్ ఫుడ్‌ను ఎక్కువగా తీసుకుంటే కాలేయం దెబ్బ తింటుంది. కనుక ఈ పదార్థాలకు కూడా దూరంగా ఉంటే లివర్ ఆరోగ్యంగా ఉంటుంది.