మలబద్దకం సమస్య అనేది చాలా మందికి వస్తూనే ఉంటుంది. ఇది తీవ్ర ఇబ్బందిని, అవస్థను కలిగిస్తుంది. దేశ జనాభాలో 20 శాతం మంది మలబద్దకంతో బాధపడుతున్నారని గణాంకాలు చెబుతున్నాయి. జీవనశైలిలో మార్పులు రావడం, పలు ఇతర కారణాల వల్ల చాలా మందికి మలబద్దకం వస్తుంటుంది. దీన్ని నిర్లక్ష్యం చేస్తే తీవ్ర సమస్యగా మారుతుంది. అందువల్ల మలబద్దకం ఉన్న వారు వెంటనే స్పందించాలి. అందుకు గాను కింద తెలిపిన పలు చిట్కాలను పాటించాలి. దీంతో ఆ సమస్య నుంచి బయట పడవచ్చు. మరి ఆ చిట్కాలు ఏమిటంటే..
1. రోజూ చాలా మంది అనారోగ్యకరమైన కొవ్వులు ఉండే ఆహారాలను తింటుంటారు. అవి మలబద్దకం సమస్యకు కారణమవుతాయి. కనుక ఆరోగ్యకరమైన కొవ్వులు ఉండే ఆహారాలను తీసుకోవాలి. ఆలివ్ ఆయిల్ లేదా ఆముదంలను రోజూ ఆహారంలో స్వల్ప మోతాదులో తీసుకుంటే చాలు, మలబద్దకం సమస్య నుంచి బయట పడవచ్చు. ఈ నూనెలు పేగుల్లో మలం కదలికలను నియంత్రిస్తాయి. దీంతో మలబద్దకం తగ్గుతుంది. సుఖ విరేచనం అవుతుంది.
2. పుదీనా ఆకులు, అల్లంలో జీర్ణవ్యవస్థకు ఉపయోగపడే శక్తివంతమైన ఎంజైమ్‌లు ఉంటాయి. ఇవి జీర్ణ సమస్యలను తగ్గిస్తాయి. పుదీనా ఆకులు, చిన్న అల్లం ముక్కను నీటిలో వేసి మరిగించి ఆ డికాషన్ తాగితే శరీరంలోని వ్యర్థాలు బయటకు పోతాయి. మలబద్దకం తగ్గుతుంది. రాత్రి భోజనం చేసిన తరువాత ఈ డికాషన్ తాగితే మంచిది.
3. విటమిన్ సి అధికంగా ఉండే ఆహారాలను తీసుకోవడం వల్ల జీర్ణశక్తి పెరుగుతుంది. జీర్ణ సమస్యలు ఉండవు. రోజూ ఉదయాన్నే పరగడుపునే ఒక గ్లాస్ గోరు వెచ్చని నీటిలో కొద్దిగా నిమ్మరసం కలపుకుని తాగితే మలబద్దకం తగ్గుతుంది. అలాగే విటమిన్ సి ఉండే ఆహారాలను రోజూ తీసుకోవాలి. దీంతో జీర్ణ సమస్యలు ఉండవు.
4. నువ్వులను తరచూ ఆహారంలో భాగం చేసుకోవాలి. వీటిల్లో మన శరీరానికి అవసరమైన నూనెలు ఉంటాయి. ఇవి మలబద్దకాన్ని తగ్గిస్తాయి.
5. ఫైబర్ తక్కువగా ఉండే ఆహారాలను తీసుకోవడం వల్ల కూడా మలబద్దకం వస్తుంది. కనుక రోజూ తాజా ఆకుకూరలు, కూరగాయలు, పండ్లను తీసుకోవాలి. వాటి ద్వారా ఫైబర్ బాగా అందుతుంది. మలబద్దకం సమస్య నుంచి ఉపశమనం లభిస్తుంది.
ఎప్పటికప్పుడు అప్‌డేట్స్ కోసం టెలిగ్రామ్‌లో మమ్మల్ని ఫాలో అవ్వండి: Ayurvedam365