Rock Salt : ఆయుర్వేదంలో ఔషధాల తయారీలో ఎక్కువగా ఉపయోగించే వాటిల్లో సైంధవ లవణం ఒకటి. దీనినే రాక్ సాల్ట్, హిమాలయన్ సాల్ట్, పింక్ సాల్ట్ అని కూడా అంటుంటారు. సాధారణ ఉప్పు సముద్రం నుండి లభిస్తుంది. సైంధవ లవణం హిమాలయ పర్వతాల దగ్గర లభిస్తుంది. సాధారణ ఉప్పు కంటే సైంధవ లవణం ఎంతో శ్రేష్టమైనదని నిపుణులు చెబుతున్నారు. మనకు వచ్చే అనేక అనారోగ్య సమస్యలను నయం చేయడంలో ఇది ఉపయోగపడుతుందని, దీనిని వాడడం వల్ల శరీరానికి ఎంతో మేలు కలుగుతుందని వారు చెబుతున్నారు.
థైరాయిడ్ సమస్య ఉన్న వారు సాధారణ ఉప్పుకు బదులుగా దీనిని వాడడం వల్ల మంచి ఫలితాలు కలుగుతాయి. అజీర్తి కారణంగా వాంతులు అవుతున్నప్పుడు సైంధవ లవణానికి జీలకర్ర పొడిని కలిపి తీసుకోవడం వల్ల వాంతులు తగ్గుతాయి. జీర్ణ శక్తిని పెంచడంలో, గ్యాస్, అజీర్తి వంటి సమస్యలను తగ్గించడంలో ఇది ఎంతో ఉపయోగపడుతుంది. బరువు తగ్గాలనుకునే వారు సాధారణ ఉప్పుకు బదులుగా సైంధవ లవణాన్ని ఉపయోగించడం వల్ల ఫలితం అధికంగా ఉంటుంది.
గొంతు నొప్పి, గొంతులో ఇన్ ఫెక్షన్స్ వంటి వాటితో బాధపడుతున్న వారు నీటిలో సైంధవ లవణాన్ని వేసి కలిపి తాగడం వల్ల ఈ సమస్యల నుండి ఉపశమనం పొందవచ్చు. ఈ నీటిని రోజూ మూడు పూటలా నోట్లో పోసుకుని పుక్కిలించడం వల్ల నోటి దుర్వాసన తగ్గుతుంది. చిగుళ్ల సమస్యలు, దంతాల సమస్యలు తగ్గుతాయి. మనం రోజూ ఉపయోగించే టూత్ పేస్ట్‌కు కొద్దిగా సైంధవ లవణాన్ని కలిపి దంతాలను శుభ్రం చేసుకోవడం వల్ల దంతాలు తెల్లగా అవుతాయి. నోటి దుర్వాసన కూడా తగ్గుతుంది.
కీళ్ల నొప్పులు, వాపులు, కీళ్లు బెణకడం వంటి వాటికి ముందుగా నువ్వుల నూనెతో మర్దనా చేసి సైంధవ లవణంతో కాపడం పెట్టడం వల్ల అద్భుతమైన ఫలితాలు కనిపిస్తాయని నిపుణులు చెబుతున్నారు. వంటల్లో సాధారణ ఉప్పుకు బదులుగా సైంధవ లవణాన్ని ఉపయోగించడం వల్ల శరీరంలో జీవక్రియలు మెరుగుపడతాయి. ఎముకలు, చర్మం, జుట్టు ఆరోగ్యం మెరుగుపడుతుంది.
నాలుగు టీ స్పూన్ల వామును వేయించి పొడిగా చేసి దానికి ఒక టీ స్పూన్ సైంధవ లవణాన్ని కలిపి నిల్వ చేసుకోవాలి. ఈ మిశ్రమాన్ని తీసుకోవడం వల్ల అజీర్తి వల్ల కలిగే సమస్యలన్నీ తగ్గుతాయి. కీళ్ల నొప్పులు, కండరాల నొప్పులు, వాతపు నొప్పులు ఉన్నప్పుడు ఈ మిశ్రమాన్ని పావు టీ స్పూన్ చొప్పున తీసుకుని నాలుక మీద వేసుకుని చప్పరిస్తూ ఉండడం వల్ల ఈ సమస్యల నుండి ఉపశమనం లభిస్తుంది. నోటిలో లాలాజలం ఎక్కువగా ఉత్పత్తి అయ్యే వారు ఈ మిశ్రమాన్ని తరచూ తీసుకుంటూ ఉండడం వల్ల అధిక ప్రయోజనం ఉంటుందని ఆయుర్వేద వైద్య నిపుణులు చెబుతున్నారు.