Methi Water Benefits : మెంతులు.. ఇవి మనందరికి తెలిసినవే. దాదాపు ప్రతి వంటింట్లో మెంతులు ఉంటాయని చెప్పవచ్చు. నిల్వ పచ్చళ్లల్లో, పులుసు కూరల్లో వీటిని ఎక్కువగా వాడుతూ ఉంటారు. చేదుగా ఉన్ప్పటికి మనం చేసే వంటకాలకు చక్కటి రుచిని తీసుకురావడంలో మెంతులు మనకు సహాయపడతాయి. అలాగే మన ఆరోగ్యానికి కూడా మెంతులు ఎంతో మేలు చేస్తాయి. వీటిలో ఎన్నో ఔషధ గుణాలు దాగి ఉన్నాయి. మెంతులను లేదా మెంతి నీటిని తీసుకోవడం వల్ల మనం అనేక అనారోగ్య సమస్యలను దూరం చేసుకోవచ్చు. మెంతలను మనం ఏ రూపంలో తీసుకున్నా కూడా మన ఆరోగ్యానికి మేలు కలుగుతుంది. మెంతులను నీటిలో నానబెట్టి మరిగించి మెంతి నీటిని తీసుకోవచ్చు. అలాగే మెంతులను మొలకెత్తించి నేరుగా నమిలి తినవచ్చు.
అదే విధంగా మెంతులను పొడిగా చేసి ఒక గ్లాస్ నీటిలో ఒక టీ స్పూన్ మోతాదులో ఈ పొడిని కలిపి తీసుకోవచ్చు. ఇలా ఏ విధంగా తీసుకున్నా కూడా మెంతులు మన ఆరోగ్యానికి మేలు చేస్తాయి. ఈ విధంగా రోజూ ఉదయం పరగడుపున మెంతులను లేదా మెంతి నీటిని తీసుకోవడం వల్ల మనకు కలిగే ప్రయోజనాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. మెంతులను తీసుకోవడం వల్ల మన శరీరానికి అవసరమయ్యే ఫైబర్, ప్రోటీన్, పిండి పదార్థాలు, ఐరన్, మాంగనీస్, మెగ్నీషియం వంటి పోషకాలు లభిస్తాయి. రోజూ ఉదయం పరగడుపున మెంతి గింజలను తీసుకోవడం వల్ల జీర్ణశక్తి మెరుగుపడుతుంది. మలబద్దకం వంటి సమస్యలు తగ్గుతాయి.
మెంతి గింజలను లేదా మెంతి నీటిని తీసుకోవడం వల్ల మనం సులభంగా బరువు తగ్గవచ్చు. శరీరంలో జీవక్రియల రేటును పెంచి కొవ్వు వేగంగా కరిగేలా చేయడంలో మెంతులు, మెంతి నీరు మనకు దోహదపడుతుంది. అలాగే మెంతులను తీసుకోవడం వల్ల గుండె ఆరోగ్యం మెరుగుపడుతుంది. శరీరంలో కొలెస్ట్రాల్ స్థాయిలు అదుపులో ఉంటాయి. అలాగే స్త్రీలు మెంతి నీటిని తీసుకోవడం వల్ల ఎంతో మేలు కలుగుతుంది. మెంతి నీటిని తీసుకోవడం వల్ల నెలసరి సమయంలో వచ్చేనొప్పి తీవ్రత తగ్గుతుంది. అలాగే నెలసరి సమస్యలు కూడా తగ్గుతాయి. ఇక ముఖ్యంగా మెంతులను, మెంతి నీటిని తీసుకోవడం వల్ల రక్తంలో చక్కెర స్థాయిలు అదుపులో ఉంటాయి. షుగర్ వ్యాధితో బాధపడే వారు మెంతులను వారి ఆహారంలో భాగంగా చేర్చుకోవడం వల్ల ఎల్లప్పుడూ గ్లూకోజ్ స్థాయిలు అదుపులో ఉంటాయి. శరీరంలో ఇన్ ప్లామేషన్ తగ్గుతుంది. ఈ విధంగా మెంతులుమన ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయని చేదుగా ఉన్నప్పటికి వీటిని తప్పకుండా ఆహారంలో భాగంగా చేసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు.