వర్షాకాలం వచ్చిందంటే చాలు సీజనల్ వ్యాధులు మనపై దాడి చేసేందుకు సిద్ధంగా ఉంటాయి. అనేక రకాలుగా ఆ వ్యాధులు వస్తుంటాయి. దగ్గు, జలుబుతోపాటు ఈ సీజన్‌లో విష జ్వరాలు, ఇన్‌ఫెక్షన్లు సర్వ సాధారణంగా వస్తుంటాయి. అయితే కింద తెలిపిన పలు జాగ్రత్తలను పాటిస్తే ఈ సీజన్‌లో వచ్చే వ్యాధుల నుంచి సురక్షితంగా ఉండవచ్చు. మరి ఆ జాగ్రత్తలు ఏమిటంటే..
1. ఈ సీజన్‌లో మనకు జలుబు, దగ్గు, జ్వరం సర్వ సాధారణంగా వస్తుంటాయి. అందువల్ల వర్షంలో ఎక్కువగా తడవరాదు. దుమ్ము, ధూళి ఉండే ప్రదేశాల్లో మన నాసికా రంధ్రాల్లోకి వైరస్‌లు చేరకుండా ముక్కుకు మాస్క్ లేదా కర్చీఫ్‌ను అడ్డుగా పెట్టుకోవాలి. దగ్గినా, తుమ్మినా కర్చీఫ్‌ను అడ్డుగా ఉంచుకోవాలి. దీంతో ఈ సమస్యలు రాకుండా చూసుకోవచ్చు.
2. ఈ సీజన్ లో దోమలు కుట్టడం వల్ల మలేరియా, డెంగ్యూ వంటి వ్యాధులు వస్తుంటాయి. కనుక దోమలను కట్టడి చేసే ఏర్పాటు చేసుకోవాలి. ఇంటి చుట్టూ, ఇంట్లో పరిశుభ్రంగా ఉంచుకోవాలి. పాత కూలర్లు, పూల కుండీల్లో నీరు నిల్వ ఉండకుండా చేయాలి. దోమ తెరలను వాడాలి. మస్కిటో రీపెల్లెంట్స్‌కు బదులుగా సహజసిద్ధమైన నూనెలను వాడాలి. వెల్లుల్లి రసం, వేపాకుల పొగ వంటి దోమలను తరిమేస్తాయి. దోమలు కుట్టకుండా చూసుకుంటే చాలు ఆ వ్యాధులు రాకుండా మనల్ని మనం రక్షించుకోవచ్చు.
3. ఈ సీజన్‌లో టైఫాయిడ్ కూడా సహజంగానే చాలా మందికి వస్తుంటుంది. కలుషితమై నీరు, ఆహారాలను తీసుకుంటే వాటిలో ఉండే బాక్టీరియా ఈ వ్యాధిని కలగజేస్తుంది. కనుక బయటి ఆహారాలను అస్సలు తినరాదు. ఇంట్లో వండుకున్న ఆహారాలనే వేడిగా ఉండగానే తినేయాలి. చల్లనివి, రోజుల తరబడి నిల్వ ఉన్నవి తినరాదు. కూరగాయలు, మాంసంలను శుభ్రంగా కడిగి బాగా ఉడికించి తినాలి. వేపుళ్లను తినరాదు. అలాగే నీటిని బాగా మరిగించి తాగుతుండాలి. ఈ జాగ్రత్తలు పాటిస్తే టైఫాయిడ్ రాకుండా అడ్డుకోవచ్చు.
4. ఇక ఇవే కాకుండా కలరా, విరేచనాలు వంటివి కూడా ఈ సీజన్‌లో చాలా మందికి వస్తుంటాయి. కనుక పరిశుభ్రతను పాటించాలి. ఆహారాలను వేడిగా ఉండగానే తినేయాలి. బయట తినే ఆహారాలు చాలా వరకు ఫుడ్ పాయిజనింగ్‌ను కలగజేస్తాయి. అలాగే మాంసాన్ని సరిగ్గా ఉడికించకుండా తింటే విరేచనాలు అవుతాయి. కనుక జాగ్రత్తలను పాటించాలి. దీంతో ఆయా సమస్యలు రాకుండా చూసుకోవచ్చు.
ఎప్పటికప్పుడు అప్‌డేట్స్ కోసం టెలిగ్రామ్‌లో మమ్మల్ని ఫాలో అవ్వండి: Ayurvedam365