Nakkera Fruit : ప్రకృతి మనకు వివిధ రకాల ఔషధ గుణాలు కలిగిన పండ్లను కూడా ప్రసాదించింది. అటువంటి పండ్ల చెట్లల్లో విరిగి చెట్టు కూడా ఒకటి. దీనినే విరిగి కాయల చెట్టు, నక్కెర పండ్ల చెట్టు, బంక నక్కెర చెట్టు, యంక కాయల చెట్టు అని కూడా పిలుస్తారు. ఈ చెట్లు మనకు ఎక్కువగా గ్రామాల్లో, రోడ్ల పక్కన కనిపిస్తాయి. చాలా మంది ఈ నక్కెర పండ్లను ఎంతో ఇష్టంగా తింటారు. పండిన కాయలు మరింత రుచిగా ఉంటాయి. ఈ కాయలు లోపల బంక లాగా ఉండి తియ్యగా ఉంటాయి. కొందరు ఈ నక్కెర కాయలతో పచ్చడి చేసుకుని కూడా తింటారు. దీనిని ఇంగ్లీష్ లో ఇండియన్ చెర్రీని అని, హిందీలో లసొరా, లసోడా అని పిలుస్తారు. ఈ కాయలు గుత్తుగుత్తులుగా కాస్తాయి. ఈ చెట్టును అలాగే ఈ పండ్లను ఎంతో కాలంగా ఆయుర్వేదంలో ఔషధంగా ఉపయోగిస్తున్నారు.
ఈ చెట్టు ప్రతి భాగం కూడా ఔషధ గుణాలను, యాంటీ ఇన్ ప్లామేటరీ, యాంటీ బయోటిక్ గుణాలను కలిగి ఉంటాయి. ఈ నక్కెర పండ్లు మనకు డ్రై ఫ్రూట్స్ రూపంలో కూడా లభిస్తాయి. ఈ నక్కెర పండ్లల్లో మన శరీరానికి అవసరమయ్యే ఎన్నో పోషకాలు ఉంటాయి. నక్కెర పండ్లల్లో క్యాల్షియం, జింక్, ఐరన్, ప్రోటీన్స్, కాపర్, జింక్ వంటి ఎన్నో పోషకాలు ఉంటాయి. ఈ పండ్లను తినడం వల్ల శరీరానికి మేలు కలుగుతుంది. శరీరానికి చలువ చేస్తుంది. అలాగే రక్తదోషాలు పోతాయి. ఈ పండ్లను తినడం వల్ల లైంగిక సమస్యలు తొలిగిపోయి లైంగిక సామర్థ్యం మెరుగుపడుతుంది. పురుషులు ఈ పండ్లను తీసుకోవడం వల్ల వారిలో వీర్య కణాల సంఖ్య పెరుగుతుంది.
అలాగే విరిగి పండ్లను తినడం వల్ల జీర్ణ సామర్థ్యం పెరుగుతుంది. తిన్న ఆహారం సులభంగా జీర్ణమవుతుంది. అజీర్తి సమస్యలతో బాధపడే వారు ఈ పండ్లను తినడం వల్ల మంచి ఫలితం ఉంటుంది. మన ఆరోగ్యానికి మేలు చేసేవే అయినప్పటికి ఈ పండ్లను చాలా తక్కువగా తీసుకోవాలి. రోజూ పది పండ్ల కంటె ఎక్కువగా తీసుకోకూడదు. అలాగే విరిగి చెట్టు ఆకులకు తలనొప్పిని తగ్గించే గుణం ఉంది. ఈ చెట్టు లేత ఆకులను పేస్ట్ గా చేసి నుదుటిపై రాసుకోవాలి. ఇలా చేయడం వల్ల కొంత సమయానికి తలనొప్పి తగ్గుతుంది. అలాగే ఈ చెట్టు బెరడును పేస్ట్ గా చేసి చర్మ సమస్యలు ఉన్న చోట లేపనంగా రాసుకోవాలి. ఇలా చేయడం వల్ల చర్మ సమస్యలు తగ్గిపోతాయి. అలాగే ఈ చెట్టు బెరడును నీటిలో వేసి మరిగించాలి.
తరువాత ఈ నీటిని వడకట్టగా వచ్చిన కషాయాన్ని నోట్లో పోసుకుని పుక్కిలించాలి. ఇలా చేయడం వల్ల దంతాలు, చిగుర్లు ధృడంగా, ఆరోగ్యంగా మారతాయి. నోటి దుర్వాసన తగ్గుతుంది. నోటి పూత కూడా తగ్గుతుంది. నోటి ఆరోగ్యం మెరుగుపడుతుంది. అలాగే ఈ బెరడు కషాయంతో గాయాలను కడగడం వల్ల గాయాలు త్వరగా మానుతాయి. ఈ విధంగా నక్కెర పండ్లు, నక్కెర చెట్టు మనకు ఎంతగానో మేలు చేస్తాయని వీటిని ఉపయోగించడం వల్ల మంచి ఫలితం ఉంటుందని నిపుణులు చెబుతున్నారు.