చాలా మంది నిత్యం ఉదయాన్నే పరగడుపునే కాఫీ, టీ వంటివి తాగుతుంటారు. కానీ నిజానికి వాటికి బదులుగా నిమ్మరసం తాగాలి. ఒక గ్లాస్ గోరు వెచ్చని నీటిలో ఒక టీస్పూన్ నిమ్మరసం కలుపుకుని ఉదయాన్నే పరగడుపునే తాగాలి. దీని వల్ల మనకు అనేక లాభాలు కలుగుతాయి. అవేమిటో ఇప్పుడు తెలుసుకుందాం.
నిమ్మకాయల్లో విటమిన్ సి పుష్కలంగా ఉంటుంది. ఇది శరీర రోగ నిరోధక శక్తిని పెంచుతుంది. యాంటీ ఆక్సిడెంట్‌లా పనిచేస్తుంది కనుక శరీర కణజాలాన్ని నాశనం చేసే ఫ్రీ ర్యాడికల్స్ ను నిర్మూలిస్తుంది. ఒక నిమ్మకాయను పూర్తిగా తీసుకునేట్లయితే మనకు 18.6 మిల్లీగ్రాముల విటమిన్ సి లభిస్తుంది. మనకు నిత్యం 65 నుంచి 90 మిల్లీగ్రాముల విటమిన్ సి అవసరం. అందువల్ల ఒక నిమ్మకాయను తీసుకుంటే దాని వల్ల రోజుకు కావల్సిన విటమిన్ సిలో దాదాపుగా 20 శాతం వరకు మనకు లభిస్తుంది. దీంతో విటమిన్ సిని శరీరం ఉదయం నుంచే ఉపయోగించుకుంటుంది. ఫలితంగా ఆరోగ్యంగా ఉండవచ్చు.
నిత్యం ఉదయాన్నే పరగడుపునే నిమ్మరసం తాగడం వల్ల అధిక బరువు తగ్గవచ్చు. వీటిల్లో ఉండే పాలీఫినాల్ యాంటీ ఆక్సిడెంట్లు అధికంగా బరువు పెరగకుండా చూస్తాయి. దీంతో బరువు తగ్గేందుకు అవకాశం ఉంటుంది.
నిమ్మకాయల్లో ఉండే విటమిన్ సి చర్మాన్ని సంరక్షిస్తుంది. చర్మాన్ని ముడతలు పడకుండా చూస్తుంది. సూర్య కిరణాల బారి నుంచి చర్మాన్ని కాపాడుతుంది. చర్మం మృదువుగా ఉండేలా చేస్తుంది. పొడిబారిన చర్మాన్ని రక్షిస్తుంది.
ఉదయాన్నే పరగడుపునే నిమ్మరసం తాగడం వల్ల మలబద్దకం సమస్య ఉండదు. జీర్ణ వ్యవస్థ శుభ్రంగా మారుతుంది. అజీర్ణం సమస్య ఉండదు. జీర్ణ ప్రక్రియ సులభంగా జరుగుతుంది. నిమ్మరసం రుచిని చూడడం వల్ల జీర్ణాశయంలో అగ్ని పుడుతుందని ఆయుర్వేదం చెబుతోంది. దీంతో తిన్న ఆహారం సులభంగా జీర్ణమవుతుంది.
నిమ్మరసం తాగడం వల్ల నోటి సమస్యలు ఉండవు. నోటి దుర్వాసన తగ్గుతుంది. దంతాలు, చిగుళ్ల సమస్యలు తగ్గుతాయి. దంతాలు, చిగుళ్లు దృఢంగా మారుతాయి. ఉల్లిపాయలు, వెల్లుల్లి, చేపలు తినడం వల్ల నోట్లో దుర్వాసన వస్తుంటుంది. దాన్ని నివారించాలంటే నిమ్మరసం సేవించాలి. లేదా నిమ్మరసంతో నోట్లో పుక్కిలించాలి. దీంతో నోటి దుర్వాసన నుంచి బయట పడవచ్చు.
నిమ్మరసంలో ఉండే సిట్రిక్ యాసిడ్ కిడ్నీ స్టోన్లు ఏర్పడకుండా చూస్తుంది. సిట్రిక్ యాసిడ్‌లో ఉండే సిట్రేట్ అనబడే సమ్మేళనం మూత్రం యొక్క ఆమ్ల స్వభావాన్ని తగ్గిస్తుంది. దీంతోపాటు చిన్నపాటి రాళ్లు ఉంటే కరిగిపోతాయి. అందువల్ల నిత్యం నిమ్మరసం తాగాలి.
అయితే నిమ్మరసం తాగడం వల్ల కొందరిలో జీర్ణ సమస్యలు తగ్గుతాయి. కానీ కొందరిలో రివర్స్‌గా ప్రభావం చూపుతుంది. అంటే గ్యాస్, అసిడిటీ పెరుగుతాయి. అలాంటి వారు నిమ్మరసాన్ని తాగకూడదు. రసం తాగాక ఆయా సమస్యలు వస్తే వెంటనే నిమ్మరసాన్ని తాగడం మానేయాలి. ఇక ఏ సమస్యా లేని వారు నిరభ్యంతరంగా నిత్యం నిమ్మరసం తాగవచ్చు.