భారతీయులు ఎంతో పురాతన కాలం నుంచే మజ్జిగలో ఉల్లిపాయలు వేసుకుని లేదా పెరుగులో ఉల్లిపాయలు కలుపుకుని తింటున్నారు. పెరుగులో లేదా మజ్జిగలో ఉల్లిపాయలు కలుపుకుని తినడం వల్ల ఎంతో రుచిగా ఉండడమే కాదు, శరీరానికి కూడా చలువ చేస్తుందని మన పెద్దలు చెబుతారు. అయితే వాస్తవానికి ఈ కాంబినేషన్ మంచిది కాదట. అవును, మీరు విన్నది నిజమే. ఆయుర్వేదం ప్రకారం పెరుగు లేదా మజ్జిగతో ఉల్లిపాయలను తీసుకోకూడదని చెబుతున్నారు.
పెరుగు లేదా మజ్జిగ చల్లని స్వభావం కలది. ఉల్లిపాయలను తింటే శరీరంలో వేడి పెరుగుతుంది. రెండు విరుద్ధ స్వభావాలు ఉన్న వీటిని కలిపి తింటే శరీరంలో అసమతుల్యతలు ఏర్పడి విష పదార్థాలు పెరిగిపోతాయని ఆయుర్వేదం చెబుతోంది. దీంతోపాటు అలర్జీలు కూడా వస్తాయట. అలాగే జీర్ణ సమస్యలు వచ్చే అవకాశాలు ఉంటాయని వైద్య నిపుణులు చెబుతున్నారు. కనుక పెరుగు లేదా మజ్జిగతో ఉల్లిపాయలను కలిపి తినరాదని వారంటున్నారు.
అయితే అంతగా తినాలనిపిస్తే ఉల్లిపాయలను కాస్త వేయించి ఆ తరువాత వాటిని పెరుగు లేదా మజ్జిగతో కలిపి తినవచ్చట. ఇలా తింటే ఏమీ కాదని చెబుతున్నారు. కనుక ఉల్లిపాయ, మజ్జిగ లేదా పెరుగు కాంబినేషన్ రోజూ తింటున్న వారు ఒకసారి ఈ విషయాన్ని పరిశీలించండి. లేదంటే అనారోగ్య సమస్యలను కోరి తెచ్చుకున్న వారు అవుతారు.