Orange Peel : విటమిన్ సి ఎక్కువగా ఉండే పండ్లలల్లో నారింజ పండ్లు కూడా ఒకటి. నారింజ పండ్లు చాలా రుచిగా ఉంటాయి. దాదాపు అన్ని కాలాల్లో ఇవి మనకు లభిస్తూ ఉంటాయని చెప్పవచ్చు. చాలా మంది వీటిని ఇష్టంగా తింటారు. నారింజ పండ్లు మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. వీటిని తీసుకోవడం వల్ల మనం చక్కటి ఆరోగ్యాన్ని పొందవచ్చు. మనం సాధారణంగా నారింజ తొనలను తిని పైన తొక్కలను పడేస్తూ ఉంటాము. కానీ నారింజ తొక్క కూడా మన ఆరోగ్యానికి, అందానికి ఎంతో మేలు చేస్తుందని నిపుణులు చెబుతున్నారు. నారింజ తొక్కలో అనేక పోషకాలు, ఆరోగ్య ప్రయోజనాలు దాగి ఉన్నాయని వీటిని తీసుకోవడం వల్ల మనం మరిన్ని ఆరోగ్య ప్రయోజనాలను పొందవచ్చని నిపుణులు చెబుతున్నారు.
నారింజ తొక్కలో ఉండే పోషకాలు ఏమిటి.. అలాగే వీటిని తీసుకోవడం వల్ల మనకు ఆరోగ్య ప్రయోజనాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. నారింజ తొక్కలో విటమిన్ సి ఎక్కువగా ఉంటుంది. ఇది శరీరంలో రోగనిరోధక శక్తిని పెంచడంలో, ఇన్పెక్షన్ ల బారిన పడకుండా కాపాడడంలో సహాయపడుతుంది. అలాగే చర్మాన్ని కాంతివంతంగా, అందంగా ఉంచడంలో కూడా నారింజ తొక్కలు మనకు దోహదపడతాయి. అదే విధంగా నారింజ తొక్కలో ఫైబర్ ఎక్కువగా ఉంటుంది.వీటిలో అధికంగా ఉండే ఈ ఫైబర్ జీర్ణశక్తిని మెరుగుపరచడంలో, మలబద్దకం సమస్యను తగ్గించడంలో, పొట్టలో మంచి బ్యాక్టీరియాను పెంచడంలో తోడ్పడుతుంది. ఇక బరువు తగ్గడంలో కూడా నారింజ తొక్కలు మనకు సహాయపడతాయి. వీటిలో బరువు తగ్గించే సమ్మేళనాలు ఎక్కువగా ఉంటాయి.
కొవ్వును కరిగించడంలో, కొలెస్ట్రాల్ స్థాయిలను అదుపులో ఉంచడంలో, బరువును అదుపులో ఉంచడంలో నారింజ తొక్కలు మనకు ఎంతో ఉపయోగపడతాయి. అలాగే నారింజ తొక్కలు మంచి వాసనను కలిగి ఉంటాయి. వీటిని వాసన చూడడం వల్ల మానసిక స్థితి మెరుగుపడుతుంది. ఒత్తిడి, ఆందోళన వంటివి తగ్గుతాయి. అదే విధంగా నూనె మరకలను తొలగించడంలో కూడా నారింజ తొక్కలు దోహదపడతాయి. మరకలపై నేరుగా నారింజ తొక్కను రుద్దడం వల్ల లేదా వెనిగర్ తో కలిపి రుద్దడం వల్ల మరకలు సులభంగా తొలగిపోతాయి. అలాగే ఇంట్లో చక్కటి వాసన వస్తుంది. ఈ విధంగా నారింజ తొక్కలు మనకు అనేక విధాలుగా మేలు చేస్తాయని వీటిని కూడా ఆహారంలో భాగంగా చేసుకోవాలని నిపుణులు చెబుతున్నారు.
అయితే నారింజ తొక్కలను ఏ విధంగా తీసుకోవాలి.. అన్న వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం. నారింజ తొక్కలతో టీని తయారు చేసి తీసుకోవచ్చు. నీటిలో నారింజ తొక్కలు వేసి ఉడికించాలి. తరువాత ఈ నీటిని వడకట్టి మరింత రుచి కొరకు తేనె వేసి కలిపి తీసుకోవాలి. అలాగే తొక్కను తురిమి సలాడ్, డెజర్ట్ వంటి వాటిలో వేసుకోవచ్చు. అలాగే ఈ తురుమును కేక్స్, కుక్కీస్, రొట్టెలు వంటి వాటిలో కూడా వేసుకోవచ్చు. ఈ విధంగా నారింజ తొనలను తీసుకోవడం వల్ల మనం రుచితో పాటు చక్కటి ఆరోగ్యాన్ని కూడా పొందవచ్చు.