జీవితాన్ని దుర్భరం చేసే జీవన శైలి సమస్యలు ఎంతో మంది జీవితాలు అర్ధాంతరంగా ముగిసిపోవడానికి కారణమవుతున్నాయి. వయసుతో నిమిత్తం లేకుండా అతి చిన్న వయుసుల్లోనే వీరంతా తమ జీవితాల్ని చాలిస్తున్నారు. వీటిని నియంత్రించడంలో పూర్తి అవగాహన అనేది అవసరమని, చికిత్సలో కొత్త మార్గాలను అవలంభించాల్సి ఉందని వైద్య నిపుణులు సూచిస్తున్నారు. అందుకుగాను అనేక పరిశోధనలు సైతం పరిశోధకులు చేస్తున్నారు.
స్థూలకాయం, అధిక రక్తపోటు, మధుమేహం వీటన్నిటితోపాటు గుండె సంబంధిత వ్యాధులు వంటి అనారోగ్య సమస్యలు నేడు మనిషిని తీవ్ర ఇబ్బందికి గురి చేస్తున్నాయి. గతంలో వృద్ధాప్యంలో కనిపించిన ఈ సమస్యలు ఇప్పుడు చిన్న వయస్సు నుంచే మొదలవుతున్నాయని అధ్యయనాల్లో వెల్లడవుతున్నాయి. అధిక రక్తపోటు, మధుమేహం వంటి అనారోగ్య సమస్యలకు స్థూలకాయం మూల కారణమని నిపుణులు స్పష్టం చేస్తున్నారు.
స్థూలకాయం తగ్గిపోతే రక్తపోటు సమస్యగాని, మధుమేహం గాని చాలా మందిలో వాటికవే ఆటోమేటిక్ గా తగ్గిపోయే అవకాశం ఉందని చెబుతున్నారు. కనుక అధిక బరువును తగ్గించుకోడానికవసరమైన చర్యలు చేపట్టాలి. ఆహారం మార్పుతోపాటు ప్రతిరోజు వయసును బట్టి, శరీర పరిస్ధితిని బట్టి కొద్దిపాటి వ్యాయామం తప్పక చేయాలి.