Pearl Millets For Arteries Fat : మనందరికి ప్రధాన ఆహారం బియ్యం. ఈ బియ్యాన్నే వండుకుని మనం అన్నంగా తింటూ ఉన్నాం. బియ్యం లేనప్పుడు మన పూర్వీకులకు రాగులు, సజ్జలు, జొన్నలు ప్రధాన ఆహారాలుగా ఉండేవి. బియ్యం అందుబాటులోకి వచ్చిన తరువాత ఈ చిరు ధాన్యాలను ఆహారంగా తీసుకోవడం పూర్తిగా మానేసారు. బియ్యంతో వండిన అన్నం పొడి పొడిలాడుతూ తినడానికి చాలా వీలుగా ఉంటుంది. దీంతో ఈ చిరు ధాన్యాల వాడకం అంతకంతకు తగ్గుతూ వచ్చింది. కానీ సజ్జలతో వండిన పదార్థాలను తీసుకోవడం వల్ల మన ఆరోగ్యానికి ఎంతో మేలు కలుగుతుంది. సజ్జ అన్నం, సజ్జ రొట్టెలు, సజ్జలతో అల్పాహారాలు, సజ్జలతో అప్పాలు.. ఇలా సజ్జలతో రకరకాల పదార్థాలను పూర్వకాలంలో ఎక్కువగా చేసే వారు.
సజ్జల్లో లిగ్నిన్ అనే ఫైటో కెమికల్ ఎక్కువగా ఉంటుంది. ఇది రక్తనాళాల్లో కొవ్వు పేరుకుపోకుండా చేయడంలో సహాయపడుతుంది. రక్తనాళాల్లో కొవ్వు పొరలు పొరలుగా పేరుకుపోవడం వల్ల రక్తసరఫరా మందగించి హార్ట్ ఎటాక్, స్ట్రోక్ వంటి సమస్యలు తలెత్తే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. గుండెలో ఉండే రక్తనాళాల్లో కొవ్వు పేరుకుపోకుండా చేసి రక్తసరఫరా సాఫీగా సాగేలా చేయడంలో లిగ్నిన్ అనే ఫైటో కెమికల్ మనకు సహాయపడుతుంది. సజ్జలను ఆహారంగా తీసుకోవడం వల్ల ఈ విధంగా మనం గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరుచుకోవచ్చని నిపుణులు పరిశోధనల ద్వారా వెల్లడించారు.
అలాగే సజ్జల్లో పాలీ అన్ స్యాచురేటెడ్ ఫ్యాట్ ఉంటుంది. ఇది చెడు కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గించి మంచి కొలెస్ట్రాల్ స్థాయిలను పెంచడంలో సహాయపడుతుంది. అదే విధంగా 100 గ్రాముల సజ్జల్లో 11 గ్రాముల ఫైబర్ ఉంటుంది. మనం తీసుకునే ఆహారాల్లో ఉండే కొవ్వులు, కొలెస్ట్రాల్ ను ప్రేగులు గ్రహించకుండా చేయడంలో ఈ ఫైబర్ మనకు సహాయపడుతుంది. దీంతో రక్తంలోకి కొలెస్ట్రాల్, కొవ్వు చేరుకుండా ఉంటుంది. తద్వారా మనం అధిక బరువు, చెడు కొలెస్ట్రాల్ స్థాయిలు పెరగడం, గుండె జబ్బులు వంటి సమస్యల బారిన పడకుండా ఉంటాము.
ఈ విధంగా సజ్జలు మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయని నిపుణులు చెబుతున్నారు. వీటిని ఆహారంగా తీసుకోవడం వల్ల మనం అనేక ఆరోగ్య ప్రయోజనాలను సొంతం చేసుకోవచ్చు. సజ్జలను రవ్వగా చేసి సంగటి, అన్నం వంటి వాటిని వండుకుని తినవచ్చు. బియ్యంతో వండిన అన్నానికి బదులుగా సజ్జలతో వండిన అన్నాన్ని తినడం అలవాటు చేసుకోవాలి. బియ్యంతో వండిన అన్నాన్ని తినడం వల్ల మనం అనేక అనారోగ్య సమస్యల బారిన పడే అవకాశం ఉంది. కనుక వీలైనంత వరకు సజ్జలతో వండిన అన్నం, రొట్టెలను తీసుకోవడం వల్ల మనం చక్కటి ఆరోగ్యాన్ని సొంతం చేసుకోవచ్చని నిపుణులు తెలియజేస్తున్నారు.