Curd : మనం పెరుగును కూడా ఆహారంగా తీసుకుంటూ ఉంటాము. చాలా మంది పెరుగును ఇష్టంగా తింటారు. పెరుగుతో భోజనం చేయనిదే చాలా మందికి భోజనం చేసిన అనుభూతి కలగదు. పెరుగును తీసుకోవడం వల్ల మన ఆరోగ్యానికి కూడా ఎంతో మేలు కలుగుతుందన్న సంగతి మనకు తెలిసిందే. పెరుగును తినడం వల్ల మన శరీరానికి కావల్సిన పోషకాలతో పాటు అనేక ఆరోగ్య ప్రయోజనాలను కూడా పొందవచ్చు. మనం పెరుగును ఎక్కువగా మధ్యాహ్నం అలాగే రాత్రి భోజన సమయంలో తీసుకుంటూ ఉంటాము. అయితే రాత్రి భోజనంలో పెరుగును ఎక్కువగా తీసుకోకూడదని నిపుణులు చెబుతున్నారు.
ముఖ్యంగా ఈ రెండు సమస్యలతో బాధపడే వారు అస్సలు తీసుకోకూడదని వారు చెబుతున్నారు. రాత్రి భోజన సమయంలో పెరుగును తీసుకోకూడని వారు ఎవరు.. ఎందుకు పెరుగును రాత్రి సమయంలో ఎక్కువగా తీసుకోకూడదో ఇప్పుడు తెలుసుకుందాం. ఎవరికైతే ఉదయం లేచిన తరువాత గొంతులో కఫాలు, శ్లేష్మాలు పేరుకుపోయి ఉంటాయో వారు రాత్రి పూట పెరుగును ఎక్కువగా తీసుకోకూడదు. అలాగే కొందరికి తెల్లవారే సమయంలో పిల్లి కూతలు వస్తూ ఉంటాయి. అలాగే తెల్లవారే సమయంలో దగ్గు ఎక్కువగా వస్తూ ఉంటుంది. అలాగే ఆస్థమా, ఉదయం పూట తుమ్ములు ఎక్కువగా వచ్చే వారు, బ్రాంకైటిస్ కలిగి ఉన్న వారు, శ్లేష్మత్వతం ఉన్న వారు రాత్రిపూట పెరుగును తీసుకోకపోవడమే మంచిదని నిపుణులు చెబుతున్నారు.
పెరుగు కఫాన్ని, శ్లేష్మాన్ని ఎక్కువగా ఉత్పత్తి అయ్యేలా చేస్తుంది. దీంతో దగ్గు, ఆస్థమా వంటి సమస్యలు మరింత ఎక్కువవుతాయి. కనుక ఇలాంటి వారు రాత్రి పూట పెరుగును తీసుకోకపోవడమే మంచిది. అదే విధంగా కొందరిలో ఉదయం లేచిన తరువాత కండరాలు పట్టేసినట్టు ఉంటుంది. శరీరమంతా వాతం చేసినట్టు, నొప్పులుగా ఉంటుంది. ఇలాంటి వారు కూడా రాత్రిపూట పెరుగును తీసుకోకపోవడమే మంచిది. పెరుగు శరీరంలో ఇన్ ప్లామేషన్ ను పెంచి నొప్పులు ఎక్కువయ్యేలా చేస్తుందని నిపుణులు చెబుతున్నారు. కనుక ఇలాంటి వారు రాత్రి పూట పెరుగుకు బదులుగా మజ్జిగను తీసుకోవడం మంచిదని వారు చెబుతున్నారు. ఇలాంటి సమస్యలు లేనివారు ఎటువంటి సందేహం లేకుండా రాత్రి పూట పెరుగును తీసుకోవచ్చని దీని వల్ల ఎటువంటి హాని కలగదు నిపుణులు తెలియజేస్తున్నారు.