Pregnant Woman : మాతృత్వం అనేది స్త్రీలందరికీ ఓ వరం లాంటిది. దాదాపుగా ప్రతి ఒక్క స్త్రీ వివాహం అయిన తరువాత తల్లి కావాలని, మాతృత్వపు ఆనందాన్ని అనుభవించాలని కలలు కంటుంది. అందుకు అనుగుణంగా తన కలను నిజం చేసుకుంటుంది కూడా. అయితే కొందరికి మాత్రం మాతృత్వం చెదిరిన కలగా మారిపోతుంది. అది వేరే విషయం. కానీ చాలా మంది తల్లులు తొలిసారి మాతృత్వం పొందగానే అప్పుడు అనుభవించే ఆ అనుభూతి వేరేగా ఉంటుంది. ఈ క్రమంలో బిడ్డ జన్మించడానికి ముందు, జన్మించిన తరువాత డాక్టర్‌తోపాటు కుటుంబ సభ్యులు, బంధువులు, స్నేహితులు, తెలిసిన వారు, ఇరుగు పొరుగు వారు తల్లులకు ఎన్నో విషయాలను, జాగ్రత్తలను చెబుతుంటారు. అది అలా చేయకూడదని, ఇది తినకూడదు, అది తినాలి.. అని చెబుతారు. అయితే అవే కాదు, బిడ్డకు జన్మనివ్వబోతున్న, జన్మనిచ్చిన ఏ తల్లి అయినా కొన్ని విషయాలను గురించి కచ్చితంగా తెలుసుకోవాల్సిందే. అవేమిటంటే..
బిడ్డ జన్మించడంతోనే డెలివరీ పూర్తి కాదు. బిడ్డకు చుట్టుకుని ఉండే మాయ, ఇతర ద్రవాలన్నీ బయటికి వస్తేనే డెలివరీ పూర్తయినట్టు. కాకపోతే బిడ్డ వేగంగా బయటికి వస్తుంది, కానీ ఇతర వాటికి కొద్దిగా సమయం పడుతుంది. అయితే వాటి గురించి నొప్పులు పడాల్సిన అవసరం లేదు. బిడ్డ జన్మించే సమయంలోనే నొప్పులు పడాల్సి వస్తుంది. చాలా మంది గర్భిణీలకు డాక్టర్లు డెలివరీ తేదీలను ఇస్తారు. కానీ అలా ఇచ్చిన తేదీల్లో కేవలం 5 శాతం మంది మాత్రమే కచ్చితమైన టైంకు డెలివరీ పొందుతారట. కాబట్టి సరైన టైంకు డెలివరీ కాకపోతే ఆందోళన పడాల్సిన పనిలేదు. అది సహజమే.
డెలివరీ సమయంలో మహిళలకు వెన్నెముక భాగంలో ఎపిడ్యురల్ అనే నీడిల్‌ను నొప్పి తగ్గడం కోసం ఇస్తారు. అయితే దీన్ని నొప్పి నుంచి ఉపశమనం కోసమే కానీ, దాంతో నడుం కింది భాగం ఎలాంటి అనారోగ్యానికి గురి చెందదు. కాకపోతే కాళ్లు, పాదాల వంటి భాగాల్లో స్పర్శ లేనట్టుగా కొంత సమయం పాటు అనిపిస్తుంది. కానీ అది కొంత సేపే. తరువాత అంతా సాధారణ స్థితికి వచ్చేస్తుంది. డెలివరీ తరువాత వైద్యులు తల్లులకు వెన్నెముక, పొట్ట భాగాల్లో మర్దనా చేస్తారు. దీని వల్ల గర్భాశయం తిరిగి సాధారణ సైజ్‌కు చేరుకుంటుంది. అంతేకాదు, బ్లీడింగ్ కూడా తగ్గుతుంది. బిడ్డ డెలివరీ తరువాత 6 నెలల వరకు కొందరు మహిళల్లో రక్తస్రావం జరుగుతూనే ఉంటుంది. దీన్ని చూసి కంగారు పడాల్సిన పని లేదు. నాప్‌కిన్స్, అడల్ట్ డైపర్స్ వాడితే సరిపోతుంది.
తల్లి నుంచి బిడ్డ వేరైనాక కొన్ని రోజులు, వారాలు, నెలల వరకు బిడ్డ బొడ్డు తాడు అలాగే ఉంటుంది. దాన్ని దానంతట అదే రాలిపోయే వరకు ఉంచాలి. కానీ తీసేందుకు ప్రయత్నించకూడదు. డాక్టర్లు కూడా దాన్ని తీసేందుకు నిరాకరిస్తారు. గర్భంతో ఉన్న మహిళలకు కడుపులో ఉన్న బిడ్డ ఒత్తిడి కలిగిస్తూ ఉండడం వల్ల మాటి మాటికీ విరేచనం కలుగుతూ ఉంటుంది. ఇది కూడా సహజమే. ఆందోళన చెందాల్సిన పని లేదు. నెలలు నిండకుండానే జన్మించిన శిశువు ఒక రకమైన పొరతో జన్మిస్తుంది. దీన్ని వెర్నిక్స్ కెసోసా అంటారు. ఇది కొన్ని సందర్భాల్లో బిడ్డ చుట్టూ కూడా ఉంటుంది. దీని గురించి దిగులు చెందాల్సిన పని లేదు. బిడ్డను సంరక్షించడం కోసమే ఈ పొర ఉంటుంది.
కొంత మంది శిశువులు చేతులు, భుజాలు, వెన్నెముక వంటి భాగాల్లో వెంట్రుకలతో జన్మిస్తారు. ఇది కూడా సహజమే. టెన్షన్ పడాల్సిన పని లేదు. బిడ్డ జన్మించే సమయంలో తల్లి యోని నుంచి బయటకు రావాల్సి ఉంటుంది కాబట్టి, ఆ సమయంలో యోని ఆకారానికి అనుగుణంగా బిడ్డ ఆకృతి మారుతుంది. కానీ కొన్ని రోజుల తరువాత పూర్వ స్థితిని సంతరించుకుంటుంది.