Proso Millet : మన పూర్వీకులు అనేక రకాల చిరుధాన్యాలను ఆహారంగా తీసుకునే వారు. కానీ కాలక్రమేణా చిరుధాన్యాల వినియోగం తగ్గుతూ వచ్చింది. దీంతో కొన్ని రకాల చిరుధాన్యాలు కనుమరుగై పోయాయని చెప్పవచ్చు. కొన్నింటినైతే ఆహారంగా తీసుకోవడమే మానేసారు. అసలు వాటిని కూడా వండుకుని తింటారన్న సంగతి మనలో చాలా మందికి తెలియకుండా పోయింది. ఇలా అతి తక్కువగా వినిమయోగించబడుతున్న చిరుధాన్యాల్లో వరిగెలు ఒకటి. వీటినే ప్రోసో మిల్లెట్ అని అంటారు. సజ్జలు, రాగులు, జొన్నలు వంటి చిరుధాన్యాల వలె వరిగెలు కూడా మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. వరిగెలను కూడా అన్నంగా వండుకుని తినవచ్చు. వీటిని ఆహారంగా తీసుకోవడం వల్ల మనం అనేక రకాల ఆరోగ్య ప్రయోజనాలను పొందవచ్చు.
వరిగెలు కూడా అనేక రకాల పోషకాలను కలిగి ఉంటాయి. చక్కటి ఆరోగ్యాన్ని అందించడంలో, దీర్ఘకాలిక అనారోగ్యాల బారిన పడకుండా చేయడంలో ఇవి కూడా మనకు ఎంతో దోహదపడతాయి. వరిగెలను ఆహారంగా తీసుకోవడం వల్ల మనకు కలిగే ప్రయోజనాలు ఏమిటి.. వీటిని ఎందుకు ఆహారంలో భాగంగా తీసుకోవాలని అన్న వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం. వరిగెలను తీసుకోవడం వల్ల శరీరంలో ఉండే త్రిధోషాలన్నీ తొలగిపోతాయి. ఆయుర్వేదంలో కూడా వరిగెలకు మంచి ప్రధాన్యత ఉంది. అలాగే జీర్ణవ్యవస్థ బలహీనంగా ఉన్నవారికి ఇవి చక్కటి ఆహారమని చెప్పవచ్చు. జీర్ణవ్యవస్థకు చక్కటి ఉపశమనాన్నికలిగించడంలో, అల్సర్, కడుపులో పుండ్లు, అజీర్తి, మలబద్దకం వంటి సమస్యలను తగ్గించడంలో వరిగెలు మనకు ఎంతో దోహదపడతాయి. మలబద్దకం సమస్య ఉన్న వారు వరిగెలను తీసుకోవడం వల్ల ప్రేగుల్లో కదలికలు మెరుగుపడి సుఖవిరోచనం అవుతుంది.
అలాగే వీటిని తీసుకోవడం వల్ల కడుపు నిండిన భావన కలుగుతుంది. దీంతో మన దృష్టి ఇతర ఆహారాలపై పోకుండా ఉంటుంది. దీంతో మనం సులభంగా బరువు తగ్గవచ్చు. బరువు తగ్గాలనుకునే వారు ఈ వరిగెలను తీసుకోవడం వల్ల మంచి ఫలితం ఉంటుంది. అంతేకాకుండా షుగర్ వ్యాధితో బాధపడే వారికి కూడా వరిగెలు ఎంతో సహాయపడతాయి. ఇవి ఆలస్యంగా జీర్ణమవుతాయి కనుక గ్లూకోజ్ రక్తంలో నెమ్మదిగా కలుస్తుంది. దీంతో రక్తంలో షుగర్ స్థాయిలు పెరగకుండా అదుపులో ఉంటాయి. ఇక వరిగెల్లో ఉడే మెగ్నీషియం రక్తపోటును అదుపులో ఉంచడంలో, గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో దోహదపడుతుంది. ఈ విధంగా వరిగెలు కూడా మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయని ఈ ఆరోగ్య ప్రయోజనాలన్నీ పొందాలంటే వరిగెలను కూడా తప్పకుండా ఆహారంగా తీసుకోవాలని నిపుణులు చెబుతున్నారు.