Sesame Seeds : నువ్వులను భారతీయులు ఎంతో పురాతన కాలం నుంచి వంటల్లో ఉపయోగిస్తున్నారు. వీటితో తీపి వంటకాలు తయారు చేస్తారు. అలాగే పచ్చళ్లలో నువ్వుల పొడిని కూడా వేస్తుంటారు. అయితే నువ్వులు బాగా వేడి అని చాలా మంది తినరు. కానీ అందులో నిజం లేదు. ఎందుకంటే.. రోజూ తగినంత నీటిని తాగితే నువ్వులను తిన్నా ఏమీ కాదు. వేడి చేయదు. కనుక నువ్వులను రోజూ ఆహారంలో భాగం చేసుకోవాలి. నువ్వులను తీసుకుంటే మనకు అనేక రకాల ప్రయోజనాలు కలుగుతాయి.
నువ్వుల్లో పాల కన్నా 13 రెట్లు అధిక మొత్తంలో కాల్షియం ఉంటుంది. కనుక ఇది మన ఎముకలను దృఢంగా మారుస్తుంది. 100 గ్రాముల నువ్వులలో 1450 మిల్లీగ్రాముల కాల్షియం ఉంటుంది. పెద్దలకు రోజుకు 450 మిల్లీగ్రాములు, పిల్లలకు 600 మిల్లీగ్రాములు, గర్భిణీలు, పాలిచ్చే తల్లులకు రోజుకు 900 మిల్లీగ్రాముల కాల్షియం అవసరం. కనుక నువ్వులను రోజూ గుప్పెడు మోతాదులో తింటే చాలు.. మనకు కావల్సిన కాల్షియం మొత్తం ఒకేసారి లభిస్తుంది.
ఇక నువ్వులను రోజూ ఒక గుప్పెడు మోతాదులో వేయించి తినవచ్చు. లేదా అంతే మోతాదులో పొడిని కూరలపై చల్లుకుని తీసుకోవచ్చు. ఇక ఇలా కూడా తినలేమని అనుకుంటే.. అందుకు ఇంకో మార్గం ఉంది. అదేమిటంటే.. నువ్వులను రోజూ తీసుకోవాలంటే.. వాటితో ఉండలు తయారు చేసుకోవాలి. నువ్వులను వేయించి వాటిలో బెల్లం పాకం కలిపి ఉండలుగా తయారు చేసుకోవాలి. వీటిని రోజుకు ఒక్కటి తిన్నా చాలు.. మన శరీరానికి కావల్సిన కాల్షియం మొత్తం లభిస్తుంది. దీంతో ఎముకలు, దంతాలు దృఢంగా, ఆరోగ్యంగా ఉంటాయి.
అయితే నువ్వులను నేరుగా తినాలనుకుంటే వాటిని 7 నుంచి 8 గంటల పాటు నానబెట్టాలి. దీంతో అవి మెత్తగా మారుతాయి. తరువాత వాటిని బాగా నమిలి తినాలి. వీటిని తినక ముందు, తిన్న తరువాత గంట వరకు వేటినీ తీసుకోరాదు. లేదంటే నువ్వులు సరిగ్గా జీర్ణం కావు. ఇలా నువ్వులను తీసుకుంటే చాలా సులభంగా జీర్ణమవుతాయి. వీటితో అనేక పోషకాలు లభిస్తాయి. అలాగే అనేక ఆరోగ్యకరమైన ప్రయోజనాలు కూడా కలుగుతాయి.
నువ్వులను పైన తెలిపిన విధంగా ఎలా తీసుకున్నా సరే.. మనకు అనేక లాభాలు కలుగుతాయి. ముఖ్యంగా కొలెస్ట్రాల్, బీపీ తగ్గుతాయి. మన శరీరానికి కావల్సినంత ఫైబర్ లభిస్తుంది కనుక జీర్ణ సమస్యలు ఉండవు. ప్రధానంగా మలబద్దకం నుంచి బయట పడవచ్చు. అలాగే గుండె ఆరోగ్యంగా ఉంటుంది. ఎముకలు దృఢంగా మారుతాయి. వాపులు, కీళ్ల నొప్పులు తగ్గుతాయి. ప్రోటీన్లు అధికంగా లభిస్తాయి కనుక శక్తి వస్తుంది. నీరసం పోతుంది. అమితమైన బలం కలుగుతుంది. కాబట్టి ఇవన్ని ప్రయోజనాలను పొందాలంటే.. రోజుకు ఒక నువ్వుల ఉండను అయినా సరే తినాల్సిందే..!