Shawarma Side Effects : సాధారణం మనం బయటకు వెళ్లినప్పుడు రహదారి పక్కన అనేక రకాల చిరుతిళ్లు మనకు దర్శనమిస్తుంటాయి. అందులో భాగంగానే చాలా మంది తమకు ఇష్టమైన చిరుతిళ్లను తినేందుకు ఎక్కువగా ఆసక్తిని చూపిస్తుంటారు. అయితే ఈ మధ్య కాలంలో బాగా పాపులర్ అయిన చిరు తిండి.. షావర్మా. ఇది మనకు ప్రస్తుతం ఎక్కడ పడితే అక్కడే లభిస్తోంది. చాలా మంది దీన్ని రహదారుల పక్కన బండ్లపై లేదా హోటల్స్‌లో విక్రయిస్తున్నారు. అయితే హోటల్స్ మాట అటుంచితే రహదారుల పక్కన బండ్లపై లభించే దీన్ని తింటే అనారోగ్యాన్ని కోరి తెచ్చుకున్నట్లే అని వైద్య నిపుణులు చెబుతున్నారు. ఎందుకంటే దీన్ని ఇటీవల తిన్న ఓ ఇద్దరు హాస్పిటల్ పాలయ్యారు. వేర్వేరు చోట్ల ఇలా జరిగింది. కనుక షావర్మా తినేవారు జాగ్రత్తగా ఉండాలని నిపుణులు చెబుతున్నారు.
సాధారణంగా షావర్మాలో మాంసాన్ని తీగకు గుచ్చి వేడి చేసి విక్రయిస్తారు. అయితే మాంసం సరిగ్గా ఉడికితే ఫర్వాలేదు. కానీ మాంసం ఉడకకపోతే అందులో సాల్మొనెల్లా, ఇ.కొటి వంటి బాక్టీరియా పేరుకుపోయే ప్రమాదం ఉంటుంది. అలాంటప్పుడు ఆ షావర్మాను తింటే మనం ఫుడ్ పాయిజనింగ్ బారిన పడే అవకాశాలు ఉంటాయి. దీంతో కడుపులో నొప్పి, వికారం, వాంతులు వంటి సమస్యలు సంభవిస్తాయి. కొన్ని సార్లు ప్రాణాల మీదకు వచ్చే అవకాశం కూడా ఉంటుంది.
ఇక షావర్మా చేసే దగ్గర వ్యక్తులు, పరిసరాలు కూడా నీట్‌గానే ఉండాలి. దుమ్ము, ధూళితో కూడిన చోట షావర్మాను అమ్మితే అసలు తినవద్దు. అలాగే దాన్ని విక్రయించే వారు శుభ్రంగా ఉండాలి. అక్కడి పరిసరాలు అత్యంత పరిశుభ్రంగా ఉండాలి. ఏమాత్రం అజాగ్రత్తగా ఉన్నా సరే మనం ఫుడ్ పాయిజనింగ్ బారిన పడే అవకాశాలు పుష్కలంగా ఉంటాయి. దీంతో లేనిపోని అనారోగ్యాలను కొని తెచ్చుకున్నట్లు అవుతుంది. కొన్ని సార్లు ప్రాణాపాయం కూడా సంభవించవచ్చు. కనుక షావర్మా తినేవారు ఈ విషయాలను తప్పక గుర్తుంచుకోవాలి. లేదంటే ఇబ్బందుల పాలు కాక తప్పదు.