ఇన్‌ఫెక్షన్లు ఉండడం.. బిగుతైన దుస్తులను ధరించడం.. మరీ వేడిగా ఉండే నీటితో స్నానం చేయడం.. ఎక్కువ సేపు కూర్చుని ఉండడం.. అధిక బరువు.. మరీ ఎక్కువగా హస్త ప్రయోగం చేయడం లేదా శృంగారంలో పాల్గొనడం.. పొగ తాగడం.. మద్యం సేవించడం.. మానసిక ఒత్తిడి.. జింక్ లోపం ఉండడం.. ప్రోస్టేట్ గ్రంథిలో ఇన్‌ఫెక్షన్లు.. వంటి అనేక కారణాల వల్ల సాధారణంగానే చాలా మందిలో వీర్యం తక్కువగా ఉంటుంది. దీంతో శుక్ర కణాల సంఖ్య కూడా తగ్గుతుంది. అయితే ఇలా శుక్ర కణాలు తక్కువగా ఉండడాన్నిOligospermia అంటారు. అలాగే శుక్ర కణాలు అస్సలు లేకపోతే దాన్ని azoospermia అంటారు.
ప్రపంచ ఆరోగ్య సంస్థ చెప్పిన ప్రకారం.. 1 ఎంఎల్ వీర్యంలో 2 కోట్ల శుక్ర కణాలు ఉండాలి. ఇలా ఉంటే వీర్యం సాధారణంగా ఉన్నట్లు. అంత కన్నా తగ్గితే పైన తెలిపిన స్థితిగా వర్ణిస్తారు. అయితే కింద తెలిపిన పలు సూచనలు పాటిస్తే ఈ స్థితి నుంచి బయట పడవచ్చు. దీంతో వీర్యం బాగా ఉత్పత్తి అవుతుంది. అలాగే శుక్ర కణాల సంఖ్య కూడా పెరుగుతుంది.
శుక్ర కణాల సంఖ్యను పెంచేందుకు పాటించాల్సిన సూచనలు
* శుక్ర కణాల సంఖ్య బాగా పెరగాలంటే మరీ ఎక్కువగా శృంగారంలో పాల్గొనడం, హస్త ప్రయోగం చేయడం మానేయాలి.
* పొగ తాగడం, మద్యం సేవించడం చేయకూడదు.
* తరచూ వ్యాయామం చేయాలి.
* జింక్ ఎక్కువగా ఉండే ఆహారాలను తీసుకోవాలి. పాలకూర, అవకాడో, మటన్ లివర్, నట్స్, రొయ్యలు, పొద్దు తిరుగుడు విత్తనాలు, గుమ్మడి కాయ విత్తనాలు తదితర ఆహారాలను ఎక్కువగా తీసుకోవాల్సి ఉంటుంది.
* బిగుతుగా ఉన్న దుస్తులను ధరించకూడదు. గోరు వెచ్చని నీటితోనే స్నానం చేయాలి. ఎక్కువగా వేడి ఉండే ప్రదేశంలో ఉండరాదు.
* అధికంగా బరువు ఉంటే తగ్గాలి. ఒత్తిడిని తగ్గించుకుని మనస్సును ప్రశాంతంగా ఉంచుకోవాలి.
* హెర్బల్ ఆయిల్‌తో వారానికి ఒకసారి శరీరం అంతా మర్దనా చేసుకుని తరువాత స్నానం చేయాలి.
* వీలైనంత వరకు చల్లని ప్రదేశాల్లో ఉంటూ.. చల్లని నీటితో స్నానం చేస్తే మంచిది.
శుక్ర కణాల సంఖ్యను పెంచేందుకు ఆయుర్వేద విధానాలు
* శిలాజిత్ ట్యాబ్లెట్లు వీర్యం బాగా ఉత్పత్తి అయ్యేలా చేస్తాయి. శుక్ర కణాల సంఖ్య పెరుగుతుంది. డాక్టర్ల సూచన మేరకు వీటిని వాడుకోవాలి.
* నిత్యం అశ్వగంధ చూర్ణం లేదా అశ్వ గంధ ట్యాబ్లెట్లను వాడినా శుక్ర కణాల సంఖ్య పెరుగుతుంది. అలాగే శృంగార సామర్థ్యం కూడా పెరుగుతుంది. ట్యాబ్లెట్లు అయితే నిత్యం ఉదయం, సాయంత్రం రెండు పూటలా పూటకు 500ఎంజీ చొప్పున ట్యాబ్లెట్లను వాడాలి. డాక్టర్ సూచించిన మేర వీటిని వాడుకోవాల్సి ఉంటుంది.
* పురుషుల్లో శృంగార సామర్థ్యాన్ని పెంచేందుకు శతావరి కూడా పనికొస్తుంది. ఇది కూడా ట్యాబ్లెట్ల రూపంలో లభిస్తుంది. దీంతోనూ శుక్ర కణాల సంఖ్య పెరుగుతుంది.
* నిత్యం నెయ్యి, పాలు, చక్కెరను కలిపి తీసుకోడం వల్ల కూడా శుక్ర కణాల సంఖ్య పెరుగుతుంది. ఒక గ్లాస్ గోరు వెచ్చని పాలలో ఒక టీస్పూన్ నెయ్యి, అంతే మోతాదులో చక్కెరను కలిపి తాగితే ప్రయోజనం ఉంటుంది. అలాగే మినపపప్పు, నల్ల ద్రాక్ష, కోడిగుడ్లు, చేపలు తదితర ఆహారాలను తీసుకోవడం వల్ల కూడా శుక్ర కణాల సంఖ్యను పెంచుకోవచ్చు. దీంతో సంతాన లోపం సమస్య పరిష్కారం అవుతుంది.