Stickers On Fruits : రోజూ ఒక యాపిల్ పండును తింటే డాక్టర్ వద్దకు వెళ్లాల్సిన అవసరమే రాదు.. అని చెబుతుంటారు. ఇది అక్షరాలా సత్యం అని చెప్పవచ్చు. ఎందుకంటే యాపిల్ పండ్లలో మన శరీరానికి ఉపయోగపడే అనేక పోషకాలు ఉంటాయి. ఇవి మనల్ని అన్ని విధాలుగా ఆరోగ్యంగా ఉంచుతాయి. యాపిల్ పండ్లను తినడం వల్ల మనకు అనేక లాభాలు కలుగుతాయి. ముఖ్యంగా గుండె జబ్బులు రాకుండా అడ్డుకోవచ్చు. అధిక బరువును తగ్గించడంలోనూ యాపిల్స్ ఎంతగానో ఉపయోగపడతాయి. దీంతోపాటు జీర్ణ సమస్యలు తగ్గుతాయి. అయితే యాపిల్స్‌ను మీరు బయట మార్కెట్‌లో చాలా రకాలకు చెందినవి చూసి ఉంటారు.
మార్కెట్‌లో మనకు యాపిల్స్ అనేక వెరైటీల్లో లభిస్తుంటాయి. వాటిల్లో చాలా వరకు యాపిల్స్ మీద స్టిక్కర్లు ఉంటాయి. అందువల్ల వాటిని కాస్త ఎక్కువ ధరలకు అమ్ముతుంటారు. ఇక ఈ మధ్య కాలంలో కేవలం యాపిల్స్ మాత్రమే కాకుండా నారింజ, కివి వంటి పండ్ల మీద కూడా స్టిక్కర్లను వేసి అమ్ముతున్నారు. అయితే వాస్తవానికి ఈ స్టిక్కర్ల గురించి చాలా మందికి తెలియదు. ఈ స్టిక్కర్లను ఎందుకు వేస్తారో ఇప్పుడు తెలుసుకుందాం.
3 రకాల స్టిక్కర్లు..
యాపిల్ పండ్ల మీద లేదా ఇతర పండ్ల మీద మనకు 3 రకాల స్టిక్కర్లు కనిపిస్తాయి. ఒక రకం స్టిక్కర్లు 4 అనే అంకెతో ప్రారంభం అవుతాయి. మరో రకం స్టిక్కర్లు 8 లేదా 9 అనే అంకెతో ప్రారంభం అవుతాయి. 4 అంకెతో ప్రారంభం అయ్యే స్టిక్కర్ల మీద నాలుగు నంబర్లు ఉంటాయి. అదే 8 లేదా 9 అంకెతో స్టిక్కర్ మీద నంబర్ ప్రారంభం అయి ఉంటే అవి 5 అంకెలను కలిగి ఉంటాయి.
ఇక స్టిక్కర్ మీద ఉన్న అంకెల్లో మొదటి అంకె 4 అయితే గనక అలాంటి యాపిల్ పండ్లను క్రిమి సంహారకాలు, ఇతర పెస్టిసైడ్స్ వాడి పండించారని అర్థం చేసుకోవాలి. ఇలాంటి పండ్లను మనం తినకూడదు. వీటి ధర కూడా చాలా తక్కువగా ఉంటుంది. ఇక పండ్ల మీద ఉండే స్టిక్కర్ నంబర్ 8 తో ప్రారంభం అయితే అలాంటి పండ్లను జన్యు మార్పిడి ద్వారా పండించారని అర్థం చేసుకోవాలి. ఈ పండ్ల ధరలు ముందు చెప్పిన పండ్ల ధరల కన్నా కాస్త ఎక్కువగా ఉంటాయి.
ఇవి ఆర్గానిక్ పండ్లు..
ఇక పండ్ల మీద స్టిక్కర్ నంబర్ 9 తో ప్రారంభం అయితే అలాంటి పండ్లను ఎలాంటి క్రిమి సంహారకాలు లేదా కెమికల్స్ వాడకుండా పూర్తిగా ఆర్గానిక్ పద్ధతిలో, సేంద్రీయ విధానంలో పండించారని అర్థం చేసుకోవాలి. ఇలాంటి పండ్లు మన ఆరోగ్యానికి ఎంతో మంచిది. అయితే మిగిలిన రెండు రకాల పండ్ల కన్నా ఈ పండ్లు కాస్త ఎక్కువ ధరనే కలిగి ఉంటాయి. అయితే ఆరోగ్యం పరంగా చూస్తే మనం ఇలాంటి పండ్లనే తినాలి. లేదంటే క్రిమి సంహారకాలు వాడి పండించిన పండ్లను తింటే మనకు వ్యాధులు వచ్చే ప్రమాదం ఉంటుంది. కనుక మనం ఎప్పుడూ ఆర్గానిక్ పద్దతిలో పండించిన పండ్లనే తింటుండాలి. అంతేకాదు కూరగాయలు లేదా ఆకుకూరలను కూడా ఇలా పండించినవి తింటేనే ఉత్తమం అని డాక్టర్లు చెబుతున్నారు.
అయితే కొందరు ఈమధ్య కాలంలో క్రిమి సంహారకాలు వేసి పండించిన పండ్లపై కూడా ఆర్గానిక్ స్టిక్కర్లను వేస్తున్నారు. కనుక మీరు కొనే పండ్లపై ఇలాంటి స్టిక్కర్లను కాస్త జాగ్రత్తగా పరిశీలించి మరీ కొనండి. లేదంటే అనవసరంగా అధిక ధర చెల్లించిన వారు అవుతారు. పైగా అలాంటి పండ్లను తినడం అంత శ్రేయస్కరం కూడా కాదు. కాబట్టి పండ్లపై ఉండే స్టిక్కర్లను చూసి గనక మీరు ఆ పండ్లను కొంటుంటే ఈ జాగ్రత్తలను పాటించడం తప్పనిసరి. లేదంటే నష్టపోతారు. కాబట్టి ఈ విషయంలో జాగ్రత్తగా ఉండండి.