Guava Leaves : మనందరికీ అందుబాటులో లభించే పండ్లల్లో జామకాయ కూడా ఒకటి. ఇది మనకు దాదాపుగా అన్నీ కాలాల్లోనూ విరివిరిగా లభిస్తూనే ఉంటుంది. జామకాయలను తినడం వల్ల అనేక రకాల ఆరోగ్యకరమైన ప్రయోజనాలు కలుగుతాయని మనందరికీ తెలిసిందే. కానీ జామకాయలతోపాటు జామ ఆకులు కూడా మనకు ఎంతగానో మేలు చేస్తాయన్న సంగతి మాత్రం మనలో చాలా మందికి తెలిసి ఉండదు. జామ ఆకులు మనకు మేలు చేయడమేంటి అని మనలో చాలా మంది సందేహం వ్యక్తం చేస్తుంటారు. జామ ఆకుల్లో కూడా ఔషధ గుణాలు ఉంటాయని, మనకు వచ్చే పలు రకాల అనారోగ్య సమస్యలను నయం చేయడంలో ఇవి ఎంతగానో సహాయపడతాయని ఆయుర్వేద నిపుణులు చెబుతున్నారు.
రోజూ పరగడుపున మూడు జామ ఆకులను తినడం వల్ల అనేక రకాల ఆరోగ్యకరమైన ప్రయోజనాలు కలుగుతాయని వారు చెబుతున్నారు. జామ ఆకులను తీసుకోవడం వల్ల కలిగే ఆరోగ్యకరమైన ప్రయోజనాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. ఈ ఆకుల్లో యాంటీ ఇన్ ఫ్లామేటరీ లక్షణాలు కూడా ఉంటాయి. ఈ లక్షణాల కారణంగా శరీరంలో వచ్చే నొప్పులు, వాపులను తగ్గించడంలో జామ ఆకులు మనకు దోహదపడతాయి. జామ ఆకుల్లో విటమిన్ సితోపాటు యాంటీ ఆక్సిడెంట్లు కూడా అధికంగా ఉంటాయి. శరీరంలో రక్షణ వ్యవస్థను మెరుగుపరిచి రోగాల బారిన పడకుండా చేయడంలో ఇవి ఎంతో సహాయపడతాయి.
నోటిపూత, చిగుళ్ల వాపు, చిగుళ్ల నుండి రక్తం కారడం, పంటి నొప్పి వంటి సమస్యలతో బాధపడుతున్నప్పుడు జామ ఆకులను తినడం వల్ల ఆయా సమస్యల నుండి సత్వరమే ఉపశమనం కలుగుతుంది. జామ ఆకులను తినలేని వారు జామ ఆకులతో కషాయాన్ని చేసుకుని తాగడం వల్ల కూడా అంతే ప్రయోజనాన్ని పొందవచ్చు. జామ ఆకులతో కషాయాన్ని ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం. ఒక లీటర్ నీటిలో 5 నుండి 10 జామ ఆకులను వేసి ఆ నీరు సగం అయ్యే వరకు బాగా మరిగించాలి. ఇలా చేయడం వల్ల జామ ఆకుల కషాయం తయారవుతుంది. ఈ కషాయాన్ని వడకట్టి రోజూ ఉదయం పూట తాగడం వల్ల ఎన్నో ఆరోగ్యకరమైన లాభాలను పొందవచ్చు.
జామ ఆకుల కషాయాన్ని తాగడం వల్ల రక్తంలో చక్కెర స్థాయిలు అదుపులో ఉంటాయి. దీంతో చక్కెర వ్యాధి నియంత్రణలో ఉంటుంది. ఈ కషాయాన్ని తాగడం వల్ల శరీరంలో పేరుకు పోయిన విషపదార్థాలు తొలగిపోతాయి. అధిక రక్తపోటు సమస్యతో బాధపడే వారు జామ ఆకుల కషాయాన్ని తీసుకోవడం వల్ల రక్తపోటు అదుపులోకి రావడంతోపాటు గుండె ఆరోగ్యం కూడా మెరుగుపడుతుంది. స్త్రీలలో నెలసరి సమయంలో వచ్చే నొప్పులను తగ్గించే గుణం కూడా జామ ఆకుల్లో ఉంటుంది. జామ ఆకుల రసాన్ని లేదా కషాయాన్ని తీసుకోవడం వల్ల నెలసరి సమయంలో పొత్తికడుపులో వచ్చే నొప్పి తగ్గుతుంది.
జామ ఆకులను నేరుగా తిన్నా లేదా ఈ ఆకుల రసాన్ని తాగినా కూడా జీర్ణవ్యవస్థ పనితీరు మెరుగుపడి అజీర్తి, మలబద్దకం వంటి సమస్యలు తగ్గు ముఖం పడతాయి. జామ ఆకులు యాంటీ క్యాన్సర్ ఏజెంట్లుగా కూడా పని చేస్తాయి. ప్రతిరోజూ జామ ఆకులను ఏదో ఒక రూపంలో తీసుకోవడం వల్ల పలు రకాల క్యాన్సర్ లు వచ్చే అవకాశాలు చాలా తక్కువగా ఉంటాయని నిపుణులు చెబుతున్నారు. జామ ఆకులను తీసుకోవడం వల్ల చర్మ ఆరోగ్యం కూడా మెరుగుపడుతుంది.
జామ ఆకులను పేస్ట్ గా చేసి ఆ మిశ్రమాన్ని ముఖానికి రాసుకోవడం వల్ల మొటిమలు, మచ్చలు, ముడతలు తగ్గి ముఖం అందంగా, కాంతివంతంగా కనబడుతుంది. ఈ ఆకులతో చేసిన కషాయాన్ని తాగడం వల్ల శరీరానికి కావల్సిన పోషకాలు అందండంతోపాటు చాలా సమయం వరకు ఆకలి కూడా వేయదు. దీంతో మనం తక్కువ ఆహారాన్ని తీసుకోవడంతో చాలా త్వరగా బరువు తగ్గుతాము. ఈ విధంగా జామ ఆకులు మనకు ఎంతగానో ఉపయోగపడతాయని వీటిని వాడడం వల్ల ఎటువంటి ఖర్చు లేకుండానే మనం అనేక రకాల అనారోగ్య సమస్యల నుండి బయటపడవచ్చని నిపుణులు చెబుతున్నారు.