Walnuts : మనం ఆహారంగా తీసుకునే డ్రై ఫ్రూట్స్ లో వాల్ నట్స్ కూడా ఒకటి. వాల్ నట్స్ చూడడానికి మన శరీరంలో ఉండే మెదడును పోలి ఉంటాయి. వీటిలో ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు, పోషకాలు దాగి ఉన్నాయి. వీటిని తీసుకోవడం వల్ల మన మెదడు ఆరోగ్యానికి ఎంతో మేలు కలుగుతుంది. వైద్య నిపుణులు కూడా వీటిని ఆహారంగా తీసుకోమన సూచిస్తూఉంటారు. వాల్ నట్స్ ను తీసుకోవడం వల్ల మనకు కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటి… వీటిలో ఉండే పోషకాలు ఏమిటి.. అన్న వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం. వాల్ నట్స్ లో ప్రోటీన్, క్యాల్షియం, మెగ్నీషియం, ఐరన్, రాగి, సెలినియం, ఒమెగా 3 ఫ్యాటీ యాసిడ్లతో పాటు ఆరోగ్యకరమైన కొవ్వులు కూడా ఉంటాయి. వాల్ నట్స్ ను తీసుకోవడం వల్ల మెదడు పనితీరు మెరుగుపడుతుంది.
జ్ఞాపకశక్తి పెరుగుతుంది. చదువుకునే పిల్లలకు వీటిని ఆహారంగా ఇవ్వడం వల్ల మంచి ఫలితం ఉంటుంది. వాల్ నట్స్ ను తీసుకోవడం వల్ల ఆలోచనా శక్తి పెరుగుతుంది. మెదడు కణాలు ఆరోగ్యంగా ఉంటాయి. మతిమరుపు, అల్జీమర్స్ వంటి సమస్యలు రాకుండా ఉంటాయి. అలాగే వీటిని తీసుకోవడం వల్ల శరీరంలో చెడు కొలెస్ట్రాల్ స్థాయిలు తగ్గుతాయి. వీటిలో ఉండే ఒమెగా 3 ఫ్యాటీ యాసిడ్లు గుండె ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. అలాగే వీటిలో ప్లేవనాయిడ్స్, ఫైటోస్టెరాల్స్, మెలటోనిన్ కూడా ఉంటాయి. ఇవి గుండె జబ్బులు రాకుండా కాపాడడంలో దోహదపడతాయి. వీటిలో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు, యాంటీ ఇన్ ప్లామేటరీ గుణాలు గుండెపోటు, స్ట్రోక్ వంటి సమస్యలు రాకుండా నిరోధించడంలో సహాయపడతాయి.
అంతేకాకుండా వీటిని తీసుకోవడం వల్ల క్యాన్సర్ వంటి ప్రాణాంతక వ్యాధుల బారిన పడకుండా ఉంటాము. అలాగే బరువు తగ్గడంలో కూడా వాల్ నట్స్ మనకు సహాయపడతాయి. ఆరోగ్యకరమైన చిరుతిళ్లుగా వీటిని మనం తీసుకోవచ్చు. వాల్ నట్స్ ను తీసుకోవడం వల్ల కడుపు నిండిన భావన కలుగుతుంది. ఆకలి తగ్గుతుంది. దీంతో మనం సులభంగా బరువు తగ్గవచ్చు. అలాగే వీటిలో ఉండే పొటాషియం రక్తపోటును అదుపులో ఉంచడంలో దోహదపడుతుంది. రక్తపోటుతో బాధపడే వారు వీటిని తీసుకోవడం వల్ల మంచి ఫలితం ఉంటుంది. వాల్ నట్స్ ను తీసుకోవడం వల్ల పురుషుల్లో వీర్య కణాల సంఖ్య పెరుగుతుంది. ఈ విధంగా వాల్ నట్స్ మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయని వీటిని నానబెట్టి తీసుకోవడం వల్ల చక్కటి ఆరోగ్యాన్ని పొందవచ్చని నిపుణులు చెబుతున్నారు.