Ginger : మన వంటింట్లో తప్పకుండా ఉండాల్సిన వాటిల్లో అల్లం కూడా ఒకటి. పూర్వకాలం నుండి మనం అల్లాన్ని వంటల్లో వాడుతూ వస్తున్నాం. అల్లాన్ని వంటల్లో ఉపయోగించడం వల్ల వంటల రుచి, వాసన పెరగడమే కాకుండా మన శరీరానికి కూడా మేలు కలుగుతుంది. అల్లంలో ఎన్నో ఔషధ గుణాలు ఉంటాయి. పురాతన కాలం నుండి కూడా అల్లాన్ని ఆయుర్వేదంలో ఔషధంగా ఉపయోగిస్తున్నారు. మన శరీరంలో వచ్చే వాత, కఫ, పిత్త దోషాలను తగ్గించే శక్తి అల్లానికి ఉంటుంది.
అజీర్తి, గ్యాస్ సమస్యలతో బాధపడుతున్నవారు పరగడుపున అల్లం రసాన్ని తాగడం వల్ల మంచి ఫలితం ఉంటుంది. భోజనానికి ముందు రెండు అల్లం ముక్కలను ఉప్పుతో కలిపి తీసుకోవడం వల్ల తిన్న ఆహారం త్వరగా జీర్ణమై మలబద్దకం సమస్య రాకుండా ఉంటుంది. కొందరికి ప్రయాణం చేసేటప్పుడు వాంతులు అవుతూ ఉంటాయి. అలాంటి వారు రెండు రోజుల పాటు అల్లం ముక్కలను ఉప్పు నీటిలో నానబెట్టి తరువాత వాటిని తీసి ఎండలో ఎండబెట్టాలి. ప్రయాణం చేసేటప్పుడు లేదా వికారంగా ఉన్నప్పుడు ఆ ముక్కలను నోట్లో వేసుకుని చప్పరిస్తూ ఉండడం వల్ల వాంతులు అవకుండా ఉంటాయి.
దగ్గు, కఫం వంటి వాటితో బాధపడుతున్నవారు ఒక టీ స్పూన్ అల్లం రసంలో ఒక టీ స్పూన్ తేనెను కలిపి పరగడుపున తీసుకోవడం వల్ల కఫ సంబంధిత దోషాలన్నీ తొలగిపోతాయి. అరికాళ్లు, అరచేతుల్లో చర్మం నుండి పొట్టు రాలడం వంటి సమస్యతో బాధపడే వారు అల్లాన్ని, బెల్లాన్ని తీసుకుని బాగా దంచి ఉండలుగా చేసుకుని తినడం వల్ల పొట్టు రాలడం సమస్య తగ్గుతుంది. ఆకలి లేకపోవడం, వాంతులు, వికారం, తలతిరగడం వంటి సమస్యలతో బాధపడుతున్నప్పుడు అల్లం పొడికి రెట్టింపు జీలకర్ర పొడిని కలిపి తీసుకోవడం వల్ల ఆయా సమస్యల నుండి ఉపశమనం కలుగుతుంది.
తరచూ ఆహారంలో భాగంగా అల్లాన్ని తీసుకోవడం వల్ల కీళ్ల నొప్పులు తగ్గుతాయి. ఆముదంలో అల్లం రసాన్ని కలిపి చర్మంపై లేపనంగా రాయడం వల్ల గజ్జి, తామర వంటి చర్మ వ్యాధులు తగ్గు ముఖం పడతాయి. అదే విధంగా దురదలు, దద్దుర్లు వంటి చర్మ వ్యాధులు బాధిస్తున్నప్పుడు తులసి ఆకులు, అల్లం, పసుపు కలిపి నూరి పైపూతగా రాయడం వల్ల దురదలు, దద్దుర్లు తగ్గుతాయి. అల్లం రసంలో దూదిని ముంచి ముఖానికి రాసుకోవడం వల్ల మొటిమలు, మచ్చలు తగ్గుతాయి.
అల్లం రసాన్ని నుదుటిపై రాసుకోవడం వల్ల మైగ్రేన్ తలనొప్పి నుండి ఉపశమనం కలుగుతుంది. షుగర్ వ్యాధి గ్రస్తులు అల్లం రసాన్ని పరగడుపున తీసుకోవడం వల్ల రక్తంలో చక్కెర స్థాయిలు నియంత్రణలో ఉంటాయి. ఈ విధంగా అల్లం మనకు ఎంతగానో ఉపయోగపడుతుందని.. దీనిని తరచూ ఆహారంలో భాగంగా తీసుకోవడం వల్ల మనం ఎన్నో రకాల ఆరోగ్యకరమైన ప్రయోజనాలను పొందవచ్చని.. నిపుణులు చెబుతున్నారు.