Papaya Leaves Juice : మనం ఆహారంగా తీసుకునే పండ్లల్లో బొప్పాయి పండ్లు కూడా ఒకటి. బొప్పాయి పండ్లను తినడం వల్ల మన ఆరోగ్యానికి ఎంతో మేలు కలుగుతుందని మనందరికీ తెలుసు. అయితే బొప్పాయి పండ్లల్లో ఎన్ని పోషకాలైతే ఉంటాయో వాటి కంటే ఎక్కువ పోషకాలు బొప్పాయి చెట్టు ఆకుల్లో ఉంటాయని నిపుణులు చెబుతున్నారు. బొప్పాయి చెట్టు ఆకులు కూడా ఔషధ గుణాలను కలిగి ఉంటాయి. డెంగ్యూ జ్వరం కారణంగా రక్తంలో ప్లేట్ లెట్స్ తగ్గినప్పుడు బొప్పాయి ఆకుల రసం దివ్యౌషధంగా పని చేస్తుంది.
సాధారణంగా మన రక్తంలో ప్లేట్ లెట్స్ సంఖ్య 1,50,000 నుండి 4,50,000 వరకు ఉంటుంది. డెంగ్యూ వైరస్ మన శరీరంలోకి ప్రవేశించి ఈ ప్లేట్ లెట్ల సంఖ్యను క్రమంగా తగ్గిస్తుంది. వీటి సంఖ్య బాగా తగ్గినప్పుడు ప్రాణాపాయం కూడా సంభవిస్తుంది. రక్తంలో ప్లేట్ లెట్ల సంఖ్య తగ్గినప్పుడు క్రమం తప్పకుండా రోజుకు రెండుసార్లు బొప్పాయి ఆకుల రసాన్ని తాగడం వల్ల రక్తంలో ప్లేట్ లెట్ల సంఖ్య పెరుగుతుంది. ఈ ఆకుల్లో ఉండే ఎంజైమ్ లు ప్లేట్ లెట్స్ సంఖ్యను పెంచడంలో ఎంతగానో ఉపయోగపడతాయి.
బొప్పాయి ఆకులను కాండం నుండి వేరు చేసి శుభ్రంగా కడగాలి. ఈ ఆకులకు కొద్దిగా నీటిని కలిపి మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. ఈమిశ్రమాన్ని శుభ్రమైన వస్త్రంలో లేదా జల్లిగంటెలో వేసి పిండుతూ రసాన్ని తీసుకోవాలి. ఈ రసానికి కొద్దిగా తేనెను కలిపి తీసుకోవాలి. ఇలా తేనె కలిపిన బొప్పాయి ఆకుల రసాన్ని తీసుకోవడం వల్ల ప్లేట్ లెట్స్ సంఖ్య పెరగడంతోపాటు అనేక ఆరోగ్యకరమైన ప్రయోజనాలను కూడా పొందవచ్చు. బొప్పాయి ఆకుల రసాన్ని డెంగ్యూ జ్వరం రాని వారు కూడా తాగవచ్చు.
బొప్పాయి ఆకుల్లో ప్రోటీన్స్, విటమిన్స్, మినరల్స్ తోపాటు మన శరీరానికి అవసరమయ్యే ఇతర పోషకాలు కూడా ఉంటాయి. తరచూ బొప్పాయి ఆకుల రసాన్ని తాగడం వల్ల జీర్ణ వ్యవస్థ పనితీరు మెరుగుపడి మలబద్దకం సమస్య తగ్గుతుంది. ఈ రసాన్ని తాగడం వల్ల శరీరంలో రోగనిరోధక శక్తి పెరిగి వ్యాధుల బారిన పడకుండా ఉంటాం. షుగర్ వ్యాధితో బాధపడే వారు తరచూ బొప్పాయి ఆకుల రసాన్ని తీసుకోవడం వల్ల రక్తంలో చక్కెర స్థాయిలు నియంత్రణలో ఉంటాయి.
ఈ ఆకుల రసాన్ని తాగడం వల్ల వయసు పై బడడం వల్ల చర్మం పై వచ్చే ముడతలు తొలగిపోతాయి. ఆరోగ్యానికి మేలు చేస్తుంది కదా అని దీనిని ఎక్కువగా తీసుకోకూడదు. బొప్పాయి ఆకుల రసాన్ని ఎక్కువగా తీసుకుంటే వాంతులు, విరేచనాలు, తలతిరగడం వంటి సమస్యలు వచ్చే అవకాశం ఉంటుంది. ఈ విధంగా బొప్పాయి ఆకుల రసాన్ని తగు మోతాదులో తీసుకుంటే ఆరోగ్యకరమైన ప్రయోజనాలను పొందవచ్చని నిపుణులు సూచిస్తున్నారు.