ఈ రోజుల్లో ప్రతి ఒక్కరు ఏదో ఒక సందర్భంలో అనారోగ్యం బారిన పడడం మనం చూస్తూనే ఉన్నాం. అయితే ఎవరికైనా ఒంట్లో నలతగా ఉంటే ఆసుపత్రికి వెళ్తారు. సాధారణ సీజనల్ ఇన్‌ఫెక్షన్లు అయితే డాక్టర్లు కొన్ని రకాల మందులు సూచిస్తారు. అయితే కొందరిలో రోజులు గడిచినా ఆరోగ్యం మెరుగుపడకపోవడంతో కొన్ని రకాల టెస్ట్‌లు నిర్వహించి అనారోగ్యాన్ని నిర్ధారిస్తారు. అందులో రక్త పరీక్ష కీలకం. దీని ద్వారా ఎన్నో ఆరోగ్య సమస్యలను గుర్తించవచ్చు. ప్రధానంగా రక్తహీనత, అధిక కొలెస్ట్రాల్, విటమిన్‌ల లోపం, అవయవ వైఫల్యం, హెచ్‌ఐవి, క్యాన్సర్ వంటి వాటిని నిర్ధారించవచ్చు. మొత్తం ఆరోగ్యాన్ని ట్రాక్ చేయడానికి ప్రతి సంవత్సరం కొన్ని రకాల బ్లెడ్ టెస్టులు చేయించుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు.
ముందుగా కంప్లీట్ బ్లడ్ కౌంట్(CBC) పరీక్ష .. దీనిని మన బాడీలో రక్తంలో ఎర్ర రక్త కణాలు, తెల్ల రక్త కణాలు, ప్లేట్లెట్ల సంఖ్యను తెలుసుకోవడానికి ఈ పరీక్షను సిఫార్సు చేస్తుంటారు వైద్యులు. లిపిడ్ ప్రొఫైల్ ..ఇది మీ కొలెస్ట్రాల్ స్థాయిలు, గుండె ఆరోగ్యానికి సంబంధించిన ఇతర లిపిడ్ మార్కర్లను అంచనా వేయడంలో సహాయపడుతుంది. ముఖ్యంగా రక్తంలో కొలెస్ట్రాల్ స్థాయిలు ఎక్కువగా ఉన్నాయా? తక్కువగా ఉన్నాయా? అనే విషయంలో క్లారిటీ వస్తుంది. గ్లూకోజ్ పరీక్ష …మధుమేహం లేదా ప్రీడయాబెటిస్ను గుర్తించడంలో ఈ పరీక్ష సహాయపడుతుంది. అయితే, సాధారణంగా రెండు గ్లూకోజ్ టెస్ట్‌లు ఉంటాయి. అందులో ఒకటి ఫాస్టింగ్ బ్లడ్ షుగర్. మరో గ్లూకోజ్ పరీక్ష.. హిమోగ్లోబిన్ A1C.
థైరాయిడ్ .. మీరు ప్రతి సంవత్సరం చేయించుకోవాల్సిన మరో పరీక్ష.థైరాయిడ్ గ్రంథి జీవక్రియ, శక్తి ఉత్పత్తి, వివిధ శారీరక విధుల నియంత్రణలో ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది. అదే ఈ గ్రంథి పనితీరులో ఏదైనా మార్పులు వస్తే అలసట, బరువులో మార్పులు, మానసిక సమస్యలు, హృదయ స్పందన రేటులో మార్పులు వంటి లక్షణాలకు దారితీస్తుందంటున్నారు నిపుణులు. కాంప్రహెన్సివ్ మెటబాలిక్ ప్యానెల్ టెస్ట్ అనేది.. మన బాడీలో వివిధ జీవక్రియల, అవయవాల పనితీరును అంచనా వేసే ఒక సమగ్ర రక్త పరీక్ష. ఈ టెస్ట్.. రక్తంలో గ్లూకోజ్, ఎలక్ట్రోలైట్స్ , మూత్రపిండాల పనితీరు (క్రియాటినిన్, బ్లడ్ యూరియా నైట్రోజన్), కాలేయ పనితీరు (బిలిరుబిన్, అల్బుమిన్, కాలేయ ఎంజైమ్‌లు), ప్రోటీన్ స్థాయిలు సరైన మోతాదులో ఉన్నాయో లేదో తెలుసుకోవడంలో సహాయపడుతుంది.కార్డియాక్ బయోమార్కర్స్ టెస్ట్ ద్వారా హై-సెన్సిటివిటీ కార్డియాక్ ట్రోపోనిన్, బి-టైప్ నాట్రియురేటిక్ పెప్టైడ్ (బిఎన్‌పి), ఎన్-టెర్మినల్ ప్రో-బి-టైప్ నాట్రియురేటిక్ పెప్టైడ్ వంటి పరిస్థితిని నిర్ధారించవచ్చు.