Lungs : మన శరీరంలో ఉన్న అవయవాల్లో ఊపిరితిత్తులు కూడా ఒకటి. ఇవి మనం పీల్చే గాలిని శుద్ధి చేసి శరీరానికి అందిస్తాయి. అలాగే మన లోపల ఉండే హానికారక వాయువులను బయటకు పంపుతాయి. దీంతో మనం ఆరోగ్యంగా ఉంటాం. అయితే ప్రస్తుతం మనం పాటిస్తున్న జీవనశైలితోపాటు ఉంటున్న కాలుష్య వాతావరణం వల్ల మన ఊపిరితిత్తులు త్వరగా చెడిపోతున్నాయి. దీంతో తీవ్ర అనారోగ్య సమస్యలు వస్తున్నాయి. అయితే ఇలా ఊపిరితిత్తులు చెడిపోకుండా ఉండాలంటే.. అందుకు కొన్ని ఆహారాలు ఉపయోగపడతాయి. వీటిని రోజూ తీసుకోవడం వల్ల ఊపిరితిత్తులను ఆరోగ్యంగా ఉంచుకోవచ్చు. ఇక ఊపిరితిత్తులను ఆరోగ్యంగా ఉంచే ఆ ఆహారాలు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం.

దానిమ్మ పండ్లలో యాంటీ ఆక్సిడెంట్లు సమృద్దిగా ఉంటాయి. ఇవి ఊపిరితిత్తులలో కణాలను రక్షిస్తాయి. అందువల్ల వైరస్‌ల బారి నుంచి కణాలకు రక్షణ లభిస్తుంది. అలాగే కణతులు ఏర్పడకుండా ఉంటాయి. దీంతోపాటు శ్వాసకోశ సమస్యలు రాకుండా ఉంటాయి. నిత్యం దానిమ్మ గింజలను తినడం లేదా దానిమ్మ రసాన్ని తాగడం వల్ల ఊపిరితిత్తులు ఆరోగ్యంగా ఉంటాయి. అలాగే ఉల్లిపాయల్లో ఉండే సల్ఫర్ ఊపిరితిత్తుల ఆరోగ్యానికి అద్భుతంగా పనిచేస్తుందని సైంటిస్టులు చెబుతున్నారు. అందువల్ల ఊపిరితిత్తులు ఆరోగ్యంగా ఉండాలంటే.. నిత్యం ఉల్లిపాయలను తినాలని వారు సూచిస్తున్నారు.
యాపిల్ పండ్లలో ఫ్లేవనాయిడ్స్ అనబడే యాంటీ ఆక్సిడెంట్లతోపాటు విటమిన్ బి, సి, ఇ లు పుష్కలంగా ఉంటాయి. ఇవి ఊపిరితిత్తుల ఆరోగ్యాన్ని మెరుగు పరుస్తాయి. కనుక రోజుకు ఒక యాపిల్ ను తిన్నా ఊపిరితిత్తులను ఆరోగ్యంగా ఉంచుకోవచ్చు. ద్రాక్ష పండ్లలో నరింగిన్ అనబడే ఫ్లేవనాయిడ్ ఉంటుంది. ఇది యాంటీ ఆక్సిడెంట్‌లా పనిచేస్తుంది. ఊపిరితిత్తుల ఆరోగ్యాన్ని పదిలంగా ఉంచుతుంది. ఊపిరితిత్తులు శుభ్రంగా మారుతాయి. కనుక ద్రాక్షలను కూడా ఆహారంలో భాగం చేసుకోవాలి. అలాగే నారింజ పండ్లలో విటమిన్ సి పుష్కలంగా ఉంటుంది. ఇది మన శరీర రోగ నిరోధక శక్తిని పెంచుతుంది. దీంతో మన శరీరంలో చేరే వైరస్‌లు, బాక్టీరియాలు నశిస్తాయి. ఈ క్రమంలో లంగ్స్ ఆరోగ్యంగా ఉంటాయి.
క్యారెట్లలో విటమిన్ ఎ, సిలు పుష్కలంగా ఉంటాయి. ఇవి శ్వాసకోశ సమస్యలను నయం చేస్తాయి. ఊపిరితిత్తులను ఆరోగ్యంగా ఉంచుతాయి. అలాగే శరీర రోగ నిరోధక శక్తిని కూడా పెంచుతాయి. బీన్స్‌ను తరచూ తినడం వల్ల ఊపిరితిత్తులను ఆరోగ్యంగా ఉంచుకోవచ్చు. వీటిల్లో ఉండే మెగ్నిషియం ఊపిరితిత్తులకు మేలు చేకూరుస్తుంది. బాదం, పిస్తా పప్పులు, వాల్‌నట్స్, హేజల్ నట్స్.. తదితర నట్స్‌లో యాంటీ ఆక్సిడెంట్లు, ఒమెగా 3 ఫ్యాటీ యాసిడ్లు సమృద్ధిగా ఉంటాయి. ఇవి శరీర రోగ నిరోధక శక్తిని పెంచుతాయి. దీంతో లంగ్స్ ఆరోగ్యంగా ఉంటాయి. ఇన్‌ఫెక్షన్లు రాకుండా ఉంటాయి. పసుపులో కర్‌క్యుమిన్ అనబడే సమ్మేళనం ఉంటుంది. ఇది ఊపిరితిత్తులను రక్షిస్తుంది. వైరస్‌లను నాశనం చేస్తుంది. నిత్యం పాలల్లో పసుపును కలుపుకుని తాగడం వల్ల శరీర రోగ నిరోధక శక్తి కూడా పెరుగుతుంది. కనుక ఈ పదార్థాలను రోజూ తీసుకుంటే ఊపిరితిత్తులను ఆరోగ్యంగా ఉంచుకోవచ్చు. దీంతో శ్వాసకోశ సమస్యలు రాకుండా ఉంటాయి.