Hair Loss : జుట్టు అందంగా, ఆరోగ్యంగా ఉండాలని ప్రతి ఒక్కరు కోరుకుంటారు. అందుకోసం ఎంతో ఖర్చు చేస్తూ ఉంటారు. అన్ని రకాల హెయిర్ ప్రొడక్ట్స్ ను వాడుతూ ఉంటారు. అయినప్పటికి మనలో చాలా మంది అనేక రకాల జుట్టు సమస్యలను ఎదుర్కొంటున్నారు. ముఖ్యంగా చాలా మంది జుట్టు రాలడం, జుట్టు పలచబడడం, జుట్టు నిర్జీవంగా మారడం వంటి సమస్యలను ఎదుర్కొంటున్నారు. అయితే ఇలా జుట్టు సమస్యలతో బాధపడే వారు హెయిర్ ప్రొడక్స్ ను వాడడంతో పాటు తగిన ఆహారాన్ని తీసుకోవడం కూడా చాలా అవసరమని నిపుణులు చెబుతున్నారు. ప్రోటీన్ మరియు పోషకాలతో నిండిన ఆహారాన్ని తీసుకోవడం వల్ల జుట్టు పెరుగుతుందని వారు చెబుతున్నారు. సరైన ఆహారాన్ని తీసుకోవడం వల్ల జుట్టు రాలడం తగ్గడంతో పాటు జుట్టు కాంతివంతంగా తయారవుతుందని వారు చెబుతున్నారు.
జుట్టు ఒత్తుగా, ఆరోగ్యంగా పెరగాలనుకునే వారు, జుట్టు సమస్యలతో బాధపడే వారు తీసుకోవాల్సిన ఆహారాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. జుట్టు ఆరోగ్యంగా ఉండాలనుకునే వారు సాల్మన్, సార్డినెస్, మాకేరెల్ వంటి చేపలను తీసుకోవాలి. వీటిలో ఉండే ప్రోటీన్, ఒమెగా 3 ఫ్యాటీయాసిడ్లు జుట్టు పెరుగుదలలో ఎంతగానో సహాయపడతాయి. అలాగే గ్రీక్ పెరుగును తీసుకోవాలి. దీనిలో ఉండే విటమిన్ బి5 మరియు ప్రోటీన్ జుట్టుకు రక్తప్రసరణను పెంచి జుట్టు రాలడాన్ని తగ్గించడంలో దోహదపడతాయి. అలాగే ఆకుకూరలను ఎక్కువగా తీసుకోవాలి. ఐరన్, బీటా కెరోటీన్, ఫోలేట్, విటమిన్ ఎ, సిలతో ముఖ్యమైన ఖనిజాలు కూడా ఆకుకూరల్లో ఉంటాయి. ఆకుకూరలను తీసుకోవడం వల్ల జుట్టు పెరగడంతో పాటు జుట్టు ఆరోగ్యం కూడా మెరుగుపడుతుంది. అలాగే జుట్టు విరగడం వంటి సమస్యలతో బాధపడే వారు జామకాయలను తీసుకోవాలి.
జామకాయల్లో విటమిన్ సి ఎక్కువగా ఉంటుంది. ఇది జుట్టు విరగకుండా కాపాడడంలో సహాయపడుతుంది. అదే విధంగా తృణ ధాన్యాలను కూడా ఆహారంలో భాగంగా తీసుకోవాలి. వీటిలో ఉండే ఐరన్ జుట్టు రాలడాన్ని తగ్గించడంలో సహాయపడతాయి. అలాగే జుట్టు పెరుగుదలకు గానూ ప్రోటీన్ ఎంతో అవసరం. కనుక ప్రోటీన్ ఎక్కువగా ఉండే ఆహారాలను తీసుకోవాలి. గుడ్లు, మాంసం, చికెన్ వంటి ఆహారాలను తీసుకోవడం వల్ల తగినంత ప్రోటీన్ లభిస్తుంది. వీటిని తీసుకోవడం వల్ల జుట్టు రాలడం తగ్గడంతో పాటు జుట్టు ఒత్తుగా పెరుగుతుంది. ఇక జుట్టు పొడిబారడం వంటి సమస్యలతో బాధపడే వారు చిలగడదుంపలను తీసుకోవాలి. వీటిలో బీటా కెరోటీన్ ఎక్కువగా ఉంటుంది. ఇది జుట్టు పొడిబారకుండా నివారించడంలో సహాయపడుతుంది. ఈ విధంగా తగిన ఆహారాలను తీసుకోవడం వల్ల జుట్టు సమస్యల నుండి చాలా సులభంగా బయటపడవచ్చని అంతేకాకుండా జుట్టు ఆరోగ్యంగా, ఒత్తుగా పెరుగుతుందని నిపుణులు చెబుతున్నారు.