కరోనా సమయం కనుక ప్రస్తుతం ప్రతి ఒక్కరూ తమ ఊపిరితిత్తులను ఆరోగ్యంగా ఉంచుకోవాల్సిన అవసరం ఏర్పడింది. ఊపిరితిత్తులను ఆరోగ్యంగా ఉంచుకుంటే ఎలాంటి ఇన్‌ఫెక్షన్లు రాకుండా ఉంటాయి. దీంతో శరీరంలో ఇతర భాగాలకు ఇన్‌ఫెక్షన్ వ్యాప్తి చెందకుండా ఉంటుంది. ఆయా అవయవాలు ఆరోగ్యంగా ఉంటాయి. ప్రస్తుతం కరోనా ఎక్కువగా వ్యాప్తి చెందుతుంది కనుక ప్రతి ఒక్కరూ ఊపిరితిత్తుల ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాలి. అయితే కింద తెలిపిన ఆహారాలను రోజూ తీసుకోవడం వల్ల ఊపిరితిత్తులను ఆరోగ్యంగా ఉంచుకోవచ్చు. మరి ఆ ఆహారాలు ఏమిటంటే..
1. రోజూ ఒక యాపిల్‌ను తింటే డాక్టర్ వద్దకు వెళ్లాల్సిన అవసరమే రాదు.. అని చెబుతుంటారు. అలా చెప్పినట్లుగానే రోజూ ఒక యాపిల్‌ను తినడం వల్ల ఊపిరితిత్తులు ఆరోగ్యంగా ఉంటాయి. ఇతర శ్వాసకోశ సమస్యలు కూడా తగ్గుతాయి. యాపిల్ పండ్లలో యాంటీ ఆక్సిడెంట్లు, ఫ్లేవనాయిడ్స్, విటమిన్ సి అధికంగా ఉంటాయి. ఇవి ఆస్తమా, లంగ్ క్యాన్సర్, ఇతర శ్వాస కోశ సమస్యలను రాకుండా చూస్తాయి. ఊపిరితిత్తులను ఆరోగ్యంగా ఉంచుతాయి.
2. గుమ్మడికాయల్లో బీటా కెరోటిన్, జియాగ్జంతిన్ లు ఉంటాయి. ఇవి యాంటీ ఆక్సిడెంట్, యాంటీ ఇన్‌ఫ్లామేటరీ లక్షణాలను కలిగి ఉంటాయి. ఇవి ఊపిరితిత్తుల ఆరోగ్యాన్ని మెరుగు పరుస్తాయి.
3. పసుపును భారతీయులు రోజూ వంటల్లో వాడుతుంటారు. ఇందులో ఉండే కర్కుమిన్ ఊపిరితిత్తుల ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. పసుపులో ఉండే యాంటీ ఇన్‌ఫ్లామేటరీ, యాంటీ ఆక్సిడెంట్ లక్షణాలు ఊపిరితిత్తులను ఆరోగ్యంగా ఉంచుతాయి. రోజూ పాలలో పసుపును కలిపి తాగితే ఊపిరితిత్తుల ఆరోగ్యం మెరుగు పడుతుంది.
4. మిరియాల్లో విటమిన్ సి సమృద్ధిగా ఉంటుంది. ఇది యాంటీ ఆక్సిడెంట్‌లా పనిచేస్తుంది. రోజూ మిరియాలను తీసుకోవడం వల్ల ఊపిరితిత్తులు ఆరోగ్యంగా ఉంటాయి.
5. బీట్‌రూట్‌లలో నైట్రేట్లు అధికంగా ఉంటాయి. ఇవి ఊపిరితిత్తులను ఆరోగ్యంగా ఉంచుతాయి. శరీరంలో ఆక్సిజన్ సరఫరాను పెంచుతాయి. బీట్‌రూట్‌లో ఉండే మెగ్నిషియం, పొటాషియం, విటమిన్ సి, కెరోటినాయిడ్‌లు ఊపిరితిత్తుల పనితీరును మెరుగు పరుస్తాయి.
6. పెరుగులో కాల్షియం, పొటాషియం, ఫాస్ఫరస్, సెలీనియం తదితర పోషకాలు సమృద్ధిగా ఉంటాయి. ఇవి ఊపిరితిత్తులకు ఇన్ఫెక్షన్లు రాకుండా చూస్తాయి. వ్యాధుల నుంచి ఊపిరితిత్తులను రక్షిస్తాయి.