రాత్రయిందంటే చాలు ఘుమ ఘుమలాడే రుచికరమైన వంటకాలతో మనం విందు భోజనం ఆరగిస్తాం. ఉదయం, మధ్యాహ్నం అంతగా తినని వారు కూడా రాత్రికి వచ్చే సరికి కొంచెం ఎక్కువగానే లాగించేస్తుంటారు. అయితే మీకు తెలుసా..? రాత్రి పూట మనం తినే భోజనమే అనేక అనారోగ్యాలకు కారణమవుతుందని..? అందుకే అన్నారు, ఉదయం రాజులాగా ఎక్కువ మొత్తంలో ఆహారం తినాలట. అదే మధ్యాహ్నం మంత్రిలా, రాత్రికి బంటులా భోజనం ఆరగించాలట. అంటే ఉదయం నుంచి రాత్రికి వచ్చే సరికి తిండి మొత్తాన్ని చాలా వరకు తగ్గించి తినాలని, అప్పుడే మనం ఆరోగ్యంగా ఉంటామని ఆ సామెత సారాంశం. సరే, ఆ విషయాన్ని ఎంత మంది పాటిస్తున్నారో తెలియదు. కానీ, రాత్రి పూట భోజనం విషయంలో మనం తెలుసుకోవాల్సిన ముఖ్యమైన విషయాలు కొన్ని ఉన్నాయి. మనం రాత్రి డిన్నర్‌లో ఎలాంటి ఆహారం తినాలో, ఏవి తినకూడదో ఇప్పుడు తెలుసుకుందాం.
రాత్రి పూట ఆహారంలో జంక్ ఫుడ్, నూనె పదార్థాలు, ఫ్రాజెన్ ఫుడ్, మాంసాహారం, బాగా కొవ్వు ఉన్న పదార్థాలను అస్సలు తినకూడదు. లేదంటే వాటి వల్ల అనారోగ్య సమస్యలు తలెత్తుతాయి. ప్రధానంగా దగ్గు, జలుబు వంటి సమస్యలు ఉన్నవారు ముందు చెప్పిన ఆహారాన్ని రాత్రి పూట అస్సలు తినకూడదు. లేదంటే జీర్ణ సంబంధ సమస్యలు వస్తాయి. అలర్జీలు వ్యాపిస్తాయి. రాత్రి పూట ఆహారంలో పెరుగుకు బదులుగా మజ్జిగను తీసుకోవాలి. అదేవిధంగా అన్నంకు బదులుగా చపాతీలను తినాలి. అవి కూడా తగ్గించి తినాలి. లేదంటే ఎక్కువ ఆహారం వల్ల జీర్ణం ఆలస్యమై గ్యాస్, అసిడిటీ, మలబద్దకం వంటి సమస్యలు వస్తాయి. దీంతోపాటు రాత్రి పూట వీలైనంత వరకు ఉప్పును తగ్గించి తినాలి. లేదంటే మానేయాలి. ఒక వేళ ఉప్పు ఉన్న పదార్థాలను రాత్రి పూట ఎక్కువగా తింటే శరీరంలోకి నీరు ఎక్కువగా వస్తుంది.
ఆకుపచ్చని కూరగాయలను రాత్రి పూట ఎక్కువగా తినాలి. ఇవి జీర్ణ ప్రక్రియను మెరుగు పరుస్తాయి. వీటితోపాటు అల్లం వంటి పదార్థాలను కలుపుకుని తింటే దాంతో శరీరానికి రాత్రి పూట కావల్సిన వేడి అందుతుంది. రాత్రి పూట చక్కెరకు బదులుగా తేనె వాడాలి. చల్లని పాలు తాగరాదు. కొవ్వు తక్కువగా ఉన్న, కొవ్వు తీసిన పాలు తాగవచ్చు. ఇవి సులభంగా జీర్ణమవుతాయి. ఈ పదార్థాల్లో వేటిని తిన్నా బాగా తక్కువ మొత్తంలో తినాలి. వీలైనంత వరకు కడుపును చాలా వరకు ఖాళీగా ఉంచాలి. దీని వల్ల జీర్ణ సంబంధ సమస్యలు రావు. అంతేకాదు, రాత్రి భోజనం తరువాత కనీసం 3 గంటలు ఆగి నిద్రపోవాలి. దీంతో నిద్ర చక్కగా పడుతుంది.
రాత్రి పూట మన శరీరానికి చాలా తక్కువ మొత్తంలో శక్తి అవసరం అవుతుంది. అందుకని కొంత ఆహారం మాత్రమే తింటే చాలు. అదే ఆహారం ఎక్కువైతే అందులో శక్తికి పోను మిగిలినదంతా కొవ్వు కింద మారి శరీరంలో నిల్వ ఉంటుంది. ఇది మనకు హాని కలిగిస్తుంది. స్థూలకాయం, గుండె జబ్బులు, మధుమేహం వంటి వ్యాధులకు కారణమవుతుంది.