ప్రస్తుత తరుణంలో జీర్ణ సమస్యలు చాలా సహజం అయ్యాయి. చాలా మందికి ఏదో ఒక జీర్ణ సమస్య వస్తోంది. కొందరికి అజీర్ణం ఉంటుంది. కొందరికి గ్యాస్, కొందరికి మలబద్దకం.. ఇలా ఒక్కొక్కరికి ఒక్కో జీర్ణ సమస్య ఉంటుంది. అయితే రోజూ ఈ ఆహారాలను తీసుకోవడం వల్ల జీర్ణ సమస్యలను తగ్గించుకోవచ్చు. అలాగే జీర్ణశక్తి పెరుగుతుంది. మరి ఆ ఆహారాలు ఏమిటంటే..
1. పెరుగులో మన శరీరానికి మేలు చేసే మంచి బాక్టీరియా ఉంటుంది. కనుక ఇంట్లో తయారు చేసిన పెరుగును రోజూ తీసుకోవాలి. ఇది సహజసిద్ధమైన ప్రొ బయోటిక్ ఆహారం. కనుక జీర్ణాశయంలో ఉండే మంచి బాక్టీరియాకు మేలు జరుగుతుంది. రోజూ రెండు పూటలా భోజనంలో పెరుగు లేదా మజ్జిగను తీసుకోవాలి. దీని వల్ల జీర్ణ శక్తి పెరుగుతుంది. ఇతర జీర్ణ సమస్యలు తగ్గుతాయి.
2. భోజనం చేసిన తరువాత చాలా మంది సోంపు గింజలను తింటుంటారు. ఇది చాలా మంచి అలవాటు. అందరూ ఇలాగే చేయాలి. దీని వల్ల జీర్ణశక్తి పెరుగుతుంది. గ్యాస్, అసిడిటీ, కడుపు నొప్పి సమస్యలు తగ్గుతాయి.
3. ఓట్స్, క్వినోవా, బ్రౌన్ రైస్ వంటి తృణ ధాన్యాలను రోజూ తీసుకోవాలి. వీటిల్లో ఫైబర్ (పీచు) ఎక్కువగా ఉంటుంది. ఇది జీర్ణశక్తిని మెరుగు పరుస్తుంది. కొంచెం తిన్నా కడుపు నిండిన భావన కలుగుతుంది. అతిగా తినకుండా జాగ్రత్త పడవచ్చు. దీంతో బరువు తగ్గడం తేలికవుతుంది. అలాగే మలబద్దకం తగ్గుతుంది. దీంతోపాటు జీర్ణశక్తి పెరుగుతుంది.
4. అల్లంను ఎంతో పురాతన కాలం నుంచి పలు సమస్యలను నయం చేసేందుకు ఉపయోగిస్తున్నారు. దీన్ని వాడడం వల్ల వికారం, వాంతికి వచ్చినట్లు ఉండడం, మోషన్ సిక్‌నెస్, గ్యాస్, అసిడిటీ వంటివి తగ్గుతాయి. ఆకలి పెరుగుతుంది. భోజనం చేయడానికి ముందు 1 టీస్పూన్ అల్లం రసంను సేవించడం వల్ల జీర్ణశక్తి పెరుగుతుంది. జీర్ణ సమస్యలు తగ్గుతాయి.
5. క్యాబేజీని తరచూ ఆహారంలో భాగం చేసుకోవడం వల్ల జీర్ణవ్యవస్థలో ఉండే మంచి బాక్టీరియాకు మేలు జరుగుతుంది. దీంతో పేగుల్లో ఉండే వ్యర్థాలు సులభంగా బయటకు వెళ్లిపోతాయి. మలబద్దకం తగ్గుతుంది.
6. యాపిల్ పండ్లలో పెక్టిన్ ఉంటుంది. ఇది ఒక సాల్యుబుల్ ఫైబర్. ఇది మలబద్దకం, డయేరియా సమస్యలను తగ్గిస్తుంది. పేగులకు ఇన్‌ఫెక్షన్లు రాకుండా చూస్తుంది. పెద్ద పేగుకు వాపులు రాకుండా రక్షిస్తుంది. జీర్ణశక్తిని పెంచి జీర్ణ సమస్యలను తగ్గిస్తుంది. అందువల్ల యాపిల్ పండ్లను రోజూ తింటే మంచిది.
7. చియా విత్తనాల్లో ఫైబర్ అధికంగా ఉంటుంది. ఇది చిన్న పేగులను రక్షిస్తుంది. జీర్ణవ్యవస్థలోని మంచి బాక్టీరియాకు మేలు చేస్తుంది. జీర్ణశక్తిని పెంచుతుంది. కాబట్టి రోజూ చియా సీడ్స్‌ను తినాలి.