Healthy Foods : మన శరీర ఆరోగ్యం మనం తీసుకునే ఆహారంపై ఆధారపడి ఉంటుంది. మనం ఆరోగ్యంగా, ఫిట్ గా, ఉత్సాహంగా పని చేసుకోవాలన్నా,అనారోగ్య సమస్యలు మన దరి చేరకుండా ఉండాలన్నా అన్ని రకాల ఆహారాలను మనం రోజూ ఆహారంగా తీసుకోవాలి. మనం తీసుకునే ఆహారంపై ప్రత్యేక శ్రద్ద వహించాలి. మనం చక్కటి ఆహారాన్ని తీసుకుంటేనే మనం ఏదైనా సులభంగా చేయగలుగుతాము. చక్కటి నిద్రను సొంతం చేసుకోగలుగుతాము. మనం ఏ ఆహారాలను తీసుకున్నా తీసుకోకపోయిన ఇప్పుడు చెప్పే ఆహారాలను మాత్రం రోజూ తప్పకుండా తీసుకోవాలి. ఈ ఆహారాలను తీసుకోవడం వల్ల మనం చక్కటి ఆరోగ్యాన్ని సొంతం చేసుకోవచ్చు. మనం రోజూ తప్పకుండా తీసుకోవాల్సిన ఆహారాలు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం. మనం తీసుకోవాల్సిన ఆహారాల్లో వెల్లుల్లి రెబ్బలు కూడా ఒకటి. వెల్లుల్లిని తీసుకోవడం వల్ల గుండె ఆరోగ్యం మెరుగుపడుతుంది.
రక్తప్రసరణ వ్యవస్థ సక్రమంగా సాగుతుంది. శరీరంలో ఉండే చెడు కొలెస్ట్రాల్ స్థాయిలు తగ్గుతాయి. వీటిలో ఉండే యాంటీ బ్యాక్టీరియల్, యాంటీ ఫంగల్ వంటి లక్షణాలు మనల్ని ఇన్ఫెక్షన్ ల బారిన పడకుండా కాపాడడంలో సహాయపడతాయి. ఇక పోషకాలు కలిగి ఉన్న ఆహారాల్లో టమాటాలు కూడా ఒకటి. వీటిలో విటమిన్ సి, లైకోపీన్, బీటా కెరోటిన్, పొటాషియం, విటమిన్ ఇ, ప్లేవనాయిడ్స్, ఫోలేట్ వంటి పోషకాలు పుష్కలంగా ఉంటాయి. చర్మాన్ని, జుట్టును ఆరోగ్యంగా ఉంచడంలో, గుండె జబ్బులు, క్యాన్సర్, డయాబెటిస్ వంటి జబ్బుల బారిన పడకుండా కాపాడడంలో కూడా టమాటాలు మనకు దోహదపడతాయి. కనుక ఇవి కూడా రోజూ ఆహారంలో ఉండేలా చూసుకోవాలి. అదే విధంగా మన ఆరోగ్యానికి మేలు చేసే వాటిలో ఉల్లిపాయలు కూడా ఒకటి. ఉల్లిపాయలను వంటల్లో విరివిగా వాడుతూ ఉంటాము. వీటిని వంటల్లో వాడడం వల్ల వంటల రుచి పెరగడంతో పాటు మన ఆరోగ్యానికి కూడా మేలు కలుగుతుంది.
వీటిలో యాంటీ ఆక్సిడెంట్లు, విటమిన్ సి, విటమిన్ బి6, ఫైబర్ వంటి ఎన్నో పోషకాలు ఉంటాయి. వీటిని తీసుకోవడం వల్ల దీర్ఘకాలిక అనారోగ్య సమస్యల బారిన పడకుండా ఉంటాము. శరీరంలో రోగనిరోధక శక్తి కూడా పెరుగుతుంది. ఇక మనం వంటల్లో అల్లాన్ని కూడా ఎక్కువగా వాడుతూ ఉంటాము. అల్లం కూడా మన ఆహారంలో రోజూ ఉండేలా చూసుకోవాలి. చక్కటి ఆరోగ్యాన్ని అందించడంలో అల్లం ఎంతో సహాయపడుతుంది. అధిక బరువును, షుగర్ ను అదుపులో ఉంచడంలో, జీర్ణవ్యవస్థను సక్రమంగా ఉంచడంలో అల్లం మనకు ఎంతో దోహపడుతుంది. ఇక రోజూ పచ్చిమిర్చిని తీసుకోవడం వల్ల కూడా మనం చక్కటి ఆరోగ్యాన్ని పొందవచ్చు. దీనిలో విటమిన్ ఎ, విటమిన్ సి, విటమిన్ బి6, క్యాల్షియం, జింక్, ఐరన్, వంటి ఎన్నో పోషకాలు ఉంటాయి. దీనిని తీసుకోవడం వల్ల బరువు అదుపులో ఉంటుంది. షుగర్ వ్యాధి అదుపులో ఉంటుంది.
జీవక్రియల రేటు పెరుగుతుంది. రక్తప్రసరణ వ్యవస్థ మెరుగుపడుతుంది. అలాగే రోజూ ఒక గుడ్డును తీసుకోవాలి. వైద్యులు కూడా రోజూ ఒక గుడ్డును తీసుకోవాలని చెబుతూ ఉంటారు. గుడ్డులో ప్రోటీన్, విటమిన్ బి6, విటమిన్ బి12, ఫోలిక్ యాసిడ్, పొటాషియం, సోడియం, థయామిన్, ఐరన్, జింక్ వంటి ఎన్నో పోషకాలు ఉన్నాయి. రోజూ గుడ్డును తీసుకోవడం వల్ల శరీరంలో రోగనిరోధక శక్తి పెరుగుతుంది. ఎముకలు ధృడంగా ఉంటాయి. గుండె, కళ్లు, మెదడు వంటి అవయవాల ఆరోగ్యం మెరుగుపడుతుంది. ఇక పోషకాలు ఎక్కువగా ఉండే ఆహారాల్లో డ్రై ఫ్రూట్స్ కూడా ఒకటి. వీటిని తీసుకోవడం వల్ల గుండె ఆరోగ్యం మెరుగుపడుతుంది. శరీరంలో మంచి కొలెస్ట్రాల్ స్థాయిలు పెరుగుతాయి. శరీరానికి కావల్సిన పోషకాలు అందుతాయి. కనుక వీటిని కూడా రోజూ ఆహారంలో ఉండేలా చూసుకోవాలి. ఈ విధంగా ఈ ఆహారాలను రోజూ తీసుకోవడం వల్ల మనం చక్కటి ఆరోగ్యాన్ని పొందవచ్చని ఎటువంటి అనారోగ్య సమస్యలు మన దరి చేరకుండా ఉంటాయని నిపుణులు చెబుతున్నారు.