వర్షాకాలం వచ్చిందంటే చాలు.. సహజంగానే చాలా మంది అనారోగ్యాల బారిన పడుతుంటారు. జ్వరం, దగ్గు, జలుబు, ఇన్‌ఫెక్షన్లు, గొంతు సమస్యలు వస్తుంటాయి. మిగిలిన అన్ని సీజన్ల కన్నా ఈ సీజన్‌లోనే ఆరోగ్యం పట్ల జాగ్రత్తగా ఉండాలి. ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి. ఈ సీజన్‌లో దోమల బెడద ఎక్కువగా ఉంటుంది కనుక మలేరియా, డెంగీ, ఇతర విష జ్వరాలతోపాటు కలుషిత నీటిని తాగడం, ఆహారం తినడం వల్ల టైఫాయిడ్ వంటి వ్యాధుల బారిన పడేందుకు అవకాశం ఉంటుంది. కనుక ఈ సీజన్‌లో కచ్చితంగా ఆరోగ్యం పట్ల జాగ్రత్త వహించాలి.
ఇక వర్షాకాలంలో వానలో ఎక్కువగా తడుస్తారు కనుక చర్మం, జుట్టు సమస్యలు కూడా ఎక్కువగానే వస్తాయి. అలాగే కోవిడ్ ప్రమాదం పొంచి ఉంది కనుక వర్షాకాలంలో అన్ని రకాలుగా జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. ముఖ్యంగా ఆహారం విషయంలో జాగ్రత్తలు పాటించాలి.
1. వర్షాకాలంలో నూనెతో తయారు చేసిన పదార్థాలను పూర్తిగా తగ్గించాలి. లేదా మానేయాలి. బయట అయితే ఆ ఆహారాలను అస్సలు తినరాదు. అంతగా తినాలనిపిస్తే ఇంట్లోనే తయారు చేసుకోవాలి. బయట సమోసాలు, బజ్జీలు, పునుగులు, ఇతర నూనె పదార్థాలను ఎక్కువగా తీసుకుంటారు. కనుక ఆ ఆహారాలను మానేయాలి. దీని వల్ల అనారోగ్య సమస్యలు రాకుండా జాగ్రత్తగా ఉండవచ్చు.
2. వర్షాకాలంలో మనకు ఎక్కువగా బాక్టీరియా, వైరస్, ఫంగస్ ఇన్‌ఫెక్షన్లు వ్యాప్తి చెందుతుంటాయి. ఇక ఆకు కూరల్లో పురుగులు ఎక్కువగా వస్తుంటాయి. కనుక ఆకు కూరలను బాగా శుభ్రం చేసుకుని తినడం మంచిది. లేదంటే జీర్ణ సమస్యలు వస్తాయి. ఈ సీజన్‌లో ఆకుకూరలతోపాటు పుట్ట గొడుగులు, కాలిఫ్లవర్ వంటి వాటిని వండే ముందు శుభ్రంగా కడగాలి. తరువాతే వంట వండి తినాలి.
3. పచ్చి కూరగాయలను తినడం వల్ల కొందరికి ఈ సీజన్‌లో అనారోగ్య సమస్యలు వస్తుంటాయి. కనుక వాటిని ఉడక బెట్టుకుని తినడం మంచిది.
4. వర్షాకాలంలో సముద్రపు ఆహారాలు.. అంటే చేపలు, రొయ్యలను అస్సలు తినరాదు. వీటిల్లో నీరు ఎక్కువగా కలుషితమై వస్తుంది. కనుక ఈ సీజన్‌లో సముద్రపు ఆహారాలకు దూరంగా ఉండాలి.
5. చికెన్, మటన్, గుడ్లు వంటి పదార్థాల ద్వారా ఈ సీజన్‌లో సూక్ష్మ క్రిములు ఎక్కువగా వ్యాప్తి చెందుతాయి. కనుక వాటిని బాగా శుభ్రం చేసి, బాగా ఉడికించి తినాలి.
వర్షాకాలంలో ఆహారం విషయంలో ఈ జాగ్రత్తలను పాటించడం వల్ల ఆరోగ్యంగా ఉండవచ్చు.
ఎప్పటికప్పుడు అప్‌డేట్స్ కోసం టెలిగ్రామ్‌లో మమ్మల్ని ఫాలో అవ్వండి: Ayurvedam365