ఎంత వ్యాయామం చేసినా పొట్ట దగ్గర ఉన్న కొవ్వు కరగడం లేదని ఆందోళన చెందుతున్నారా ? అయితే మీ ఆందోళన కరెక్టే. కానీ వ్యాయామంతోపాటు సరైన ఆహారం తీసుకోవడం కూడా అవసరం. ఎంత వ్యాయామం చేసినప్పటికీ ఆరోగ్యకరమైన ఆహారాలను తీసుకోకపోతే వ్యాయామం చేసినా ఫలితం ఉండదు. దాని వల్ల బరువు తగ్గకపోగా పొట్ట దగ్గరి కొవ్వు కూడా పెరుగుతుంది. ఈ క్రమంలోనే పొట్ట దగ్గరి కొవ్వును పెంచే ఆహారాలు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం.
కేకులు, క్యాండీలు, ఫ్రాజన్ ఫుడ్, సోడా, శీతల పానీయాలు, పేస్ట్రీలలో చక్కెర ఎక్కువగా ఉంటుంది. ఇవి శరీరం ఇన్సులిన్‌ను గ్రహించకుండా అడ్డుకుంటాయి. దీంతో శరీరంలో కొవ్వు నిల్వలు అధికమవుతాయి. పొట్ట దగ్గర కొవ్వు పేరుకుపోతుంది.
వైట్ బ్రెడ్, బాగా పాలిష్ చేసిన బియ్యం, బ్రేక్‌ఫాస్ట్ సిరియల్స్, క్యాన్డ్ సూప్స్, టిన్న్‌డ్ వెజిటబుల్స్, ఆలు చిప్స్, పై లు, మఫిన్స్, బిస్కెట్లు, కుకీస్ వంటివి చాలా రుచిగా ఉంటాయి. కానీ వాటిల్లో పోషకాలు ఏమాత్రం ఉండవు. పైగా వాటిలో చక్కెర, ఉప్పు, నూనె, క్యాలరీలు, ట్రాన్స్ ఫ్యాట్స్ అధికంగా ఉంటాయి. దీని వల్ల వాటిని తింటే పొట్ట దగ్గర కొవ్వు సులభంగా పేరుకుపోతుంది. కనుక వీటికి దూరంగా ఉండాలి.
ప్రాసెస్ చేయబడిన మాంసాహారాలను తినడం వల్ల కూడా శరీరంలో, ముఖ్యంగా పొట్ట దగ్గర కొవ్వు అధికంగా పేరుకుపోతుంది. వాటిల్లో శాచురేటెడ్ ఫ్యాట్స్, క్యాలరీలు అధికంగా ఉంటాయి. అందువల్ల వాటిని తినరాదు. మాంసం అప్పటికప్పుడు తెచ్చుకుని తింటేనే మేలు జరుగుతుంది. ప్రాసెస్ చేయబడిన మాంసాన్ని తినకూడదు.
మద్యం సేవించడం వల్ల క్యాలరీలు ఎక్కువగా లభిస్తాయి. అవి కరిగించకపోతే శరీరంలో కొవ్వు పేరుకుపోతుంది. పొట్ట పెరుగుతుంది. కనుక మద్యం సేవించడం మానేయాలి.
కార్బొహైడ్రేట్లు (పిండి పదార్థాలు) అధికంగా ఉండే వైట్ పాస్తా, తెల్లన్నం, డోనట్స్ వంటివి తినరాదు. వీటి వల్ల కూడా శరీరంలో కొవ్వు పేరుకుపోతుంది.
నూనెలో బాగా వేయించబడిన ఆహారాలను కూడా తినరాదు. వాటిల్లో ట్రాన్స్‌ఫ్యాట్స్ అధికంగా ఉంటాయి. అవి కొవ్వుగా పేరుకుపోతాయి. వీటిని కూడా మానేస్తే మంచిది. లేదంటే పొట్ట దగ్గర కూడా కొవ్వు పేరుకుపోతుంది.