Tea With Cardamom : మనం దైనందిన జీవితంలో టీ తాగడం అనేది ఒక భాగం అయిపోయింది. చాలా మంది ఉదయాన్నే టీ తాగడం ద్వారా తమ రోజును ప్రారంభిస్తారు. టీ తాగనిదే కొందరికి ఉదయం సంతృప్తిగా అనిపించదు. ఇక కొందరు అయితే రోజంతా కప్పుల మీద కప్పులు టీని తాగుతుంటారు. అలాగే కొందరు చల్లని వాతావరణం ఉన్నప్పుడు టీ ఎక్కువగా తాగుతారు. టీలో కొందరు బిస్కెట్లు లేదా టోస్ట్‌లు, బ్రెడ్ వంటివి ముంచుకుని కొందరు తింటారు. ఇలా ఎవరికి నచ్చినట్లు వారు టీ రుచిని ఆస్వాదిస్తారు.
అయితే టీ సహజంగానే ఆమ్ల స్వభావాన్ని కలిగి ఉంటుంది. అందువల్ల టీని సేవిస్తే మన పొట్టలో యాసిడ్ లెవల్స్ పెరుగుతాయి. అయితే టీలో యాలకులను కలపడం వల్ల ఈ అసిడిటీని తగ్గించుకోవచ్చా.. అని చాలా మంది సందేహిస్తుంటారు. అయితే దీనికి నిపుణులు ఏమని సమాధానం చెబుతున్నారో ఇప్పుడు తెలుసుకుందాం. నీళ్ల పీహెచ్ విలువ 7గా ఉంటుంది. అంటే ఇది తటస్థం అన్నమాట. ఇంతకన్నా తక్కువగా పీహెచ్ స్థాయిలు ఉంటే దాన్ని ఆమ్ల పదార్థంగా భావిస్తారు. ఇక టీ పీహెచ్ విలువ సుమారుగా 6.4 నుంచి 6.8 మధ్య ఉంటుంది. అందువల్ల టీని ఆమ్ల పదార్థంగా చెప్పవచ్చు.
టీ తయారు చేసేటప్పుడు యాలకులను వేస్తే..
అయితే టీ తయారు చేసేటప్పుడు దాంట్లో యాలకులను కలిపి చేసినప్పటికీ టీ పీహెచ్ స్థాయి అనేది పెద్దగా మారదు. ఆమ్ల స్వభావాన్నే కలిగి ఉంటుంది. అందువల్ల టీలో యాలకులను కలిపితే అసిడిటీ తగ్గుతుందనేది అపోహే అని చెప్పవచ్చు. అలాంటి టీని తాగినా కూడా అసిడిటీ పెరుగుతుంది. అయితే మరి అసిడిటీని తగ్గించుకోవడం ఎలా.. అంటే అందుకు కొన్ని చిట్కాలను పాటించాల్సి ఉంటుంది. అవేమిటంటే..
జీర్ణ సమస్యలను తగ్గించడంలో వాము ఎంతగానో ఉపయోగపడుతుంది. వాములో ఉండే థైమోల్ అనే సమ్మేళనం జీర్ణ వ్యవస్థను ఆరోగ్యంగా ఉంచుతుంది. అందువల్ల అసిడిటీ ఉన్నవారు కాస్త వామును కొద్దిగా ఉప్పుతో కలిపి బాగా నలిపి తినాలి. వెంటనే గోరువెచ్చని నీటిని తాగాలి. ఇలా చేస్తుండడం వల్ల అసిడిటీ నుంచి ఉపశమనం లభిస్తుంది. అలాగే అసిడిటీ తగ్గేందుకు సోంపు గింజలను తినవచ్చు. భోజనం చేసిన ప్రతిసారీ ఒక టేబుల్ స్పూన్ సోంపు గింజలను నోట్లో వేసుకుని నమిలి తింటుంటే అసిడిటీ ఉండదు. లేదా సోంపు గింజలను వేసి మరిగించిన నీళ్లను సైతం తాగవచ్చు. అదేవిధంగా చల్లని పాలు సహజసిద్ధమైన అంటాసిడ్ మాదిరిగా పనిచేస్తాయి. కనుక అసిడిటీ ఉన్నవారు చల్లని పాలను తాగవచ్చు.
తేనెతో అసిడిటీ సమస్యకు చెక్..
ఇక అసిడిటీని తగ్గించడంలో చల్లని పెరుగు కూడా ఎంతో ఉపయోగపడుతుంది. అలాగే ఒక గ్లాస్ గోరు వెచ్చని నీటిలో కాస్త తేనె కలిపి తాగినా కూడా అసిడిటీ తగ్గుతుంది. తేనె పొట్టలోని యాసిడ్లను తటస్థీకరిస్తుంది. దీంతో పొట్టలో ఆమ్ల స్వభావం తగ్గుతుంది. ఫలితంగా అసిడిటీ నుంచి ఉపశమనం లభిస్తుంది. అలాగే ధనియాలను వేసి మరిగించిన నీళ్లను తాగవచ్చు. లేదా కొత్తిమీర ఆకుల రసం తాగవచ్చు. ఈ విధంగా పలు చిట్కాలను పాటించడం వల్ల అసిడిటీ సమస్య నుంచి ఉపశమనం పొందవచ్చు.