Foods : మనం రోజూ అనేక రకాల ఆహారాలను తింటుంటాం. అయితే ఏ ఆహారాలను తిన్నా కూడా మోతాదులోనే తినాలి, మరీ అతిగా తినకూడదని పెద్దలు చెబుతుంటారు. అలాగే వైద్యులు కూడా ఇదే విషయంపై సలహాలు, సూచనలు ఇస్తుంటారు. అయితే కొన్ని ఆహారాలను ఎక్కువగా తిన్నా పెద్దగా హాని ఏమీ ఉండదు. కానీ రోజూ మనం తినే కొన్ని ఆహారాలను తక్కువగా మాత్రమే తినాలి. ఎక్కువ మోతాదులో వాటిని తింటే ఆరోగ్యానికి హాని కలుగుతుంది. వాటిని ఎక్కువగా తినడం వల్ల ఆరోగ్య ప్రయోజనాలు కలగకపోగా మనకు అవి అనారోగ్య సమస్యలను తెచ్చి పెడతాయి. ఇక అలాంటి ఆహారాలు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం.
మనం తరచూ నెయ్యిని ఆహారంలో తీసుకుంటూ ఉంటాం. దీన్ని రోజూ 1 టీస్పూన్ మోతాదులోనే తినాలి. అంతకన్నా మించితే ఇది మనకు ప్రయోజనాలను అందించకపోగా మన ఆరోగ్యంపై దుష్ప్రభావం చూపిస్తుంది. కనుక నెయ్యిని మోతాదుకు మించి తినరాదు. అలాగే అన్నాన్ని కూడా తక్కువగానే తినాలి. అన్నం తింటే మనకు కావల్సిన కార్బొహైడ్రేట్లు లభిస్తాయి. దీంతో శరీరానికి శక్తి లభించి మనం ఎక్కువ సేపు పనిచేయగలుగుతాం. అయితే అన్నాన్ని మన శరీరానికి కావల్సిన మోతాదులోనే తినాలి. ఎక్కువగా తింటే అధికంగా బరువు పెరుగుతారు. దీంతో ఇతర అనారోగ్య సమస్యలు వస్తాయి. కనుక అన్నాన్ని కూడా మనం రోజూ ఎంత కావాలో అంతే తినాలి.
ఇక ఊరగాయలు అంటే చాలా మందికి ఇష్టమే. నిమ్మ, ఉసిరి, మామిడి, చింతపండు, టమాటా.. ఇలా అనేక రకాల ఊరగాయలను పెట్టుకుని ఏడాది పొడవునా అన్నంలో తింటుంటారు. అయితే ఊరగాయల వల్ల ఆరోగ్యానికి మేలు జరుగుతుందట. వీటిల్లో ప్రో బయోటిక్స్, యాంటీ ఆక్సిడెంట్లు ఉంటాయి. ఇవి రోగ నిరోధక శక్తిని పెంచడంతోపాటు పొట్ట ఆరోగ్యాన్ని మెరుగు పరుస్తాయి. అయితే రుచిగా ఉన్నాయి కదా అని ఊరగాయలను అదే పనిగా తినకూడదు. తింటే కడుపు ఉబ్బరం, అసిడిటీ, గ్యాస్ వంటి సమస్యలను ఎదుర్కోవాల్సి వస్తుంది. కనుక ఊరగాయలను కూడా మోతాదులోనే తినాలి.
అలాగే కొబ్బరి మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. దీన్ని తింటే మనకు ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయి. మనకు ఆరోగ్యకరమైన కొవ్వులు లభిస్తాయి. బరువు తగ్గవచ్చు. మెటబాలిజం మెరుగు పడుతుంది. కానీ కొబ్బరిని మోతాదుకు మించి తింటే బరువు పెరిగిపోతారు. కనుక దీన్ని కూడా తక్కువగానే తినాలి. ఇలా కొన్ని రకాల ఆహారాలను మనం తక్కువగా తింటేనే ఆరోగ్య ప్రయోజనాలను పొందగలుగుతాము. అదే ఎక్కువ తింటే అవి మన ఆరోగ్యంపై నెగెటివ్ ప్రభావం చూపిస్తాయి. కనుక ఏ ఫుడ్ విషయంలోనూ అతి పనికిరాదు. అది మన ఆరోగ్యానికి కీడు చేస్తుంది.