Kidneys : మనం ఆరోగ్యంగా జీవించాలంటే రోజూ సమతుల ఆహారం తీసుకోవడం తప్పనిసరి. అలాగే శారీరక శ్రమ కూడా ఉండాలి. శారీరక శ్రమ లేకపోతే కనీసం 30 నిమిషాల పాటు వ్యాయామం అయినా చేయాలి. వేళకు నిద్రపోవాలి. తగినన్ని నీళ్లను రోజూ తాగాలి. రోజూ పౌష్టికాహారం అందేలా చూసుకోవాలి. అప్పుడే మనం ఆరోగ్యంగా ఉంటాం. అయితే మనం రోజూ పాటించే కొన్ని అలవాట్లు, చేసే పనులు మనల్ని వ్యాధుల బారిన పడేలా చేస్తాయి. ముఖ్యంగా జీవనశైలి అస్తవ్యస్తంగా ఉంటే కిడ్నీ సంబంధిత సమస్యలు వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. పలు చెడు అలవాట్ల కారణంగా మీకు కిడ్నీ వ్యాధులు వచ్చే అవకాశాలు పెరుగుతాయి.
మన శరీరంలో ఎప్పటికప్పుడు పేరుకుపోయే వ్యర్థాలు, విష పదార్థాలను బయటకు పంపించడంలో కిడ్నీలు ముఖ్యపాత్ర పోషిస్తాయి. అందుకని కిడ్నీలు నిరంతరాయంగా ఈ పని చేస్తూనే ఉంటాయి. దీని వల్ల మన శరీరం వ్యాధుల నుంచి రక్షించబడుతుంది. అయితే కొన్ని అలవాట్ల కారణంగా కిడ్నీల పనితీరు దెబ్బతింటుంది. ముఖ్యంగా ఉప్పును చాలా మంది రోజూ అవసరం ఉన్న దానికన్నా ఎక్కువగా వాడుతుంటారు. ఇలా చేయడం ఏమాత్రం మంచిది కాదు. ఉప్పులో సోడియం అధికంగా ఉంటుంది. మన శరీరంలో ఉప్పు ఎక్కువగా చేరితే సోడియం నిల్వలు పెరిగిపోతాయి. దీంతో కిడ్నీ వ్యాధులు వచ్చే ప్రమాదం ఉంటుంది. అలాగే ఉప్పును అధికంగా తీసుకోవడం వల్ల బీపీ పెరుగుతుంది. ఇది హైబీపీకి దారి తీస్తుంది. మూత్ర పిండాలపై కూడా చెడు ప్రభావం పడుతుంది.

హైబీపీ వస్తే అది గుండె ఆరోగ్యంపై కూడా చెడు ప్రభావాన్ని చూపిస్తుంది. చాలా మంది నీళ్లను రోజూ అసలు తాగరు లేదా అవసరం అయిన దాని కన్నా తక్కువ నీళ్లను తాగుతారు. ఇది ఏమాత్రం మంచిది కాదు. తగినన్ని నీళ్లను తాగకపోతే కిడ్నీలు మన శరీరంలోని వ్యర్థాలను బయటకు పంపలేవు. దీంతో వ్యర్థాలు పేరుకుపోతాయి. ఫలితంగా కిడ్నీలపై అధిక భారం పడి కిడ్నీలు ఫెయిల్ అవుతాయి. ఇది జరిగితే ప్రాణాంతక పరిస్థితులు ఏర్పడుతాయి. కాబట్టి నీళ్లను రోజూ తగిన మొత్తంలో తాగాలి. కనీసం 2 లీటర్ల నీళ్లను అయినా సరే తాగాల్సి ఉంటుంది.
చాలా మంది రోజూ ఆల్కహాల్‌ను అధిక మొత్తంలో సేవిస్తుంటారు. ఇది కిడ్నీలకే కాదు లివర్‌కు కూడా మంచిది కాదు. శరీరంలో చేరే ఆల్కహాల్‌ను బయటకు పంపేందుకు లివర్, కిడ్నీలు శ్రమిస్తాయి. వారంలో ఒక రోజు అయితే ఓకే. కానీ రోజూ మద్యం సేవిస్తే ఈ రెండు అవయవాలకు మద్యాన్ని బయటకు పంపించడంలోనే టైమ్ అయిపోతుంది. ఇక వేరే పనులు చేయలేవు. ఫలితంగా దీర్ఘకాలంలో ఇది కిడ్నీ పనితీరుపై, లివర్ పనితీరుపై ప్రభావం చూపిస్తుంది. దీంతో ఆ రెండు అవయవాలు ఫెయిల్ అయ్యే అవకాశాలు ఉంటాయి. కనుక మద్యం తాగడాన్ని తక్కువ చేసుకోవాలి. లేదా పూర్తిగా మానేయాలి.
ప్రస్తుత రోజుల్లో చాలా మంది ఇన్‌స్టంట్ ఫుడ్స్, ప్రాసెస్డ్ ఫుడ్స్ ఎక్కువగా తింటున్నారు. వీటిల్లోనూ సోడియం ఎక్కువగానే ఉంటుంది. ఇది కిడ్నీలకు చేటు చేస్తుంది. కనుక ఈ ఆహారాలను తినడం కూడా తగ్గించాలి. చాలా మంది మాంసాహారం అధికంగా తింటుంటారు. ప్రోటీన్లు ఎక్కువగా ఉంటాయి కనుక అలా తింటారు. కానీ మోతాదుకు మించి ప్రోటీన్లను తింటే అది కిడ్నీలపై నెగెటివ్ ప్రభావాన్ని చూపిస్తుంది. కనుక కిడ్నీలు ఆరోగ్యంగా ఉండాలంటే మాంసాహారాన్ని కూడా మితంగా తినాలి.