వయస్సు మీద పడడం వల్ల ఎవరికైనా సరే సహజంగానే ఎముకలు బలహీనంగా మారుతుంటాయి. దీంతో కీళ్ల నొప్పులు వస్తుంటాయి. ఎముకలు పెళుసుగా మారి త్వరగా విరిగిపోయేందుకు అవకాశం ఉంటుంది. అయితే ప్రస్తుత తరుణంలో ఎముకల సమస్యలు యుక్త వయస్సులో ఉన్నవారికి కూడా వస్తున్నాయి. రోజూ వారు చేసే అనేక పొరపాట్ల వల్ల వారి ఎముకలు బలహీనంగా మారుతుంటాయి. మరి ఆ పొరపాట్లు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందామా..!
1. పొగ తాగడం వల్ల శరీరంలో ఫ్రీ ర్యాడికల్స్ ఎక్కువగా ఉత్పత్తి అవుతాయి. ఇవి ఎముకలను బలహీనంగా మారుస్తాయి. ఎముకల సాంద్రతను తగ్గిస్తాయి. దీంతో సహజంగానే ఎముకలు నొప్పిగా ఉంటాయి. అందువల్ల పొగ తాగడం మానేయాల్సి ఉంటుంది.
2. ఎక్కువ సేపు కూర్చుని పనిచేసే వారు శారీరక శ్రమ తక్కువగా చేస్తుంటారు. కనుక వీరిలోనూ ఎముకలు బలహీనంగా మారుతాయి. కాబట్టి వీరు రోజూ వ్యాయామం చేయాల్సి ఉంటుంది. దీంతో ఎముకలను ఆరోగ్యంగా ఉంచుకోవచ్చు.
3. విపరీతంగా మద్యం సేవించడం వల్ల శరీరంలో హార్మోన్లు తగ్గుతాయి. ఇది ఎముకలపై ప్రభావం చూపిస్తుంది. కనుక మద్యం సేవించడం మానుకోవాలి.
4. ఉప్పు ఎక్కువగా ఉండే ఆహారాలను తీసుకుంటున్నా ఎముకలు బలహీనంగా మారుతాయి. కనుక రోజూ తీసుకునే ఉప్పు పరిమాణాన్ని తగ్గించాలి.
5. మన శరీరానికి విటమిన్ డి, కాల్షియం రెండూ ఎంతో అవసరం. ఎముకల ఆరోగ్యానికి ఇవి ముఖ్యమైన పోషకాలు. ఇవి తగినంత లభించకపోయినా ఎముకలు బలహీనంగా మారుతాయి. కనుక విటమిన్ డి, కాల్షియం ఎక్కువగా అందేలా చూసుకోవాలి. దీంతో ఎముకలను ఆరోగ్యంగా, దృఢంగా ఉంచుకోవచ్చు.