Ghee : చలికాలం మొదలవడంతో ఎంతో మంది ఎన్నో అనారోగ్య సమస్యలను, చర్మ సమస్యలను ఎదుర్కొంటూ ఎంతో బాధపడుతుంటారు. అయితే ఈ విధమైన అనారోగ్య సమస్యలతో బాధపడే వారికి నెయ్యి ఒక చక్కని పరిష్కార మార్గం అని చెప్పవచ్చు. ఈ క్రమంలోనే చలికాలంలో నెయ్యి తినడం వల్ల ఎలాంటి ప్రయోజనాలు కలుగుతాయో ఇప్పుడు తెలుసుకుందాం.
1. ముఖ్యంగా చలికాలంలో ప్రతి ఒక్కరూ ఎదుర్కొనే సమస్యలలో చర్మ సమస్య ఒకటి. అధిక చలి తీవ్రత కారణంగా చర్మంపై పగుళ్లు ఏర్పడి ఎంతో బాధను కలిగిస్తాయి. ఇలా చర్మ సమస్యలకు ఎన్ని క్రీములు వాడినా ప్రయోజనం ఉండదు. అలాంటి సమయంలో ఒక టేబుల్ స్పూన్ నెయ్యి, చిటికెడు పసుపు వేసి బాగా కలిపి పగుళ్ళకు పట్టించడం వల్ల తొందరగా ఈ సమస్యనుంచి ఉపశమనం పొందవచ్చు.
2. చలి తీవ్రతను తట్టుకోలేని వారు ప్రతి రోజూ వేడి అన్నంలోకి నెయ్యి వేసుకొని తినడం వల్ల ఒంట్లో వేడి పెరుగుతుంది. దీంతో వెచ్చగా ఉండవచ్చు. చలి పారిపోతుంది.
3. చలి కాలంలో చాలా మంది జీర్ణ సమస్యలతో బాధపడుతుంటారు. ఇలాంటివారు పడుకునేముందు గోరువెచ్చని పాలలో ఒకస్పూన్ నెయ్యి కలుపుకుని తాగడం వల్ల జీర్ణ సమస్యలు తొలగిపోతాయి. ముఖ్యంగా మలబద్దకం ఉండదు. సుఖంగా విరేచనం అవుతుంది.
4. ప్రతిరోజూ ఆహారంలో నెయ్యి కలుపుకుని తినడం వల్ల మన శరీరంలో రోగనిరోధక శక్తి పెరుగుతుంది. ఈ సీజన్‌లో వచ్చే శ్వాసకోశ సమస్యలతోపాటు ఇతర వ్యాధుల బారిన పడకుండా సురక్షితంగా ఉండవచ్చు. అందుకని చలికాలంలో నెయ్యిని కచ్చితంగా తీసుకోండి..!