భారతదేశం ఆయుర్వేద శాస్త్రానికి పుట్టినిల్లు. శాస్త్రసాంకేతికత అభివృద్ది చెందని సమయంలోనే అనేక రోగాలకు చికిత్సలు, ముందు జాగ్రత్తలు సూచించిన విజ్ఞాన సర్వస్వం ఆయుర్వేదం. పెరట్లోని మొక్కలు చేసే మహాద్బుతాలను తెలియజెప్పింది ఆయుర్వేదశాస్త్రం. అలాంటి ఆయుర్వేద శాస్త్రం భోజనం చేసాక కొన్ని పనులు చేయకూడదని బల్ల గుద్ది చెపుతోంది. అలా చేస్తే ఆరోగ్యం క్షీణించడమే కాదు శరీరానికి ప్రమాదం అని కూడా హెచ్చరిస్తోంది. అవేంటో ఓ సారి చూద్దాం. భోజనం చేసిన తరువాత ఎట్టి పరిస్థితిల్లో పండ్లు తినకూడదు. కారణం.. భోజనం చేసిన తరువాత వెంటనే పండ్లు తిన్నట్లయితే ఆహరం త్వరగా జీర్ణం కాదు. కడుపు మొత్తం గాలితో నిండిపోతుంది. దీంతో అజీర్తి కలిగే అవకాశం ఉంటుంది. కొన్ని సందర్భాల్లో ఫుడ్ పాయిజన్ బారిన పడే అవకాశం కూడా లేకపోలేదు. ఒక వేళ తప్పని సరిగా పండ్లు తినే అలవాటు ఉంటే మాత్రం గంట ముందు లేదా గంట తరువాత తీసుకుంటే మంచిది.
అన్నం తిన్న తరువాత టీ తాగరాదు. కారణం.. భారత దేశంలో ఎక్కువ మంది ఈ తప్పును చేస్తున్నారు. అన్నం తిన్న వెంటనే టీ తాగడం వలన పెద్ద మొత్తంలో యాసిడ్ విడుదలవుతుంది. జీర్ణ వ్యవస్థ మందగించి ఆలస్యంగా ఆహారం జీర్ణం అవుతుంది. తిన్న తరువాత వెంటనే నడవకూడదు. కారణం.. తిన్న తరువాత వెంటనే నడిస్తే జీర్ణ వ్యవస్థలో పెద్ద మొత్తంలో యాసిడ్స్ రిలీజ్ అవుతాయి. దీంతో కడుపులో మంట ఏర్పడే అవకాశం ఉంది. అందుకని తిన్న తరువాత కాసేపు విశ్రాంతి తీసుకుని 30 నిమిషాల తరువాత నడక ప్రారంభించాలి. తిన్న వెంటనే బెల్టు లూస్ చేసుకోకూడదు. కారణం.. చాలా మంది అతిగా తిన్నామన్న ఉద్దేశ్యంతో బెల్ట్ ను కాస్త లూస్ చేస్తారు. అలా చేయకూడదు.. దీని వల్ల ఎక్కడైనా ఆగిపోయిన ఆహారం కిందికి రాదు.. సరిగ్గా జీర్ణం కాదు.
ఎట్టి పరిస్థితిలో తిన్నాక స్నానం చేయకూడదు.. కారణం.. ఉదయం అయినా సాయంత్రం అయినా భోజనం చేసిన వెంటనే స్నానం చేయకూడదు. అలా చేస్తే రక్తం అంతా కాళ్లకు, చేతులకు మొత్తం ఒంటికి పాకి, పొట్ట దగ్గర రక్తం తగ్గిపోయి జీర్ణ ప్రక్రియ నెమ్మదిస్తుంది. దీని వల్ల జీర్ణ వ్యవస్ధ సామర్ధ్యం తగ్గిపోతుంది. అన్నం తిన్న వెంటనే నిద్ర పోకూడదు.. కారణం.. భోజనం చేసిన వెెంటనే నిద్రలోకి జారుకుంటే ఇబ్బందే. ఆహారం సరిగ్గా జీర్ణం అవ్వక గ్యాస్ట్రిక్, ఇన్ ఫెక్షన్ వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. మామూలుగా భోజనం చేసిన వెంటనే ఎవరికైనా నిద్ర వస్తుంది. తప్పకుండా పడుకోవాలి అంటే ఒక 10 నిమిషాలు పడుకొని లేవటం మంచిది. అలాగే నిద్రను కొనసాగిస్తే ఆరోగ్యానికి ఇబ్బంది తప్పదు.
భోజనం చేశాక ఈత కొట్టకూడదు.. కారణం.. తిన్నవెంటనే స్విమ్ చేయడం ప్రమాదం అని చెపుతోంది ఆయుర్వేదం. రక్త ప్రసరణ వేగం పెరిగి శరీర కండరాలు స్తబ్ధుగా మారుతాయని చెపుతోంది. జిమ్, వ్యాయమం.. ఆటలు కూడా ఆడకూడదు. భోజనం చేశాక ధూమపానం చేయకూడదు.. కారణం.. ధూమపానం ఎప్పుడు చేసిన ప్రమాదమే కానీ తిన్న తరువాత ధూమపానం అసలు చేయకూడదు. అలా చేయడం వల్ల ఒకే సారి 10 సిగరెట్లు తాగిన ఎఫెక్ట్ ను కాలేయానికి అందిస్తుందంట. దీంతో ఊపిరితిత్తులపై భారం ఎక్కువవుతుందని చెపుతోంది ఆయుర్వేదం.