Cotton Buds : చెవులలో గులిమి తీయడానికి కాటన్ బడ్స్ ను వాడుతున్నారా.. కాటన్ బడ్స్‌ను వాడడం వలన చెవికి హానికరమట. కాటన్ ఇయర్ బడ్స్ వాడడం వలన ఇంగ్లాండ్ లో ప్రతి ఏడాది 7వేల మందికి చెవి సంబంధిత అనారోగ్యాలు కలుగుతున్నాయని అధ్యయనాలు చెబుతున్నాయి. మన శరీరంలో ఉన్న అత్యంత సున్నితమైన భాగాల్లో చెవి అంతర్గత భాగం కూడా ఒకటి. దాంట్లో ఎన్నో రకాల నరాలు అత్యంత సున్నితంగా ఉంటాయి. వాటికి ఏదైనా తాకితే ఇక అంతే సంగతులు, చెవి వినబడకుండా పోవడమో, ఇన్‌ఫెక్షన్లు రావడమో, ఇంకా వేరే చెవి సంబంధ అనారోగ్య సమస్యలు రావడమో జరుగుతుంటుంది.
కాటన్ బడ్స్ ను ఉపయోగించడం వల్ల చెవిలోని అంతర్గత భాగాలు డ్యామేజ్ అవుతాయని డాక్టర్లు చెబుతున్నారు. చెవిలో ఉండే గులిమిని తీయడం కోసం ఒకవేళ కాటన్ బడ్ పెడితే ఆ గులిమిని మరింత లోపలికి నెట్టి, ఇయర్ కెనాల్‌కు అడ్డంకి ఏర్పడుతుంది. దీంతో వినికిడి సమస్యలు వస్తాయి. చెవుల్లో గులిమి ఏర్పడడం సహజసిద్ధమైన ప్రక్రియ. చెవిలో అంతర్గతంగా ఉండే కొన్ని గ్రంథులు గులిమిని స్రవిస్తాయి. ఇది సాధారణ స్థాయిలో ఉంటే మనకు దాంతో కలిగే అనారోగ్యం ఏమీ ఉండదు. గులిమిలో యాంటీ బాక్టీరియల్ గుణాలు ఉంటాయి. ఇవి శరీర రోగ నిరోధక వ్యవస్థకు సహకరిస్తాయి. దీంతోపాటు చెవులను శుభ్రంగా ఉంచడం కోసం కూడా గులిమి తయారవుతుంది.
చెవిలో తయారయ్యే గులిమి సహజంగా కొన్ని రోజులకు దానంతట అదే పోతుంది. అంతేకానీ దాన్ని తీయడం కోసం కాటన్ బడ్స్‌ను వాడకూడదని చెబుతున్నారు వైద్యులు. కొంత మందిలో గులిమి ఎక్కువగా తయారవుతుంది. అలాంటి వారు గులిమిని క్లీన్ చేసుకోవాలంటే 1 టీస్పూన్ ఉప్పును తీసుకుని 1/2 కప్ గోరు వెచ్చని నీటిలో కలపాలి. చెవుల్లో పెట్టుకునే దూదిని కొద్దిగా తీసుకుని ఆ మిశ్రమంలో నానబెట్టాలి. అనంతరం ఆ దూదిని తీసి సమస్య ఉన్న చెవిని పై వైపుకు వచ్చేలా తలను ఓ వైపుకు వంచి ఆ చెవిలో దూదిని పిండాలి. అందులో నుంచి కొంత ద్రవం చుక్కలు చుక్కలుగా చెవిలో పడుతుంది.
తరువాత చెవిని 3 నుంచి 5 నిమిషాల పాటు అలాగే వంచి ఉంచాలి. సమయం గడిచాక తలను మరో వైపుకు వంచితే ఆ ద్రవం చుక్కలు చెవి గుండా బయటకు వస్తాయి. అనంతరం చెవులను నీటితో శుభ్ర పరుచుకోవాలి. ఇలా చేస్తే అధికంగా ఉన్న గులిమి పోతుంది. అయితే పైన చెప్పిన విధంగా ఉప్పు ద్రవమే కాకుండా దాని స్థానంలో బేబీ ఆయిల్, మినరల్ ఆయిల్ వంటివి వాడుకోవచ్చు. కానీ వాటి వలన మీకు ఎలాంటి అలర్జీలు లేకపోతేనే వాటిని ట్రై చేయాలి.. లేదంటే సాల్ట్ వాటరే బెటర్. ఇలా చెవుల్లోని గులిమిని క్లీన్ చేయవచ్చు. అంతేకానీ కాటన్ బడ్స్‌ను వాడొద్దని వైద్యులు చెబుతున్నారు.